టీడీపీ జనసేన కూటమికి ఎన్ని సీట్లు వస్తాయో చెప్పిన కేశినేని నాని...!
అంటే మళ్లీ ఏపీలో అధికారంలోకి వచ్చేది వైసీపీయే అని ఆయన స్పష్టంగా చెప్పారు అన్న మాట
By: Tupaki Desk | 10 Jan 2024 1:36 PM GMTఏపీలో వచ్చే ఎన్నికల్లో అధికారం మాదే అని ధీమాగా ఉన్న టీడీపీ జనసేన కూటమికి ఎన్ని సీట్లు వస్తాయో టీడీపీకి రాజీనామా చేసి వైసీపీ తీర్ధం పుచ్చుకున్న విజయవాడ ఎంపీ కేశినేని నాని జోస్యం చెప్పారు. ఆరు నూరు అయినా ఈ కూటమికి దక్కేది కేవలం 40 సీట్లు మాత్రమే అని కేశినేని నాని ఢంకా భజాయించారు. ఈ కూటమి గెలిచేది లేదు అని ఆయన తేల్చేశారు.
అంటే మళ్లీ ఏపీలో అధికారంలోకి వచ్చేది వైసీపీయే అని ఆయన స్పష్టంగా చెప్పారు అన్న మాట. ఏపీలో చంద్రబాబుని నమ్మేది లేదని కూడా నాని అంటున్నారు. చంద్రబాబు లోకేష్ ల మీద ఆయన సంచలన కామెంట్స్ చేశారు. బాబు కంటే పచ్చి మోసగాడు ఎవరూ ఉండరని ఆయన అనడం విశేషం. లోకేష్ ఎక్కడా గెలవని నేత అని చంద్రబాబు పలుకుబడితో పార్టీని శాసిస్తున్నారని నాని మండిపడ్డారు.
ఇక చంద్రబాబు కలల రాజధాని అమరావతి మీద నాని సెటైర్లు మామూలుగా లేవు. 2014 నుంచి 2019 దాకా చంద్రబాబు అమరావతి అని కలవరించారని, కానీ అది ఆయన కల మాత్రమే అన్నారు. రియాలిటీ మాత్రం గుంటూరు విజయవాడలే అని చెప్పారు. ఈ ప్రాంతాలను అభివృద్ధి చేసుకోవాలని తాను చంద్రబాబుకు చెప్పాను కానీ మొదటి సారి ఎంపీ అయిన తన మాటను పార్టీలో లెక్క చేసేవారు కాదని ఆయన ఫ్లాష్ బ్యాక్ చెప్పారు.
దేశంలో ఎవరైనా పెట్టుబడులు పెట్టాలంటే ఢిల్లీ ముంబై, కోల్ కటా, బెంగళూరు, అహ్మదాబాద్, హైదరాబాద్, చెన్నైలను దాటి ఏపీలోని అమరావతికి ఎందుకు వస్తారు అని నాని ప్రశ్నించారు. ఈ చిన్న లాజిక్ ని బాబు మిస్ అవుతూ అమరావతి రాజధాని అని చెప్పుకుంటూ అయిదేళ్ల కాలం గడిపేశారు అని నాని విమర్శించారు.
అమరావతి రాజధానిగా ఎపుడు అవుతుందో తెలియదని నాని అన్నారు. అందుకే గుంటూరు విజయవాడలను అభివృద్ధి చేయమని తాను కోరుతూ వచ్చాను అన్నారు. ఇక తాను మొదటిసారి ఎంపీగా ఉన్న కాలంలో బాబు సీఎం గా ఉన్న వేళ చంద్రబాబు బెజవాడ అభివృద్ధికి ఒక్క పైసా కూడా ఖర్చు చేయలేదని అన్నారు.
తానే కేంద్ర పెద్దలతో ఉన్న పరిచయాలతో విజయవాడ అభివృద్ధికి బాటలు వేశాను అన్నారు. అసలు గన్నవరం అంతర్జాతీయ విమానాశ్రయం కూడా అమరావతిలో పెట్టాలని బాబు అనుకున్నారని, తాను పట్టుబడితేనే ఆ విమానాశ్రయం పూర్తి అయిందని లేకపోతే విజయవాడ ఏమీ ఉండకుండా పోయేదని నాని చెప్పుకొచ్చారు.
చంద్రబాబుకు అమరావతి రాజధాని కట్టినది తాను అని చెప్పుకోవాలన్న తపన తప్ప మరేమీ లేదని అన్నారు తాజ్ మహల్ ఎవరు కట్టారు అంటే షాజహాన్ అని చెబుతారు అని అలా తన పేరు ఉండాలన్న ఆశతో ఆయన రియాలిటీని మరచి రాజకీయం చేస్తూ వచ్చారని, అదే దెబ్బ తీసిందని ఆయన మండిపడ్డారు
మొత్తం మీద చూస్తే చంద్రబాబు విషయంలో నాని చేసిన కామెంట్స్ ఆసక్తికరంగా ఉన్నాయి. పార్టీలో కూడా అనేక పరిణామాలు జరిగాయని, తాను రెండు వేల కోట్ల విలువ చేసే ఆస్తులు అమ్ముకుని రాజకీయాలు చేశాను అని ఆయన చెప్పారు. ఇంత చేసినా బాబు తనను వెనక్కి పెట్టడం వెనక ఆయన స్వార్థం ఉందని అన్నారు.