Begin typing your search above and press return to search.

జంగా..ఖాయమైనట్లేనా ?

వైసీపీ ఎంఎల్సీ జంగా కృష్ణమూర్తికి తెలుగుదేశంపార్టీ నుండి ఆఫర్ వచ్చిందట.

By:  Tupaki Desk   |   13 Feb 2024 2:30 PM GMT
జంగా..ఖాయమైనట్లేనా ?
X

వైసీపీ ఎంఎల్సీ జంగా కృష్ణమూర్తికి తెలుగుదేశంపార్టీ నుండి ఆఫర్ వచ్చిందట. బీసీ నేతగా పాపులరైన జంగాకు వైసీపీ ప్రతిపక్షంలో ఉన్నపుడే జగన్మోహన్ రెడ్డి ఎంఎల్సీగా అవకాశం ఇచ్చారు. రాబోయే ఎన్నికల్లో గురజాలలో పోటీచేయాలని అనుకుంటున్నారు. ప్రస్తుతం గురజాల ఎంఎల్ఏగా కాసు మహేష్ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. రాబోయే ఎన్నికల్లో టికెట్ కాసుకే దక్కే అవకాశాలు కనబడుతున్నాయి. ఇప్పటివరకు జరిగిన మార్పుల్లో చాలామంది ఎంఎల్ఏలకు జగన్ నియోజకవర్గాలను మార్చారు.

మరికొంతమంది ఎంఎల్ఏలకు టికెట్లను నిరాకరించారు. అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం సుమారు 24 మంది ఎంఎల్ఏలకు టికెట్లు దక్కటంలేదు. ఇప్పటివరకు రిలీజ్ చేసిన ఆరుజాబితాల్లో కాసు మహేష్ రెడ్డి పేరు లేదు. కాబట్టి మహేష్ కు టికెట్ ఖాయమనే అనుకుంటున్నారు. ఇక్కడే జంగాకు సమస్య మొదలైంది. టికెట్ ఆశిస్తున్న నియోజకవర్గంలో తనకు టికెట్ దక్కే అవకాశం లేదని జంగాకు అర్ధమైపోయింది. అందుకనే పార్టీ మారే ఆలోచనలో ఉన్నట్లు సమాచారం. ఎందుకంటే ఈమధ్యనే తన మద్దతుదారులతో సమావేశమై పార్టీ మార్పు విషయమై చర్చించినట్లు సమాచారం.

జంగాలోని అసంతృప్తి బయటపడటంతో తెలుగుదేశంపార్టీ నేతలు పసిగట్టారు. వెంటనే ఇదే విషయాన్ని చంద్రబాబునాయుడుతో ప్రస్తావించారట. అందుకనే బీసీ సామాజికవర్గంకు చెందిన జంగా పార్టీలోకి వస్తే ఏదో ఒక నియోజకవర్గం నుండి పోటీచేయించే అవకాశం ఇవ్వచ్చని చంద్రబాబు కూడా తనను కలిసిన నేతలతో చెప్పారట. అయితే గురజాలలో మాజీ ఎంఎల్ఏ యరపతినేని శ్రీనివాసరావుకు కాకుండా టికెట్ వేరేవాళ్ళకి ఇచ్చే అవకాశంలేదు. అందుకనే జంగా టీడీపీలోకి వచ్చినా టికెట్ దక్కే అవకాశాలు లేవు.

వైసీపీలో జంగాకు కాసుకు చాలా కాలంగా పడటంలేదు. అలాగే జంగాకు మద్దతుగా ఉన్న మాజీమంత్రి అనీల్ కుమార్ నరసరావుపేట ఎంపీగా పోటీచేయబోతున్నారు. నెల్లూరు సిటీ టికెట్ అనీల్ కు నిరాకరించిన జగన్ తనకు టికెట్ ఇస్తారని జంగా ఎలాగ అనుకున్నారో అర్ధంకావటంలేదు. పార్టీలో ఉంటే ఎన్నికల్లో అభ్యర్ధుల గెలుపుకు పనిచేయాలి లేదా పార్టీ మారిపోయి ఏదో ఒక నియోజకవర్గం నుండి పోటీచేయాల్సిందే. పార్టీలో పరిస్ధితులు చూస్తుంటే ఎక్కువరోజులు జంగా పార్టీలో ఉండేట్లు కనబడటంలేదు. చివరకు ఏమవుతుందో చూడాలి.