Begin typing your search above and press return to search.

అత్యంత కీలకమైన జిల్లాలో టీడీపీ-జనసేన పొత్తు సీట్లు ఇవే!

వైసీపీ ప్రభుత్వ వ్యతిరేక ఓటును ఎట్టి పరిస్థితుల్లో చీలనివ్వబోనని జనసేనాని పవన్‌ కళ్యాణ్‌ చెబుతున్న సంగతి తెలిసిందే

By:  Tupaki Desk   |   2 Aug 2023 2:30 PM GMT
అత్యంత కీలకమైన జిల్లాలో టీడీపీ-జనసేన పొత్తు సీట్లు ఇవే!
X

ఏపీలో అసెంబ్లీ ఎన్నికలకు ఇంకా దాదాపు ఎనిమిది నెలల సమయం ఉంది. ఈ నేపథ్యంలో టీడీపీ, జనసేన పార్టీల మధ్య పొత్తు ఉంటుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. వైసీపీ ప్రభుత్వ వ్యతిరేక ఓటును ఎట్టి పరిస్థితుల్లో చీలనివ్వబోనని జనసేనాని పవన్‌ కళ్యాణ్‌ చెబుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో టీడీపీ, జనసేనతో పాటు బీజేపీని కలుపుకుని పోటీ చేయాలని పవన్‌ భావిస్తున్నారు.

ఒకవేళ వచ్చే ఎన్నికల్లో టీడీపీ-జనసేన పొత్తు కుదిరితే కీలకమైన ఎన్టీఆర్‌ జిల్లాలో రెండు పార్టీలు పోటీ చేసే సీట్లపై ఇప్పటికే ఒక అవగాహనకు వచ్చాయని అంటున్నారు. విజయవాడ పార్లమెంటు పరిధిలో ఉన్న ఏడు అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేసే అభ్యర్థులు వీరేనంటూ చర్చ జరుగుతోంది.

ముందుగా విజయవాడ నగర పరిధిలో ఉన్న మూడు సీట్లలో విజయవాడ తూర్పులో ప్రస్తుత టీడీపీ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్‌ మరోసారి పోటీ చేయడం ఖాయమంటున్నారు. ఇక విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో టీడీపీ-జనసేన ఉమ్మడి అభ్యర్థిగా జనసేన నేత పోతిన మహేశ్‌ పోటీ చేస్తారని టాక్‌ నడుస్తోంది. వాస్తవానికి విజయవాడ పశ్చిమ సీటును టీడీపీ నుంచి జలీల్‌ ఖాన్, ఆయన కుమార్తె ఆశిస్తున్నారు. అయితే పొత్తు కుదిరితే మాత్రం జనసేన నేత పోతిన మహేశ్‌ కే ఈ సీటు కేటాయిస్తారని తెలుస్తోంది. ఇక విజయవాడ సెంట్రల్‌ లో 2019 ఎన్నికల్లో అతి స్వల్ప ఓట్ల తేడాతో బొండా ఉమామహేశ్వరరావు ఓడిపోయారు. ఈసారి కూడా టీడీపీ నుంచి ఆయనే పోటీ చేస్తారని సమాచారం.

ఇక జగ్గయ్యపేట నియోజకవర్గంలో టీడీపీ అభ్యర్థిగా మాజీ ఎమ్మెల్యే శ్రీరాం రాజగోపాల్‌ (తాతయ్య), నందిగామలో మాజీ ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య, తిరువూరులో శ్యామల దేవదత్‌ పోటీ చేస్తారని చెబుతున్నారు. ఇప్పటికే ఈ మూడు నియోజకవర్గాలకు వీరిని టీడీపీ ఇంచార్జులుగా చంద్రబాబు ప్రకటించారు. టీడీపీకి వెన్నంటి ఉండే సామాజికవర్గం ఈ మూడు చోట్ల చాలా బలంగా ఉందని చెబుతున్నారు. ఈ నేపథ్యంలో జగ్గయ్యపేట, నందిగామ, తిరువూరు సీట్లను టీడీపీకే జనసేన వదిలేస్తుందని పేర్కొంటున్నారు.

ఇక మైలవరంలో మాజీ మంత్రి దేవినేని ఉమా పోటీ చేయడం ఖాయమేనంటున్నారు. 2009, 2014లో గెలిచిన ఆయన 2019లో ఓడిపోయారు. ఒకవేళ ప్రస్తుతం వైసీపీ ఎమ్మెల్యేగా ఉన్న వసంత కృష్ణప్రసాద్‌ ఎన్నికల నాటికి టీడీపీలోకి వస్తారనే ప్రచారం కూడా జరుగుతోంది. ఇదే నిజమైతే మైలవరం నుంచి టీడీపీ తరపున వసంత కృష్ణప్రసాద్‌ పోటీ చేయొచ్చని అంటున్నారు. అప్పుడు దేవినేని ఉమాని బందరు పార్లమెంటు పరిధిలోకి వచ్చే పెనమలూరు నియోజకవర్గం నుంచి పోటీ చేయిస్తారని చెబుతున్నారు.

ఇక విజయవాడ పార్లమెంటు నియోజకవర్గం నుంచి ప్రస్తుత ఎంపీ కేశినేని నానికి టికెట్‌ దక్కబోదని టాక్‌. ఆయన సోదరుడు కేశినేని చిన్ని (శివనాథ్‌) టీడీపీ తరఫున ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తారని అంటున్నారు. మొత్తం మీద విజయవాడ పార్లమెంటు పరిధిలోకి వచ్చే ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఒక్కచోట మినహాయించి మిగిలిన ఆరు చోట్ల టీడీపీ అభ్యర్థులే పోటీ చేస్తారని టాక్‌ నడుస్తోంది. విజయవాడ పశ్చిమలో జనసేన అభ్యర్థి పోతిన మహేశ్‌ పోటీలో ఉంటారని తెలుస్తోంది.