తెలంగాణ ఎన్నికలు.. జనసేనకు సెగ.. నేతల పట్టు ఇదే!
తాజాగా హైదరాబాద్‌లోని పవన్ నివాసంలో తెలంగాణ జనసేన నాయకులు, కార్యకర్తలు 50 మంది వరకు భేటీ అయ్యారు. తమ మనసులోని మాటను పవన్ కు చెప్పారు.
By: Tupaki Desk | 18 Oct 2023 2:22 PM GMTతెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి నోటిఫికేషన్ రావడం.. ప్రధాన పార్టీలు దూకుడుగా ముందు కు సాగడం తెలిసిందే. ఇప్పటికే అభ్యర్థుల ప్రకటన, ప్రచారం విషయాల్లో కాంగ్రెస్, బీఆర్ ఎస్, బీజేపీలు కసరత్తు ముమ్మరం చేశాయి. అయితే.. తెలంగాణలోనూ సత్తా చాటుతామని కొన్నాళ్ల కిందట కొండగట్టు ఆంజనేయ స్వామి సాక్షిగా వారాహి వాహనానికి పూజలు చేయించిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మాత్రం తాజా ఎన్నికల విషయంలో సైలెంట్‌గా ఉన్నారు.
కనీసం ఇప్పటి వరకు ఒక్క మాట కూడా ఆయన తెలంగాణ ఎన్నికల గురించి మాట్లాడలేదు. పైగా.. ఏపీలో జరుగుతున్న పరిణామాలను హైదరాబాద్‌లోనే ఉండి సమీక్షిస్తున్నప్పటికీ.. తెలంగాణలో నోటిఫికేషన్ వచ్చిందన్న.. విషయాన్ని మరిచిపోయినట్టుగా.. అసలు తనకు పట్టనట్టుగా వ్యవహరిస్తున్నారు. అయితే.. ఈ విషయంలోనే తెలంగాణ జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు సెగ పెంచారు. ఎట్టి పరిస్థితిలోనూ ఎన్నికల్లో పోటీ చేయాల్సిందేనని వారు పట్టుబడుతున్నారు.
తాజాగా హైదరాబాద్‌లోని పవన్ నివాసంలో తెలంగాణ జనసేన నాయకులు, కార్యకర్తలు 50 మంది వరకు భేటీ అయ్యారు. తమ మనసులోని మాటను పవన్ కు చెప్పారు. "ఇప్పటికి రెండు ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉన్నాం. ఇప్పుడు కూడా పోటీ చేయకపోతే.. ఇబ్బంది. మేం క్షేత్రస్థాయిలో తిరగలేం. ఇప్పటికైనా ఒక నిర్ణయం తీసుకుని అభ్యర్థులను ప్రకటించండి. పోనీ.. మీరు ప్రచారం చేయకపోతే.. ఆడియో.. వీడియో సందేశాలైనా ఇవ్వండి . మేమే ప్రజల్లోకి వెళ్తాం" అని తేల్చి చెప్పారు.
అంతేకాదు.. పార్టీ పోటీకి దిగపోతే.. ప్రజలు కూడా మరిచిపోయే ప్రమాదం ఉందని పవన్‌కువివరించారు. అదేసమయంలో పార్టీకి కూడా ఇబ్బందేనని తేల్చి చెప్పారు. ఎప్పటికీ ఎదుగుదల ఉండదని వారు చెప్పారు. ఈ నేపథ్యంలో పవన్ స్పందిస్తూ.. రెండు మూడు రోజుల్లోనే తాను ఈ విషయంపై నిర్ణయం తీసుకుంటానని.. అప్పటి వరకు ఎవరూ తొందర పడొద్దని పార్టీ నాయకులకు సూచించారు. మరి ఏం చేస్తారో చూడాలి.