టీడీపీకి జనసేన ఓట్లు ట్రాన్స్ ఫర్ అవుతాయా...!?
తెలుగుదేశం పార్టీది నాలుగు దశాబ్దాల చరిత్ర. ఆ పార్టీ ఆవిర్భవించిన తొలి ఎన్నికల్లోనే పొత్తు పెట్టుకుంది
By: Tupaki Desk | 21 Dec 2023 3:00 AM GMTతెలుగుదేశం పార్టీది నాలుగు దశాబ్దాల చరిత్ర. ఆ పార్టీ ఆవిర్భవించిన తొలి ఎన్నికల్లోనే పొత్తు పెట్టుకుంది. సంజయ్ విచార్ మంచ్ అని దివంగత నేత సంజయ్ గాంధీ సతీమణి మేనకాగాంధీ అప్పట్లో ఏర్పాటు చేశారు. దానికి ఒకటి రెండు సీట్లు కేటాయించి టీడీపీ ఉమ్మడి ఏపీలో మొత్తం 294 సీట్లలో మిగిలినవి పోటీ చేసి 200 సీట్లకు తగ్గకుండా ఘనమైన విజయం సాధించింది.
ఎన్టీఆర్ హయాంలోనే బీజేపీతో అలాగే వామపక్షాలతో పొత్తులు పెట్టుకుని ముందుకు సాగింది. ఇక చంద్రబాబు కూడా బీజేపీ వామపక్షాలు, టీఆర్ఎస్ ఆఖరుకు కాంగ్రెస్ తో కూడా పొత్తులు కుదుర్చుకున్నారు. బాబు ఎవరితో పొత్తు పెట్టుకున్నా టీడీపీకి అది లాభమే చేకూర్చింది. ఇక బీజేపీ కమ్యూనిస్టుల ఓట్లు ఎపుడూ టీడీపీకి నూటికి నూరు శాతం ట్రాన్స్ ఫర్ అయ్యాయి.
ఇదిలా ఉంటే జనసేన పార్టీ పెట్టి పదేళ్ళు అవుతోంది. గ్రౌండ్ లెవెల్ లో పార్టీకి రూపు అయితే లేదు అన్న విమర్శలు ఉన్నాయి. జనసేన అంటే పవన్ ఫ్యాన్స్ అంతా ఆయన పార్టీకి జనసైనికులు గా టర్న్ అయిన నేపధ్యం ఉంది. వారంతా ఫుల్ ఎమోషన్ గా ఉంటారు. వారికి తమ నాయకుడు అంటే వల్లమాలిన ప్రేమాభిమానాలు. వారికి పవన్ హీరో. నిజంగా పవన్ పవర్ స్టార్ అని వేరేగా చెప్పాల్సింది లేదు.
సినిమాల్లో పవన్ స్క్రీన్ షేర్ నే కొలతబద్ధ పెట్టి చూసే అభిమానం వారి సొంతం. అక్కడ సొంత మేనల్లుడితో పవన్ నటించినా పవనే హైలెట్ కావాలని కోరుకుంటారు. ఆఖరుకు మెగాస్టార్ సినీ ఫంక్షన్లలో కూడా పవర్ స్టార్ మాట చెప్పకపోతే వారు ఇబ్బందిగా ఫీల్ అవుతారు. ఇదంతా పవనిజంగానే చూడాల్సి ఉంటుంది.
అలాంటి పవన్ ఫ్యాన్స్ అనబడే జనసైనికులకు కావాల్సింది రాజకీయాల్లో చాలానే ఉంది. తమ నాయకుడు ముఖ్యమంత్రి కావాలి. ఆరు నూరు అయినా అదే వారికి కావాలి. పవన్ ఎంతలా నచ్చచెప్పినా ఏపీ భవిష్యత్తు అంటూ హిత బోధ చేసినా వారికి అవన్నీ అనవసరం. పవన్ సీఎం అయ్యారా లేదా అన్నదే ఇంపార్టెంట్. పవన్ ని సీఎం గా చేస్తామంటే వారంతా మూకుమ్మడిగా టీడీపీకి తమ హోల్ సేల్ సపోర్ట్ హోల్ హార్టెడ్ గా చేస్తారు.
అదే పవన్ సీఎం కారు అని వారికి ఏ మాత్రం అనుమానం వచ్చినా జనసేన ఓట్లు టీడీపీకి ట్రాన్స్ ఫర్ కావు అన్న మాట ఉంది. ఇదే విషయం జనసేన శ్రేయస్సుని గట్టిగా కోరుకునే మాజీ మంత్రి చేగొండి హరి రామజోగయ్య కూడా విశ్లేషించి మరీ చెబుతున్నారు. పవన్ సీఎం అన్న నమ్మకం జనసైనికులకు కలగాలీ అంటే జనసేనకు కచ్చితంగా అరవై సీట్లకు తక్కువ కాకుండా పొత్తులో సీట్లు కేటాయించాలని పెద్దాయన సూచిస్తున్నారు.
అంతేకాదు జనసేనకు రేపటి కూటమి ప్రభుత్వంలో అధికారంలో వాటా కూడా ఇస్తామని టీడీపీ బహిర్గతంగా చెబితే కనుక కూటమి విజయానికి ఎటువంటి ఢోకా లేదని జోగయ్య అంటున్నారు. ఈ విషయం రాజకీయాల్లో తలపండి నిండుగా అనుభవం ఉన్న చంద్రబాబు ఆలోచించాలని కూడా సూచించారు.
బాబు ఆ విధంగా సముచితమైన నిర్ణయం తీసుకుంటారు అని భావిస్తున్నట్లుగా కూడా జోగయ్య ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. దాదాపుగా యాభై ఏళ్ళకు పైగా రాజకీయ అనుభవం కలిగిన జోగయ్య ఈ రకంగా స్టేట్మెంట్ ఇచ్చారు అంటే అది ఆయన సొంత అభిప్రాయం కాదు, అంతే కాదు జనసేన క్యాడర్ లో గూడు కట్టుకున్న భావాన్ని కూడా ఆయన ఈ విధంగా వ్యక్తం చేశారు అని కూడా అనుకోవాల్సి ఉంటుంది.
మరి జనసేనకు పాతిక సీట్ల కంటే ఎక్కువ టీడీపీ ఇవ్వదు అని ప్రచారం ఒక వైపు వస్తోంది. మరో వైపు టీడీపీ కనుక అరవై దాకా జనసేనకు సీట్లు ఇస్తే కనుక అపుడు కచ్చితంగా ఏపీలో సంకీర్ణ ప్రభుత్వం రాక తప్పదు, ఎందుకంటే మ్యాజిక్ ఫిగర్ కి అవసరం అయిన 88 సీట్లూ టీడీపీ సొంతంగా గెలుచుకోలేదు. అందుకే చంద్రబాబు తెలివిగానే ఆలోచిస్తారు అని అంటున్నారు.
ఏది ఏమైనా జనసైనికుల ఆశ పవన్ సీఎం కావడం అన్నది. ఇక ఏపీలో ఒక బలమైన సామాజిక వర్గం ఆకాంక్ష కూడా తమ కులం నుంచి ఎవరైనా సీఎం కావాలని. నాడు ప్రజారాజ్యం నుంచి నేటి జనసేన వరకూ అంతా అదే ఆలోచిస్తున్నారు. మరి పవన్ సీఎం కావడం అన్నది టీడీపీ జనసేనకు ఇచ్చే పొత్తు సీట్ల మీదనే ఆధారపడి ఉంటుందని వేరేగా చెప్పాల్సింది లేదు అంటున్నారు.