మాడుగుల హల్వా నాదే అంటున్న జనసేన..?
ఇపుడు వర్గ పోరుతో టీడీపీ సతమతం అవుతూంటే అక్కడ జెండా పాతాలని జనసేన చూస్తోంది. తాజాగా జనసేన నియోజకవర్గం విస్తృత స్థాయి సమావేశాన్ని మడుగులలో నిర్వహించారు.
By: Tupaki Desk | 1 Nov 2023 3:56 AM GMTఉమ్మడి విశాఖ జిల్లాలో కనీసంగా అరడజన్ సీట్లను పొత్తులో భాగంగా తీసుకోవాలని జనసేన డిసైడ్ అయినట్లుగా ప్రచారం సాగుతోంది. అవి గాజువాక, భీమునిపట్నం, పెందుర్తి, అనకాపల్లి, ఎలమంచిలి, మాడుగుల అని అంటున్నారు. ఇందులో నాలుగు సీట్లను 2009 ఎన్నికల్లో ప్రజారాజ్యం పార్టీ గెలుచుకుంది. ఇక 2019లో పవన్ గాజువాక నుంచి పోటీ చేశారు.
అలా అన్ని సెంటిమెంట్లూ సామాజిక వర్గ సమీకరణలు అన్నీ సరిచూసుకుని మరీ జనసేన ఈ సీట్లకు డిమాండ్ చేస్తోంది. ఇందులో ఒక్క మాదుగుల తప్ప మిగిలినవి అన్నీ కూడా కాపు సామాజికవర్గం ఆధిపత్యం ఉన్న సీట్లే కావడం విశేషం. మాడుగులలో వెలమల డామినేషన్ ఉన్నా కాపులు కూడా చెప్పుకోదగిన పాత్ర పోషిస్తున్నారు.
దాంతో కొత్తగా ఈ సీటుని జనసేన తన వైపునకు తిప్పుకునే యోచనలో ఉంది. దానికి కారణాలు ఉన్నాయి. ఇక్కడ టీడీపీకి సరైన క్యాండిడేట్ లేరని జనసేన దాన్ని అడ్వాంటేజ్ గా తీసుకుంటోంది. మాడుగులలో అనేక పర్యాయాలు గెలిచి మంత్రిగా కూడా పనిచేసిన రెడ్డి సత్యనారాయణ తరువాత టీడీపీకి ఆ స్థాయి నాయకత్వం లేకుండా పోయింది.
దాంతో గత రెండు దశాబ్దాలలో జరిగిన నాలుగు ఎన్నికల్లో ఒకే ఒకసారి టీడీపీ గెలిచింది. ఇపుడు వర్గ పోరుతో టీడీపీ సతమతం అవుతూంటే అక్కడ జెండా పాతాలని జనసేన చూస్తోంది. తాజాగా జనసేన నియోజకవర్గం విస్తృత స్థాయి సమావేశాన్ని మడుగులలో నిర్వహించారు. ఈ సందర్భంగా మాడుగులలో సైతం జనసేన విజయం సాధించాలని నేతలంతా కోరుకున్నారు.
ఇక విశాఖ జిల్లా జనసేన ప్రెసిడెంట్ పంచకర్ల రమేష్ బాబు అయితే పెందుర్తి నుంచి పోటీ చేయాలని చూస్తున్నారు. ఒక వేళ ఏ కారణం చేతనైనా ఆ సీటు దక్కకపోతే మాడుగుల నుంచి పోటీ చేసేందుకు చూస్తున్నారు అని అంటున్నారు. ఇక్కడ టీడీపీ నుంచి పోటీ పడేందుకు పెద్దగా ఎవరూ రారు అన్న ఉద్దేశ్యంతోనే మాడుగుల సీటు మీద కన్నేశారు అని అంటున్నారు.
ఇక మాడుగులలో మాజీ టీడీపీ ఎమ్మెల్యే గవిరెడ్డి రామానాయుడు టికెట్ రేసులో ఉన్నారు. అయితే ఆయన వరసగా 2014, 2019లలో ఓటమి పాలు కావడంతో కొత్త వారి కోసం టీడీపీ చూస్తోంది. ఇక అయ్యన్నపాత్రుడు కుమారుడు విజయ్ పాత్రుడు కూడా మాడుగుల వైపు చూస్తున్నారు అని అంటున్నారు. అదే విధంగా మరో మాజీ మంత్రి కుమారుడికీ ఈ సీటు మీద చూపు ఉంది అంటున్నారు.
ఇపుడు జనసేన కూడా ఇక్కడ జెండా పాతాలని అనుకుంటోంది. ఏకంగా జిల్లా ప్రెసిడెంట్ ఈ సీటు మీద టార్గెట్ చేశాక పొత్తులో భాగంగా ఇస్తారని అంటున్నారు. ఏది ఏమైనా మాడుగుల హల్వా కోసం జనసేన ఆరాటపడుతోంది అని అంటున్నారు. వైసీపీ నుంచి రెండు సార్లు ఎమ్మెల్యే అయి ప్రస్తుతం ఉప ముఖ్యమంత్రిగా ఉన్న బూడి ముత్యాలనాయుడు హ్యాట్రిక్ కొట్టాలని చూస్తున్నారు.
ఆయనకు నియోజకవర్గంలో మంచి పేరు ఉంది. దానికి తోడు టీడీపీలో వర్గ పోరు కూడా హెల్ప్ అవుతోంది. సరైన ప్రత్యర్ధి బరిలోకి దిగితే బూడికి గెలుపు కష్టం ఏంటో తెలుస్తుంది అని అంటున్నారు. అదే పని చేయడానికి జనసేన సిద్ధంగా ఉంది అని అంటున్నారు. వైసీపీ విశాఖ జిల్లాలో కచ్చితంగా గెలిచే సీట్లలో మాడుగుల ఒకటి. ఆ సీటుని పొత్తులో భాగంగా జనసేనకు కేటాయించి తాము మద్దతు ఇచ్చి గెలుచుకునేందుకు టీడీపీ రాజకీయ వ్యూహం రూపొందిస్తోంది అని అంటున్నారు. చూడాలి మరి ఏమి జరుగుతుందో.