అరశాతం ఓట్ల లోటుతో జనసేనకు ఎంత చిక్కు..? కనీసం పవన్ గెలిచినా?
ఏపీ ఎన్నికల్లో ప్రస్తుతం గాజు గ్లాసు గుర్తు అత్యంత చర్చనీయాంశంగా మారింది.
By: Tupaki Desk | 3 May 2024 11:30 PM GMTఏపీ ఎన్నికల్లో ప్రస్తుతం గాజు గ్లాసు గుర్తు అత్యంత చర్చనీయాంశంగా మారింది. పవన్ కల్యాణ్ సారథ్యంలోని జన సేన గుర్తు గాజు గ్లాసు. అయితే, స్వతంత్ర అభ్యర్థులకూ గాజు గ్లాస్ గుర్తు కేటాయింపు వివాదాస్పదమైంది. దీనిపై హైకోర్టులో జనసేన పిటిషన్ వేసింది. ఈ గుర్తును ఫ్రీ సింబల్ నుంచి తొలగించాలని కోరుతోంది. జనసేన పోటీలో లేని అసెంబ్లీ, లోక్ సభ నియోజకవర్గాల పరిధిలో స్వతంత్ర అభ్యర్థులకు ఎన్నికల సంఘం (ఈసీ).. ‘గాజు గ్లాసు’ గుర్తు కేటాయించింది. టీడీపీ, బీజేపీతో పొత్తుల్లో భాగంగా జనసేన 21 అసెంబ్లీ, 2 లోక్ సభ స్థానాల్లో పోటీకి దిగిన సంగతి తెలిసిందే. అయితే, ఆ పార్టీ బరిలో లేని నియోజకవర్గాల్లో గాజు గ్లాసు గుర్తును ఎన్నికల సంఘం ఫ్రీ సింబల్స్ జాబితాలో పెట్టడం వివాదానికి కారణమైంది. అనంతరం ఈ గుర్తును స్వతంత్ర అభ్యర్థులకు కేటాయించింది. పదేళ్లుగా రాజకీయాల్లో ఉంటూ, ఐదేళ్ల నుంచి ఎన్నికల్లోనూ పోటీ చేస్తున్న జనసేన గుర్తు విషయంలో అసలు ఎక్కడ వచ్చింది తేడా?
రిజిస్టర్డ్.. రికగ్నైజ్డ్ కాదు..
2014 ఎన్నికల ముంగిట పవన్ కల్యాణ్ జనసేనను స్థాపించారు. నాటి ఎన్నికల్లో ఓట్లు చీలకూడదంటూ టీడీపీ-బీజేపీ కూటమికి మద్దతు పలికారు. గత ఎన్నికల్లో వామపక్షాలు, బీఎస్పీతో పొత్తు పెట్టుకుని మరీ పోటీ చేశారు. అయితే, ఎన్నికల సంఘం వద్ద ఆ పార్టీ ఇప్పటికీ రిజిస్టర్డ్ (నమోదు చేసుకున్న) పార్టీనే. రికగ్నైజ్డ్ (గుర్తింపు పొందిన) పార్టీ కాదు. 1968 ఎన్నికల గుర్తులు (రిజర్వేషన్/ కేటాయింపు) 10-b నిబంధన ప్రకారం అభ్యర్థులకు గుర్తులు కేటాయిస్తారు. ఎన్నికల నిబంధన ప్రకారం ఆరు శాతం ఓట్లు సాధించిన పార్టీకి శాశ్వత గుర్తును ఎన్నికల సంఘం కేటాయిస్తుంది. ఇక 2019 అసెంబ్లీ ఎన్నికల్లో గాజు గ్లాసు గుర్తుపై 137 సీట్లకు పోటీ చేసిన జనసేన 5.53 శాతం ఓట్లను మాత్రమే సాధించింది. 6 శాతం ఓట్లను సాధించలేకపోయింది. దీంతో రిజిస్టర్డ్ పార్టీగా మాత్రమే మిగిలింది.
మరోవైపు రిజిస్టర్డ్ పార్టీలు ఎన్నికల గుర్తు కోసం అసెంబ్లీ గడువు ఆరు నెలల్లో ముగుస్తుందనగా ఎన్నికల సంఘానికి లేఖ ఇవ్వాలి. అయితే, ప్రకారం గాజు గ్లాస్ గుర్తు తన పార్టీకి చెందాలంటూ రాజమండ్రికి చెందిన రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ (సెక్యులర్) అధ్యక్షుడు మేడా శ్రీనివాసరావు హైకోర్టుకు వెళ్లారు. అలా గ్లాస్ గుర్తుపై వివాదం రేగింది. ఆయన 2023 డిసెంబరు 20న గాజు గ్లాస్ గుర్తు కోసం ఈసీకి లేఖ రాశారు. దీనికంటే ముందే 2023 డిసెంబరు 12న తాము లేఖ రాశామని జనసేన హైకోర్టులో వాదించింది. ఈ నేపథ్యంలో ముందుగా లేఖ ఇచ్చినందున జన సేనకు గాజు గ్లాస్ గుర్తును కేటాయించాల్సిందిగా ఎన్నికల సంఘాన్ని హైకోర్టు ఆదేశించింది. కాగా, ఇక్కడే మెలిక పడింది.
జనసేన అభ్యర్థులు ఎక్కడ పోటీ చేస్తే అక్కడ మాత్రమే గాజు గ్లాస్ గుర్తు ఇవ్వాలని హైకోర్టు పేర్కొంది. గాజు గ్లాస్ గుర్తును ఫ్రీ సింబల్ జాబితా నుంచి తొలగించమని మాత్రం ఆదేశించలేదు. తద్వారా ఎన్నికల గుర్తుల నిబంధనల మేరకు, జనసేన పోటీలో లేనిచోట్ల, ఆ గుర్తు కోరుకున్న స్వతంత్ర అభ్యర్థులకు గాజు గ్లాస్ ను ఈసీ కేటాయించింది.
ఆ అర శాతం ఓట్లు సాధించి ఉంటే..
2019లో జన సేన 5.53 శాతం ఓట్లకు పరిమితమైంది. అప్పుడే గనుక 6 శాతం ఓట్లను సాధించి ఉంటే రిజిస్టర్డ్ పార్టీ నుంచి రికగ్నైజ్డ్ పార్టీగా మారేది. అప్పుడు శాశ్వత గుర్తుగా గాజు గ్లాస్ వచ్చేది. మరెవరికీ (స్వతంత్రులకు) దానిని కేటాయించే అవకాశం ఉండకపోయేది. కానీ, ఆరు శాతానికి అర శాతం కంటే తక్కువ ఓట్ల దూరంలో జన సేన ఆగిపోవడంతో గుర్తు దక్కలేదు.
పవన్ గెలిచి ఉంటేనా?
ఏపీ ఎన్నికల్లో 2019లో జనసేనాని పవన్ కల్యాణ్ భీమవరం, గాజు వాక రెండుచోట్ల నుంచి పోటీ చేశారు. గాజువాకలో వైసీపీ అభ్యర్థి తిప్పల నాగిరెడ్డి (75,292 ఓట్లు) చేతిలో 16,753 ఓట్ల తేడాతో ఓడిపోయారు. నాగిరెడ్డికి పోలైన ఓట్లలో 37.78 శాతం వచ్చాయి. పవన్ (58,539)కు మాత్రం 29.37 శాతం ఓట్లు మాత్రమే పడ్డాయి. అంటే తేడా.. 8 శాతం. ఇక భీమవరంలో వైసీపీ అభ్యర్థి గ్రంధి శ్రీనివాస్ (70,642 ఓట్లు, 36.78 శాతం ఓట్లు) చేతిలో పవన్ ఓటమి పాలయ్యారు. జన సేనానికి ఇక్కడ 62,285 ఓట్లు (32.33 శాతం) పడ్డాయి. గ్రంధి శ్రీనివాస్ 4 శాతంపైగా ఎక్కువ ఓట్లతో పవన్ కల్యాణ్ ను ఓడించారు. ఒకవేళ ఈ రెండు చోట్లలో ఒక్కదాంట్లోనైనా జన సేనాని గెలిచి ఉంటే.. రికగ్నైజ్డ్ పార్టీకి కావాల్సిన 6 శాతం ఓట్ల మార్క్ ను జన సేన దాటేదేమో?