వైసీపీ ఎమ్మెల్సీ పదవితోనే జనసేన ప్రెసిడెంట్ గా..!
ఆ పదవితో ఆయన ఎన్నికల వేళ మరింతగా కష్టపడి పార్టీని పటిష్టం చేయాలని కోరారు.
By: Tupaki Desk | 5 Jan 2024 4:15 AM GMTరాజకీయాల్లో నైతిక విలువలు నేతి బీరకాయ చందం అని పదే పదే చెప్పుకోవాల్సిన అవసరం లేదు. ఆ మాటకు వస్తే ఎవరు నైతిక విలువలు పాటిస్తున్నారు అన్న చర్చ కూడా వస్తుంది. ఇదిలా ఉంటే జనసేనలో చేరిన విశాఖ ఎమ్మెల్సీ వైసీపీ నేత వంశీ క్రిష్ణ శ్రీనివాస్ కి విశాఖ అర్బన్ జిల్లా జనసేన ప్రెసిడెంట్ పదవిని ఇస్తూ పవన్ కళ్యాణ్ కీలక నిర్ణయం తీసుకున్నారు.
ఆ పదవితో ఆయన ఎన్నికల వేళ మరింతగా కష్టపడి పార్టీని పటిష్టం చేయాలని కోరారు. సరే వంశీ జనసేనలో చేరారు కాబట్టి దానికి బహుమతిగా ఆయన సీనియారిటీని గౌరవిస్తూ కీలక పదవిని అప్పగించారని అనుకోవచ్చు. కానీ వంశీ ఈ రోజుకీ ఎమ్మెల్సీగా టెక్నికల్ గా వైసీపీ తరఫున శాసనమండలిలో ఉన్నారు.
ఆయన వైసీపీ ద్వారా సంక్రమించిన ఆ పదవికి రాజీనామా చేయలేదు. అదేమిటి అంటే తనను జనసేన అధినాయకత్వం రాజీనామా చేయవద్దు అని చెప్పిందని అంటున్నారు. ఇపుడు ఆయన ఆ పదవితోనే జనసేన రాజకీయాలలో చురుకుగా పాల్గొంటున్నారు.
మరో వైపు చూస్తే ఆయన వైసీపీకి రాజీనామా చేశారు కాబట్టి ఆ పార్టీ ఇచ్చిన ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేయాల్సిందే అని డిమాండ్ ను వైసీపీ నేతలు వినిపిస్తున్నారు. వంశీ రాజీనామా చేయకపోతే మండలి చైర్మన్ ఆయన మీద చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. దీని మీద తొందరలోనే వైసీపీ తరఫున వైసీపీ నేతలు ఒక ఫిర్యాదుని కూడా చేస్తారని అంటున్నారు.
ఇంతకీ వంశీ పదవి విషయంలో ఎందుకు రాజీనామా చేయలేదు అన్నది చర్చకు వస్తోంది. దీని మీద ఆయన ధీమాగానే ఉన్నారని అంటున్నారు. విషయమేంటి అంటే ఆయన స్థానిక సంస్థల కోటాలో ఎమ్మెల్సీగా నెగ్గారు. అందుకు గానూ పార్టీ బీఫారం ఆయనకు ఇవ్వలేదని అందువల్ల ఆయనకు అనర్హత వేటు వర్తించదు అని ఆయన తరఫున వారు అంటున్నారు. వంశీ హాపీగా అయిదేళ్ళ పాటు తన పదవిలో కొనసాగవచ్చు అని అంటున్నారు.
అయితే అలా కాదు వైసీపీ తరఫునే ఆయన నెగ్గారు కాబట్టి ఆయన మీద ఫిరాయింపుల చట్టం ప్రకారం యాక్షన్ ఉంటుందని పదవి పోతుందని వైసీపీ వైపు నుంచి వాదన వినిపిస్తోంది. మొత్తానికి చూస్తే వంశీ తాను ప్రత్యక్ష రాజకీయాల్లోకి రావాలని జనసేనలోకి చేరాను అని అంటున్నారు. మరి ఆయనకు విశాఖ తూర్పులో టికెట్ అయితే దక్కదు. అది కచ్చితం. ఎందుకంటే అక్కడ వెలగపూడి రామక్రిష్ణ అనే హ్యాట్రిక్ టీడీపీ ఎమ్మెల్యే ఉన్నారు.
ఆయనకే మరోసారి టికెట్ ఇస్తారు.
దాంతో వంశీకి ఎమ్మెల్సీ పదవిని అలాగే ఉంచుతూ ఆయనకు జనసేన పార్టీ పదవిని కట్టబెట్టింది అని అంటున్నారు. మరి వైసీపీలో ఉన్నా జనసేనలో ఉన్నా పోటీ చేయనపుడు ఆయన ఎందుకు పార్టీ మారారు అన్నదే ప్రశ్నగా ఉంది. స్థానిక వైసీపీ నాయకత్వం సరిగ్గా డీల్ చేసి ఉంటే వంశీ పార్టీ మారేవారు కాదు అని అంటున్నారు. ఏది ఏమైనా వంశీ ఎమ్మెల్సీ పదవి పోదు అని జనసేన నేతలు అంటూంటే ఆయన పదవిని రద్దు చేయిస్తామని వైసీపీ నేతలు అంటున్నారు. ఏమి జరుగుతుందో చూడాల్సి ఉంది.