తమ్ముళ్ళ సీట్లకు జనసేన గండం...?
ఇదిలా ఉంటే జనసేనకు ఎన్ని సీట్లు ఇస్తారు అన్నది ఒక చర్చ అయితే ఎక్కడ ఇస్తారు అన్నది మరో చర్చ.
By: Tupaki Desk | 16 Sep 2023 2:30 AM GMTవిశాల దృక్పధంతో ఆలోచించి పొత్తులు కుదుర్చుకోవాలని రాజకీయ పార్టీలు భావిస్తాయి. దాని వల్ల అధికారం దక్కుతుందని అనుకుంటాయి. కానీ పొత్తుల వల్ల చాలా మంది త్యాగరాజులు కావాల్సి ఉంటుంది. ఇపుడు అదే బాధ లోలోపల టీడీపీ తమ్ముళ్లకు పట్టుకుంది అని అంటున్నారు. పార్టీ అధికారంలోకి రావాలి అన్నది తొలి డిమాండ్ అయినప్పటికీ ఆ అధికరంలో తామూ ఉండాలని పంచుకోవాలని కోరిక ఉండడం అత్యంత సహజం.
తమకి దక్కని అధికారాన్ని చూస్తూ సంతోషించడం అంటే ఎంతటి త్యాగధనులకో తప్ప సాధ్యం కాని విద్య. ఇదిలా ఉంటే జనసేనకు ఎన్ని సీట్లు ఇస్తారు అన్నది ఒక చర్చ అయితే ఎక్కడ ఇస్తారు అన్నది మరో చర్చ. జనసేన బలం బలగం ఎక్కువగా ఉభయ గోదావరి జిల్లాలతో పాటు విశాఖలో ఉన్నాయి. దీంతో ఇక్కడ సీట్లను ఆశిస్తున్న తమ్ముళ్లలో టెన్షన్ మొదలైంది.
ముందుగా విశాఖ జిల్లా విషయానికి వస్తే జనసేన కోరే సీట్లు ఇవే అంటున్నారు. భీమునిపట్నం, విశాఖ ఉత్తరం, గాజువాక, పెందుర్తి, అనకాపల్లి, ఎలమంచిలి, చోడవరం అని వినిపిస్తోంది. ఇందులో ఒకటి రెండు తగ్గినా కచ్చితంగా అయిదు సీట్లకు తక్కువ కాకుండా జనసేన డిమాండ్ చేస్తుంది అంటున్నారు. గాజువాకలో అయితే టీడీపీ జిల్లా ప్రెసిడెంట్, మాజీ ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు ఉన్నారు. ఇక మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు విశాఖ ఉత్తరం సీటు సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నారు. ఆయన భీమిలీ కోరుతున్నారు.
పెందుర్తి నుంచి మరో మాజీ మంత్రి బండారు సత్యనారాయణమూర్తి కూడా ఈసారికి సర్దుకోవాల్సిందే అంటున్నారు. నిన్నటి కధ వేరు ఇపుడు వేరు, చంద్రబాబు కష్టాలలో ఉన్న వేళ పవన్ అవుట్ రేట్ గా మద్దతు ఇచ్చిన నేపధ్యంలో ఆయన కోరిన సీట్లు ఇవ్వడం తప్ప మరో మార్గం టీడీపీకి లేదు అంటున్నారు. దాంతో సీనియర్ నేతలు అయినా జాగా ఇచ్చి తప్పుకోవాల్సిందే అంటున్నారు. అలాగే అనకాపల్లిలో ఒక మాజీ ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్సీ కూడా టికెట్ ఆశలు వదులుకోవాల్సిందే. చోడవరం కధ కూడా అంతే అంటున్నారు.
విజయనగరం జిల్లా తీసుకుంటే గజపతినగరం, ఎస్ కోట, నెల్లిమర్ల సీట్లను జనసేన కోరుతోంది. దాంతో ఇక్కడ తమ్ముళ్ళకు నిరాశే అంటున్నారు. శ్రీకాకుళంలో పాతపట్నం, శ్రీకాకుళం, ఎచ్చెర్ల సీట్లు జనసేనకు ఇవ్వాల్సిందే అని అంటున్నారు. ఎచ్చెర్లలో మాజీ మంత్రి కళా వెంకటరావు ఇక ఆశలు వదిలేసి జనసేనకు మద్దతు ఇవ్వాల్సిందే అని అంటున్నారు.
ఇదే పరిస్థితి గోదావరి జిల్లాలలో ఉందిట. అక్కడ చాలా సీట్లు తమ్ముళ్ళకు గల్లంతు కాబోతున్నాని అంటున్నారు. మొత్తం 34 సీట్లకు గానొ పదిహేను సీట్ల దాకా జనసేనకు ఇవ్వవచ్చు అని అంటున్నారు. అంటే పెద్ద మొత్తంలో త్యాగధనులు టీడీపీ నుంచి రెడీగా ఉండాలన్న మాట. గుంటూరు జిల్లాలో చూస్తే తెనాలి సీటు నుంచి నాదెండ్ల మనోహర్ పోటీ ఖాయం. దాంతో మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్రప్రసాద్ ఖాళీ అవుతారని అంటున్నారు.
అలాగే మరో రెండు సీట్లు ఇక్కడ జనసేన కోరుతోంది. క్రిష్ణా జిల్లాలో పశ్చిమ సీటుని ఆ పార్టీ ఆశిస్తోంది. దాంతో టీడీపీలో బుద్ధా వెంకన్న లాంటి వారికి షాకింగ్ పరిణామమే అంటున్నారు. గ్రేటర్ రాయలసీమలో అయితే కొంత టీడీపీ తమ్ముళ్ళకు టెన్షన్ తప్పినట్లే. టోటల్ గా జనసేనకు నలభై నుంచి యాభై సీట్లు ఇచ్చేందుకు సిద్ధపడుతున్నారు అన్న వార్తలు కూడా తమ్ముళ్ళను హడలకొడుతున్నాయట. ఏమో ఏమి జరుగుతుందో చూడాల్సిందే అంటున్నారు.