ఉత్తరాంధ్రాలో ఈ సీట్లు జనసేనకు కన్ ఫర్మ్...!?
వచ్చే ఎన్నికల్లో జనసేనకు కీలక నియోజకవర్గాలు కేటాయించేందుకు టీడీపీ అధినాయకత్వం అంగీకరించింది అని ప్రచారం సాగుతోంది
By: Tupaki Desk | 19 Dec 2023 2:30 AM GMTవచ్చే ఎన్నికల్లో జనసేనకు కీలక నియోజకవర్గాలు కేటాయించేందుకు టీడీపీ అధినాయకత్వం అంగీకరించింది అని ప్రచారం సాగుతోంది. అంతే కాదు ప్రజారాజ్యం టైం లో పోటీ చేసి గెలుచుకున్న సీట్లను కూడా ఇచ్చేందుకు పొత్తులో కీలకమైన ఒప్పందం కుదిరింది అని అంటున్నారు. చంద్రబాబు పవన్ ల మధ్య కుదిరిన అవగాహన మేరకు 2009లో ఎక్కడైతే ప్రజారాజ్యం సీట్లు గెలుచుకుందో అవన్నీ తిరిగి జనసేనకు కేటాయించబోతున్నారు అని టాక్ నడుస్తోంది.
ఈ నేపధ్యంలో నుంచి చూసినపుడు ఉమ్మడి విశాఖ జిల్లాలో నాలుగు సీట్లు జనసేనకు కేటాయిస్తున్నారు అని అంటున్నారు. అవి గాజువాక, భీమునిపట్నం, పెందుర్తి, ఎలమంచిలి అని తెలుస్తోంది. ఇందులో 2009 ఎన్నికలలో ప్రజారాజ్యం గెలిచినవి మూడు ఉంటే అనకాపల్లికి బదులుగా ఎలమంచిలిని ఇస్తున్నారు అని అంటున్నారు.
ఇక గాజువాక నుంచి జనసేనకు చెందిన పీఏసీ మెంబర్ కోన తాతారావు పోటీ చేయబోతున్నారు అని అంటున్నారు. ఆయన 2019లో జనసేన తరఫున విశాఖ తూర్పు నుంచి పోటీ చేసి ఓడిపోయారు. బలమైన యాదవ సమాజిక వర్గానికి చెందిన కోనది రాజకీయంగా మూడు దశాబ్దాల అనుభవం. ఆయన టీడీపీలో విశాఖ జిల్లా ప్రెసిడెంట్ గా కూడా పనిచేసారు. ఆయన ఉక్కు మాజీ ఉద్యోగిగా ఉక్కు కార్మిక సంఘాలతో అనుబంధం కలిగి ఉన్నారు. దాంతో అన్ని విధాలుగా మేలుగా ఉంటుందని బీసీ నేతగా ప్రముఖుడని ఆయనకు టికెట్ ఇస్తున్నారు అని అంటున్నారు.
ఇక భీమునిపట్నం నుంచి పంచకర్ల సందీప్ కి టికెట్ ఇస్తున్నట్లుగా జనసేన వర్గాల ద్వారా తెలుస్తోంది. ఆయన 2019లో తొలిసారి పోటీ చేసి ఏకంగా పాతిక వేల దాకా ఓట్లు సాధించారు. గడచిన అయిదేళ్ళుగా సందీప్ పార్టీ కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొంటున్నారు. చాలా కాలం క్రితమే పవన్ ఆయనకు భీమునిపట్నం టికెట్ హామీ ఇచ్చారు. ఇపుడు అది సాకారం కాబోతోంది.
అదే విధంగా చూస్తే పెందుర్తి టికెట్ కూడా జనసేనకు దక్కుతోంది. ఆ పార్టీ విశాఖ జిల్లా ప్రెసిడెంట్ పంచకర్ల రమేష్ బాబు అక్కడ నుంచి పోటీ చేయనున్నారని తెలుస్తోంది. విశాఖ జిల్లా వైసీపీ ప్రెసిడెంట్ గా ఉన్న పంచకర్ల జనసేనలోకి వెళ్ళి పెందుర్తి టికెట్ హామీని పొందారని అంటున్నారు. పవన్ స్వయంగా ఆ విషయంలో శ్రద్ధ తీసుకుని మరీ పెందుర్తి టికెట్ దక్కేలా చూస్తున్నారు.
ఇక ఎలమంచిలిలో సుందరపు విజయకుమార్ కి జనసేన టికెట్ ఖాయం అని అంటున్నారు. ఆయన టీడీపీ నుంచి జనసేనలో చేరి 2019 ఎన్నికల్లో పోటీ చేస్తే 18 వేల పై చిలుకు ఓట్లు లభించాయి. దాంతో పాటు ఆయన పవన్ కి అత్యంత సన్నిహితులు. దాంతో ఆయనకు టికెట్ కన్ ఫర్మ్ అని తేలుతోంది.
వీటితో పాటు విజయనగరం జిల్లాలోని నెల్లిమర్ల, అలాగే శ్రీకాకుళం జిల్లాలోని ఎచ్చెర్ల అసెంబ్లీ టికెట్లు కూడా జనసేనకు టీడీపీ ఇస్తోందని అంటున్నారు. ఈ రెండు సీట్లలో కూడా కాపులు బలంగా ఉన్నారు. వారే అనేకసార్లు గెలుస్తున్నారు. ఇలా రాజకీయంగా సామాజికంగా కూడా కీలకమైన ఈ రెండు సీట్లూ జనసేన ఖాతాలో పొత్తులో భాగంగా వెళ్తున్నాయని అంటున్నారు. మొత్తం మీద చూస్తే ఉత్తరాంధ్రాలో ఆరు అసెంబ్లీ సీట్లు జనసేనకు టీడీపీ కేటాయిస్తోంది అన్నది లేటెస్ట్ టాక్.