Begin typing your search above and press return to search.

వైసీపీ ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తిపై అనర్హత వేటు!

అవును... పార్టీ ఫిరాయించిన వైసీపీ ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తిపై అనర్హత వేటు పడింది.

By:  Tupaki Desk   |   16 May 2024 4:52 AM GMT
వైసీపీ ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తిపై అనర్హత వేటు!
X

పార్టీలు ఫిరాయించే వారిపై అనర్హత వేటు వేసే విషయంలో ఏపీ అసెంబ్లీ స్పీకర్, మండలి ఛైర్మన్ లు సీరియస్ గా, వేగంగా రియాక్ట్ అవుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో తాజాగా తెలుగుదేశం పార్టీలో చేరిన అధికార వైసీపీకి చెందిన శాసనమండలి సభ్యుడు జంగా కృష్ణమూర్తిపై అనర్హత వేటు వేశారు మండలి ఛైర్మన్ కొయ్యె మోషెన్ రాజు.

అవును... పార్టీ ఫిరాయించిన వైసీపీ ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తిపై అనర్హత వేటు పడింది. పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం కింద అనర్హత వేటు వేయాలని మండలిలో వైసీపీ విప్‌ లేళ్ల అప్పిరెడ్డి ఇచ్చిన ఫిర్యాదుపై శాసనమండలి ఛైర్మన్‌ కొయ్యే మోషేన్ రాజు విచారణ నిర్వహించారు. ఈ నేపథ్యంలో... ఆయనపై అనర్హత వేటు వేస్తూ బుధవారం రాత్రి గెజిట్‌ నోటిఫికేషన్‌ విడుదల చేశారు.

కాగా... పార్టీ ఆవిర్భావం నుంచీ వైసీపీలోనే పని చేస్తూ వచ్చిన జంగా కృష్ణమూర్తి... ఇటీవల ముగిసిన సార్వత్రిక ఎన్నికల్లో పోటీ చేయడానికి గురజాల అసెంబ్లీ టికెట్‌ ను ఆశించారు. 2014లో గురజాల నుంచి పోటీ చేసి ఏడు వేల ఓట్ల తేడాతో ఓడిపోయారు. అయినప్పటికీ... పార్టీకి చేసిన సేవలను గౌరవిస్తూ ఆయనను శాసనమండలికి నామినేట్ చేశారు వైఎస్ జగన్.

అయితే ఈ ఎన్నికల్లో కూడా తనకు గురజాల నుంచి అసెంబ్లీకి తిరిగి పోటీచేసే అవకాశం ఇవ్వాలంటూ జంగా కృష్ణమూర్తి విశ్వ ప్రయత్నాలు చేశారు. అయితే... సిట్టింగ్ ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డిని కాదని ఆయనకు టికెట్ కేటాయించడానికి వైసీపీ నాయకత్వం ఆసక్తి చూపలేదు. తమకున్న సమాచారం, సమీకరణల నేపథ్యంలో టిక్కెట్ నిరాకరించింది.

దీంతో... సార్వత్రిక ఎన్నికల నోటిఫికేషన్ వెలువడటానికి కొన్ని రోజుల ముందు జంగా కృష్ణమూర్తి.. వైసీపీని వీడారు.. చంద్రబాబు సమక్షంలో తెలుగుదేశం పార్టీ కండువా కప్పుకొన్నారు. ఈ సమయంలో... పార్టీ ఫిరాయించిన నేపథ్యంలో ఆయనపై అనర్హత వేటు వేయాలంటూ విప్ లేళ్ల అప్పిరెడ్డి ఫిర్యాదు చేశారు. పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం కింద చర్యలు తీసుకోవాలని కోరారు.

ఈ సమయంలో ఆ ఫిర్యాదుపై తాజాగా శాసన మండలి ఛైర్మన్ కొయ్యె మోషెన్ రాజు స్పందించారు. ఇందులో భాగంగా... జంగా కృష్ణమూర్తిపై అనర్హత వేటు వేస్తూ గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేశారు.