జనసేన టీడీపీల మధ్య పీటముడి ...!?
పొత్తులు పెట్టుకోవడం కాదు దాన్ని సక్సెస్ ఫుల్ గా ముందుకు నడిపించడమే అత్యంత ప్రధానం
By: Tupaki Desk | 10 Jan 2024 11:30 PM GMTపొత్తులు పెట్టుకోవడం కాదు దాన్ని సక్సెస్ ఫుల్ గా ముందుకు నడిపించడమే అత్యంత ప్రధానం. ఆ విధంగా చూస్తే కనుక ఏపీలో టీడీపీ జనసేన రెండూ పొత్తులో ఉన్నాయి. ఇక జనసేనకు ఎన్ని సీట్లు ఇస్తారు అన్నది పక్కన పెడితే జనసేనకు ఇచ్చే సీట్లు అయినా ఆ పార్టీ బలంగా ఉన్నవి కోరుకున్నవి ఇస్తారా అన్నదే చర్చగా ఉంది.
ఎందుకంటే జనసేన కోరుతున్న సీట్లు అన్నీ కూడా టీడీపీ బలంగా ఉన్నవే. టీడీపీలో చాలా మంది కీలక నేతలు సీనియర్లు ఇక్కడ దశాబ్దాలుగా ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఆ సీట్లను కనుక జనసేనకు ఇస్తే వారంతా తమ రాజకీయ ప్రాభవాన్ని కోల్పోతారు. అదే టైం లో కొత్తగా రాజకీయం మొదలవుతుంది.
ఆ సీట్లలో జనసేన నుంచి ఎమ్మెల్యేలు వస్తే టీడీపీ తమ్ముళ్ల రాజకీయానికి పూర్తిగా తెర పడుతుంది అన్న బెంగ కూడా ఉంది. అందుకే ఆ సీట్లను తమ రాజకీయ భవిష్యత్తుని కోల్పోవడానికి ఎవరూ సిద్ధంగా లేరని అంటున్నారు. ఇక జనసేన కోరుతున్నా సీట్లుగా ప్రచారంలో ఉన్నవి ఉత్తరాంధ్రా నుంచి చూసుకుంటే పెందుర్తి, భీమునిపట్నం. గాజువాక, ఎలమంచిలి, అనకాపల్లి, చోడవరం, నెల్లిమర్ల, చీపురుపల్లి, విజయనగరం, ఎచ్చెర్ల, పాతపట్నం, శ్రీకాకుళం వంటివి ఉన్నాయి.
అదే ఉభయ గోదావరి జిల్లాలలో చూసుకుంటే పిఠాపురం, కొత్తపేట, కాకినాడ సిటీ లేక రూరల్, రాజమండ్రి రూరల్, జగ్గయ్యపేట, కోవూరు, తణుకు తాడేపల్లిగూడెం నర్సాపురం, భీమవరం ఇలా మొత్తం మీద పది నుంచి పన్నెండు సీట్ల విషయంలో జనసేన కన్నేసింది. ఈ సీట్లలో తమకు పట్టు ఉంది కాబట్టి ఇవ్వాలని కోరుతోంది. అయితే ఇక్కడ టీడీపీకి ఉన్న నేతలు మాజీ మంత్రులు సీనినర్ నేతలు అని అంటున్నారు.
వారికి టికెట్ మీద కోటి ఆశలు ఉన్నాయి. అయిదేళ్ళుగా పార్టీ ప్రతిపక్షంలో ఉండడంతో వైసీపీ ప్రభుత్వం మీద అన్ని విధాలుగా పోరాడుతూ అన్నీ ఖర్చు చేసుకుని ఉన్నారు. ఇక ఇపుడు వారు సీటు మీద పట్టు వదిలేసుకుంటే ప్రభుత్వం వచ్చాక నామినేటెడ్ పదవి అన్న హామీతో సైడ్ అయితే రాజకీయం గందరగోళంలో పడుతుంది అని భావిస్తున్నారు.
అంతే కాదు, ఒక అయిదేళ్ళ పాటు రాజకీయ తెరపైన తాము ప్రత్యక్షంగా కనిపించకపోతే 2029 నాటికి దెబ్బ తింటామన్న అభిప్రాయంతో ఉన్నారు. దాంతో ఈ సీట్ల విషయంలో తమ్ముళ్ల నుంచి వ్యతిరేకత వస్తుందని అంటున్నారు. రాజమండ్రి రూరల్ విషయమే తీసుకుంటే సీనియర్ నేత మాజీ మంత్రి గోరంట్ల బుచ్చయ్యచౌదరి మళ్లీ పోటీకి సిద్ధం అంటున్నారు.
ఆయన ప్లేస్ లో జనసేన నుంచి కందుల దుర్గేష్ పోటీకి రెడీగా ఉన్నారు. ఈ పరిణామాలను బుచ్చయ్య చౌదరి వర్గీయులు తట్టుకోలేకపోతున్నారు అని అంటున్నారు. కొత్త పేట నుంచి సీనియర్ నేత మాజీ ఎమ్మెల్యే బండారు సత్యనందం కూడా పోటీకే సై అంటున్నారు. పిఠాపురం నుంచి మాజీ ఎమ్మెల్యే వర్మ అయినా కాకినాడ సిటీ మాజీ ఎమ్మెల్యే కొండబాబు అయినా జగ్గంపేట నుంచి మాజీ ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ అయినా సీటు వదులుకునేందుకు సిద్ధంగా లేరని అంటున్నారు.
అదే రకమైన పరిస్థితి పశ్చిమ గోదావరి జిల్లాలోనూ ఉంది. ఇక ఉత్తరాంధ్రా గుంటూరు క్రిషణా జిల్లాలలో కూడా జనసేన సీట్ల విషయంలో తమ్ముళ్ళు కలవరపడుతున్నారు. తమకు సీటు దక్కదన్న భయాలతో వారు ఉన్నారు. దీని మీదనే జనసేన టీడీపీ సీట్ల పంచాయతీ ఒక కొలిక్కి రావడంలేదు అని అంటున్నారు
మొత్తానికి చూస్తే టీడీపీ అధినాయకత్వం ఏదో ఒక విధంగా వారిని ఒప్పించి సీట్లు జనసేన పొత్తులో కట్టబెట్టినా మనస్పూర్తిగా వారంతా పనిచేస్తారా అన్న చర్చ ఎటూ ఉంది. మొత్తం మీద జనసేన టీడీపీ పొత్తులో ఇదే అతి పెద్ద ఆటంకం అంటున్నారు. రెండు పార్టీల ఓట్లూ సీట్లూ అన్నీ కూడా ఒకే వైపు నుంచి ఉండడమే అందుకు కారణం అంటున్నారు. దాంతో కోస్తా జిల్లాలలో సీట్ల పేచీ ఒక్క లెక్కన తెగేలా కనిపించడంలేదు అంటున్నారు. చూడాలి మరి ఏమి జరుగుతుందో.