తెలంగాణాలో పోటీ చేస్తున్న జనసేన అభ్యర్ధులు వీరే...!
By: Tupaki Desk | 7 Nov 2023 6:01 PM GMTజనసేన పార్టీ పుట్టింది హైదరాబాద్ లో అయినా మొదటి సారి తెలంగాణా గడ్డ మీద ఆ పార్టీ పోటీ చేస్తోంది. తెలంగాణాకు ఈ నెల 30న జరుగుతున్న సార్వత్రిక ఎన్నికల్లో జనసేన తరఫున పోటీ చేస్తున్న అభ్యర్ధుల జాబితాను ఆ పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ప్రకటించారు.
మొత్తం ఎనిమీది అసెంబ్లీ స్థానాలలో పోటీ చేసే అభ్యర్ధుల జాబితాను పవన్ కళ్యాణ్ విడుదల చేశారు. ఆ జాబితాలో కూకట్ పల్లి నుంచి ముమ్మారెడ్డి ప్రేమ్ కుమార్, తాండూరు నుంచి నేమూరి శంకర్ గౌడ్, కోదాడ నుంచి మేకల సతీష్ రెడ్డి, నాగర్ కర్నూల్ నుంచి వంగ లక్ష్మణ్ గౌడ్, ఖమ్మం నుంచి మిర్యాల రామక్రిష్ణ, కొత్తగూడెం నుంచి అక్కినేని సురేంద్రరావు, వైరా ఎస్టీ నియోజకవర్గం నుంచి డాక్టర్ తేజావత్ సంపత్ నాయక్, అశ్వారావుపేట ఎస్టీ స్థానం నుంచి ముయబోయిన ఉమాదేవిలకు టికెట్లు ఇస్తూ పవన్ నిర్ణయం తీసుకున్నారు.
దీంతో జనసేన తరఫున తెలంగాణా బరిలో అభ్యర్ధులు పోటీకి నిలబడినట్లు అయింది. ఇదిలా ఉంటే జనసేనకు ఎనిమిది సీట్లు ఇచ్చారు. పన్నెండు దాకా సీట్లు ఇస్తారని వార్తలు వినిపించాయి. ఆ మాటకు వస్తే 32 సీట్లకు తాను పోటీ చేయబోతున్నట్లుగా జనసేన మొదట ప్రకటించింది.
మొత్తానికి బీజేపీతో పొత్తుల నేపధ్యంలో జనసేన తన పోటీ స్థానాలను నాలుగవ వంతునకు కుదించుకున్నట్లు అయింది అంటున్నారు. ఇక తెలంగాణాలో జనసేన రాజకీయం ఏ విధంగా ఉంటుందో చూడాల్సి ఉంది. తెలంగాణాలో జనసేనకు ఉన్న బలం బలగం కూడా ఈ ఎన్నికలతో ఒక్కసారిగా బయటకు రానున్నాయని అంటున్నారు.
పవన్ కళ్యాణ్ సైతం రెండు చోట్లా పోటీకి తన అభ్యర్ధులను ఈసారి నిలబెట్టడం ద్వారా జాతీయ పార్టీలతో సమానంగా నిలవబోతున్నారు అని భావించాలి. ఏది ఏమైనా జనసేన రాజకీయ సిరి ఎలా ఉందో తెలియచేసే ఎన్నికలుగా వీటిని చూస్తున్నారు.