టీడీపీ - జనసేన కలిసే పోటీ చేస్తాయి..తేల్చేసిన పవన్!
ఏపీ స్కి ల్ డెవలప్ మెంట్ స్కాం కేసులో రాజమండ్రి సెంట్రల్ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్న టీడీపీ అధినేత చంద్రబాబును
By: Tupaki Desk | 14 Sep 2023 8:31 AM GMTఏపీ స్కి ల్ డెవలప్ మెంట్ స్కాం కేసులో రాజమండ్రి సెంట్రల్ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్న టీడీపీ అధినేత చంద్రబాబును.. జనసేన అధినేత పవన్ కల్యాణ్, బాలకృష్ణ, లోకేష్ లు కలిశారు. ములాకత్ లో భాగంగా ఈ రోజు మధ్యాహ్నం ఈ ముగ్గురూ జైలులో బాబుతో భేటీ అయ్యారు. ఈ ములాకత్ అనంతరం పవన్ కల్యాణ్ మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా రాజకీయంగా సంచలన వ్యాఖ్యలు చేశారు.
అవును... చంద్రబాబుతో ములాకత్ అనంతరం పవన్ కల్యాణ్ మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా గత నాలుగున్నర సంవత్సరాలుగా అరాచక పాలన రాజ్యమేలుతుందని దుబ్బయట్టారు. అనంతరం విడివిడిగా పోటీ చేస్తే వైసీపీని అడ్డుకోలేమని తేల్చి చెప్పిన పవన్... 2024 లో టీడీపీ - జనసేన కలిసి ఎన్నికల్లో పోటీచేస్తాయని స్పష్టం చేశారు.
ఇదే సమయంలో రేపటినుంచి టీడీపీ - జనసేన ఉమ్మడి కార్యచరణను సిద్ధం చేసుకుంటామని.. అయితే ఈ కలయిక టీడీపీ, జనసేనల భవిష్యత్తు కోసం కాదని, రాష్ట్ర భవిష్యత్తు కోసమే అని పవన్ చెప్పుకొచ్చారు.
ఈ క్రమంలో మరో ఆరునెలల్లో ఎన్నికలు అనుకుంటున్నామని... అలా కాకుండా ఎన్నికలు ఎప్పుడు వచ్చినా... రేపే వచ్చినా... జనసేనా - టీడీపీ కలిసే పోటీ చేస్తాయని పవన్ మరోసారి నొక్కి చెప్పారు. ఈ పొత్తుతో భారతీయ జనతా పార్టీ కలిసి వస్తుందని ఆశాభావం వ్యక్తం చేసిన జనసేన అధినేత.. అదే జరుగుతుందని జోస్యం చెప్పారు.
ఇదే సమయంలో చంద్రబాబు అరెస్టు అనంతరం మరో ఆరునెలల్లో కొత్త ప్రభుత్వం వస్తుందని, ఇప్పుడున్న అధికారులు బాధ్యత ఎరిగి నడుచుకోకపోతే తమ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇబ్బందులు ఎదుర్కోక తప్పదని పవన్ స్పష్టం చేశారు. మాజీ ముఖ్యమంత్రినే రిమాండ్ లో పెట్టగలిగినప్పుడు... మీ పరిస్థితిని ఒకసారి ఊహించుకోండని పవన్ హెచ్చరికలు జారీచేశారు!!
అంతకంటే ముందు.. 2014లో రాష్ట్రం విడిపోయిన తర్వాత ఏపీకీ అనుభవం ఉన్న నాయకుడు కావాలని అనుకున్నానని, అందుకే నాడు మద్దతు ఇచ్చానని పవన్ తెలిపారు. తర్వాత కాలంలో 2019 ఎన్నికల నాటికి ఇద్దరి మధ్యా పాలన, విధానపరమైన అభిప్రాయ భేదాలు వచ్చి ఉండొచ్చు కానీ... వ్యక్తిగతంగా చంద్రబాబు విజన్ అంటే తనకు చాలా గౌరవమని తెలిపారు.
వైసీపీ నేతలు మాపై రాళ్లు వేసేముందే ఆలోచించుకోవాలని తెలిపిన పవన్... హిట్లర్ నాజీ సైనికులను యూదులు ఎలా వెంటపడి తరిమారో అలాగే వైసీపీకి చెందిన ఏ రౌడీమూకనూ వదలనని చెప్పుకొచ్చారు. ఇదే క్రమంలో... ఈ ప్రభుత్వానికి, అధికారులకు ఆరు నెలల సమయం మాత్రమే ఉందని, యుద్ధమే కావాలంటే యద్ధానికి సిద్ధమే అని పవన్ తెలిపారు.