Begin typing your search above and press return to search.

జనసేనకు టీడీపీ ఓట్లు పడవా...?

మరి టీడీపీకి మిత్రపక్షంగా ఉన్న జనసేన తెలంగాణా ఎన్నికల సంగ్రామంలో పాలు పంచుకుంటే టీడీపీ ఎలా రియాక్ట్ అవుతుంది అన్నది ఒక కీలకమైన చర్చగా ఉంది.

By:  Tupaki Desk   |   6 Nov 2023 1:30 PM GMT
జనసేనకు టీడీపీ ఓట్లు పడవా...?
X

జనసేన ముందే తన అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి సిద్ధపడుతోంది. 2019 ఎన్నికల తరువాత జనసేన ఏపీలో జరిగిన ఉప ఎన్నికల్లో వేటిలోనూ పోటీ చేయలేదు. ఇక తెలంగాణాలో మాత్రం జనసేన పెట్టాక ఇదే ఫస్ట్ టైం బరిలోకి దిగడం. ఇక జనసేన రాజకీయ పోకడలు కూడా చిత్రంగా ఉన్నాయని అంటున్న వారూ ఉన్నారు. ఏపీలో టీడీపీతో పొత్తు, తెలంగాణాలో బీజేపీతో పొత్తు అంటూ జనసేన రెండు చోట్ల రెండు రకాలైన రాజకీయ విధానాన్ని అనుసరిస్తోంది అని అంటున్నారు.

ఇక చంద్రబాబుకు టీడీపీకి పూర్తి స్థాయిలో మద్దతు ఇచ్చిన పవన్ కళ్యాణ్ ఇపుడు జనసేనను తెలంగాణాలో నిలబెడుతున్నారు. ఆయన తెలంగాణాలో పార్టీ జెండా ఎగరాలని చూస్తున్నారు ఒక విధంగా ప్రతిష్టగానే దిగుతున్నారు. మరి టీడీపీకి మిత్రపక్షంగా ఉన్న జనసేన తెలంగాణా ఎన్నికల సంగ్రామంలో పాలు పంచుకుంటే టీడీపీ ఎలా రియాక్ట్ అవుతుంది అన్నది ఒక కీలకమైన చర్చగా ఉంది.

తెలుగుదేశం పార్టీకి తెలంగాణాలో ఖమ్మం జిల్లాతో పాటు హైదరాబాద్, రంగారెడ్డి, నల్గొండ వంటి చోట్ల కొంత బలం ఉంది. ముఖ్యంగా ఆంధ్రా సెటిలర్ల ఓట్లలో టీడీపీకి మంచి పట్టు ఉంది అని అంటున్నారు. ఇక జనసేనకు ఇచ్చే సీట్లు కూడా ఆయా జోన్లలోనే ఇస్తున్నారు అని తెలుస్తోంది.

తెలుగుదేశం అయితే పోటీలో లేదు. పోటీలో ఉంటే ఎటూ తన పార్టీకే ఓటు వేసుకుంటుంది. కానీ ఇపుడు ఆ బాధ లేదు. దీంతో తెలంగాణా తమ్ముళ్ళకు ఒక స్వేచ్చ అయితే ఉంది. నచ్చిన పార్టీకి ఓటు వేసుకోవచ్చు. ఏపీలో జనసేన ఎటూ మిత్రపక్షమే కాబట్టి ఆ పార్టీ వైపు తమ్ముళ్ళు మొగ్గు చూపుతారా అన్నది ప్రశ్నగా ఉంది. నిజానికి అయితే అదే జరగాలి.

మిత్రుడి బాగు కోరుకోవడమే ధర్మం. పైగా బాబు కష్టంలో భుజం కలిపి అండగా పవన్ కళ్యాణ్ నిలిచారు. తన పార్టీ గురించి తన పార్టీ భవిష్యత్తు గురించి కూడా ఏ మాత్రం ఆలోచించకుండా అవుట్ రేట్ గా జైలు బయటే బాబుకు ఫుల్ సపోర్ట్ అని చెప్పేశారు. అలాంటిది పవన్ కళ్యాణ్ తెలంగాణాలో పోటీ చేస్తూంటే మద్దతు ఇవ్వడం రాజనీతి, రాజకీయ నీతి కూడా.

కానీ టీడీపీ ఆ పని చేస్తుందా అంటే వేయి డౌట్లు కొడుతున్నాయి. టీడీపీ ఎందుకు పోటీకి పెట్టలేదు అంటేనే ఆలోచించాలి. కాంగ్రెస్ కి రావాల్సిన ఓట్లు చీలిపోకుండా ఉండేందుకే టీడీపీ పోటీ నుంచి తప్పుకుందని అంటున్నారు. ఇది ప్రచారం కాదు, టీడీపీకి అనుకూలంగా ఉండే మీడియా ఇదే రాజకీయ వ్యూహం అని పదే పదే చెబుతూ వచ్చింది. చివరికి అదే టీడీపీ కూడా చేసింది. దాంతో పాటు బీజేపీ నేతలు కూడా విమర్శలు చేస్తూ వచ్చారు. కాంగ్రెస్ కి మద్దతు కోసమే టీడీపీ పోటీ పెట్టలేదని ఈటెల రాజెందర్ లాంటి వారు విమర్శించారు.

వీటి కంటే ముందు బాబుకు మద్దతుగా హైదరాబాద్ లో నిర్వహించిన ఒక విభావరిలో సైతం అక్కడికి వచ్చిన వారికి కాంగ్రెస్ కే ఓటు వేయాలని ప్రచారం చేసినట్లుగా కూడా అంతా చెప్పుకున్నారు.ఇలా దాదాపుగా ఓపెన్ గానే టీడీపీ స్ట్రాటజీ ఉంది అని అంటున్నారు. మరి ఈ నేపధ్యంలో జనసేన పోటీ మీద టీడీపీ రియాక్షన్ ఎలా ఉంటుంది అన్నది ఒక ఆసక్తిని రేకెత్తించే విషయంగా చూడాలి.

జనసేనకు బీజేపీ ఓట్లతో పాటు టీడీపీ ఓట్లు పడితే పవన్ కళ్యాణ్ సినీ గ్లామర్ ఆయన ఫ్యాన్స్ పార్టీ క్యాడర్, అంధ్రా సెటిలర్స్ ఓట్లు, పవన్ కి చెందిన బలమైన సామాజికవర్గం ఓట్లు అన్నీ మిక్స్ అయితే కొన్ని సీట్లు అయినా దక్కుతాయని ఒక అంచనా అయితే ఉంది. పవన్ అభిమానులు అన్ని చోట్లా ఉన్నారు కాబట్టి ఎంతో కొంత వర్కౌట్ అయ్యే చాన్స్ ఉంటుంది. అయితే ఎపుడు అంటే గెలుపు గుర్రంలా కనిపించాలి. అలా జరగాలంటే టీడీపీ నుంచి ఒక ఓపెన్ స్టేట్మెంట్ రావాలి.

పోటీ చేయమని చెప్పి టీడీపీ సైలెంట్ అయింది. అదే వైఎస్సార్టీపీ ప్రెసిడెంట్ వైఎస్ షర్మిల తమ పార్టీ మద్దతు కాంగ్రెస్ కే అని ఓపెన్ గా చెప్పేసింది. మరి అలా టీడీపీ కూడా మా మద్దతు జనసేనకే అని చెప్పవచ్చు. ఏపీలో మిత్రబంధం ఉంది కాబట్టి అలా చెప్పినా తప్పు లేదు. పైగా ఏపీలో బీజేపీతో పొత్తు కోసం చూస్తున్న నేపధ్యం ఉంది కాబట్టి ఇంకా సహేతుకంగా ఉంటుంది. కానీ అంత పని టీడీపీ చేస్తుందా. టీడీపీ అధినాయకత్వం ఓకే అంటుందా అంటే వేయి డౌట్లే కొడుతున్నాయి. చూడాలి మరి ఏమి జరుగుతుందో.