టీడీపీ జనసేన పొత్తు : అగ్గి రాజుకుంటోందా...?
తెలుగుదేశంతో పొత్తు ప్రకటన చేసిన జనసేనాని ఆ తరువాత మంగళగిరిలో పార్టీ మీటింగ్ పెట్టారు. అటు నుంచి ఆయన తన సినిమా షూటింగులలో బిజీ అయ్యారు
By: Tupaki Desk | 29 Sep 2023 11:34 AM GMTతెలుగుదేశంతో పొత్తు ప్రకటన చేసిన జనసేనాని ఆ తరువాత మంగళగిరిలో పార్టీ మీటింగ్ పెట్టారు. అటు నుంచి ఆయన తన సినిమా షూటింగులలో బిజీ అయ్యారు. చంద్రబాబు అరెస్ట్ అయి రాజమండ్రి జైలులో ఉన్న మూడవ రోజునే పొత్తు ప్రకటన వచ్చింది. ఇక మీదట ఉమ్మడిగా ఆందోళనలు చేస్తామని కూడా ప్రకటించారు. కానీ జరుగుతున్నది వేరు. జనసేన నేతలు కొందరు అక్కడక్కడ లోకల్ గా వస్తున్నా అసలైన సేనాని పవన్ రంగంలో ఉంటే ఆ కిక్కే వేరుగా ఉండేది అన్న ఫీలింగ్ అయితే టీడీపీలో ఉందిట. బాబు అరెస్ట్ మీద జనంలోకి పూర్తి స్థాయిలో వెళ్ళి సింపతీని గెయిన్ చేయలేకపోతున్నామన్న ఆవేదన కూడా టీడీపీలో ఉంది అంటున్నారు.
ఈ నేపధ్యంలో అక్టోబర్ 1 నుంచి పవన్ కళ్యాణ్ వారాహీ యాత్రను స్టార్ట్ చేయడం కూడా టీడీపీ పెద్దలకు అర్ధం కావడంలేదు అంటున్నారు. మొత్తానికి లోకేష్ నేరుగా పవన్ తో మాట్లాడిన మీదటన వారాహి యాత్రలోనే ఉమ్మడి కార్యాచరణకు రంగం సిద్ధం చేయాలని తీర్మానించినట్లుగా తెలుస్తోంది.
ఆ సంగతి అలా ఉంటే పవన్ సీఎం అంటూ ఊగిపోయే గోదావరి జిల్లాలతో పాటు జనసేనకు పట్టున్న మరిన్ని ప్రాంతాలలో సైతం ఇపుడు టీడీపీతో పొత్తు పట్ల కొంత అసంతృప్తి అయితే జనసేన నేతలలో ఉందని అంటున్నారు. సోలోగా వెళ్తేనే పవన్ సీఎం అవుతారు తప్ప టీడీపీకి మద్దతు ఇస్తే ఎప్పటికీ జనసేన ఎదిగేది లేదని కూడా కొందరు సీనియర్ నేతలు అభిప్రాయపడుతున్నారు.
ఇంకో వైపు చూస్తే సోషల్ మీడియా వేదికగా జనసేన టీడీపీ నేతల మధ్య పోస్టింగుల వార్ అయితే జరుగుతోంది అని అంటున్నారు. టీడీపీ మీద జనసైనికులు కొన్ని వ్యతిరేక పోస్టులు పెడుతూండడంతో వారిని బుజ్జగించేందుకు జనసేన పెద్దలు రంగంలోకి దిగారని అంటున్నారు. నాదెండ్ల మనోహర్, నాగబాబు ప్రస్తుతం ఈ పని మీదనే బిజీగా ఉన్నారని అంటున్నారు.
ఇక సోషల్ మీడియాలో చాలా చురుకుగా ఉండే సుంకరి దిలీప్ కళ్యాణ్ అన్న ఆయన మీద టీడీపీకి చెందిన రాజేష్ మహాసేన విమర్శలు చేయడంతో వ్యవహారం కాస్తా చాలా సీరియస్ అయింది. వ్యవస్థలను మ్యానేజ్ చేయడంతో చంద్రబాబు బాటలోనే జగన్ కూడా వెళ్తున్నారు అని తన యూ ట్యూబ్ చానల్ లో దిలీప్ కళ్యాణ్ పెట్టిన పోస్టింగులు రచ్చకు దారితీస్తున్నాయని అంటున్నారు.
నీవు నేర్పిన విద్యలే అంటూ ఆయన టీడీపీ చంద్రబాబు మీద చేసిన వీడియో మీద రాజేష్ మహాసేన నుంచి విమర్శలు రావడంతో ఈ అంశం జనసేన పెద్దల దృష్టికి వెళ్ళింది అని అంటున్నారు. మొత్తానికి నాగబాబు రంగంలోకి దిగి దిలీప్ సుంకరకు నచ్చచెప్పారని అంటున్నారు. అయితే ఇది ఇక్కడితో ఆగిపోలేదు దిలీప్ సుంకర పెట్టిన వీడియోల మీద ఇపుడు జనసేనలో విస్తృతంగా చర్చ అయితే సాగుతోంది.
మరో వైపు టీడీపీతో పొత్తు పట్ల జనసేనలోనూ భిన్నాభిప్రాయాలు ఉన్నట్లుగా తెలుస్తోంది అంటున్నారు. ఇక ఈ పరిణామాలపైన నాదెండ్ల మనోహర్ కూడా పార్టీకి చెందిన జిల్లాల బాధ్యులతో మాట్లాడుతూ టీడీపీతో పొత్తుతో ఎలా నడచుకోవాలన్నది దిశా నిర్దేశం చేశారు అని అంటున్నారు. ఏది ఏమైనా పొత్తుల పితలాటకం ఇపుడే ఇలా ఉంటే ఆ తరువాత ఏమి జరుగుతుంది అన్నది కూడా ఒక చర్చగా ఉంది. మొత్తానికి అనూహ్యమైన పరిణామాలే ఇపుడు జనసేనలో జరుగుతున్నాయని అంటున్నారు. వారాహి యాత్రలో పవన్ కళ్యాణ్ వీటన్నిటికీ సరైన సర్దుబాటు చేసి ముందుకు తీసుకెళ్తారు అని అంటున్నారు.