Begin typing your search above and press return to search.

వైసీపీకి మరో కీలక ఎమ్మెల్సీ ఝలక్‌!

ఇప్పుడు వైసీపీలో కీలక నేత, యాదవ సామాజికవర్గంలో గట్టి పట్టున్న నేత, ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తి యాదవ్‌ పార్టీ వీడుతున్నారని ప్రచారం జరుగుతోంది.

By:  Tupaki Desk   |   19 Jan 2024 5:05 AM GMT
వైసీపీకి మరో కీలక ఎమ్మెల్సీ ఝలక్‌!
X

ఆంధ్రప్రదేశ్‌ లో ఎన్నికల ముంగిట అధికార వైసీపీలో టికెట్ల కుంపట్లు తగ్గడం లేదు. సీట్లు దక్కనివారు, ఆశిస్తున్నవారు పార్టీకి గుడ్‌ బై చెప్పడానికి సిద్ధమవుతున్నారు. ఇప్పటికే పలువురు వైసీపీ ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు వేరే పార్టీల్లో చేరిపోవడానికి ఏర్పాట్లు చేసుకుంటున్నారు. పెనమలూరు ఎమ్మెల్యే కొలుసు పార్థసారధి టీడీపీలో చేరడానికి రంగం సిద్ధమైంది. మచిలీపట్నం ఎంపీ వల్లభనేని బాలశౌరి జనసేన పార్టీలో చేరుతున్నారు. అలాగే కడప జిల్లా వైసీపీ ఎమ్మెల్సీ రామచంద్రయ్య సైతం టీడీపీలో చేరిపోయారు.

ఇప్పుడు వైసీపీలో కీలక నేత, యాదవ సామాజికవర్గంలో గట్టి పట్టున్న నేత, ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తి యాదవ్‌ పార్టీ వీడుతున్నారని ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే ఆయన తన సామాజికవర్గానికే చెందిన పెనమలూరు ఎమ్మెల్యే కొలుసు పార్థసారధితో మంతనాలు జరిపారని టాక్‌ నడుస్తోంది.

గుంటూరు జిల్లా గురజాల టీడీపీ మాజీ ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు ప్రధాన అనుచరుడిగా రాజకీయాల్లోకి ప్రవేశించారు.. జంగా కృష్ణమూర్తి. ఈ క్రమంలో 1999, 2004 ఎన్నికల్లో గురజాల నుంచి కాంగ్రెస్‌ పార్టీ తరఫున ఎమ్మెల్యేగా విజయం సాధించారు. 2009లో కాంగ్రెస్‌ ఆయనకు సీటు ఇవ్వలేదు. ఎమ్మెల్సీగా అవకాశమిచ్చింది. ఇక 2014లో వైసీపీలో చేరిన జంగా గురజాల నుంచి పోటీ చేసి ఓటమి పాలయ్యారు. 2019లో వైసీపీ గురజాల నుంచి మాజీ మంత్రి కాసు వెంకట కృష్ణారెడ్డి కుమారుడు కాసు మహేశ్‌ రెడ్డికి సీటు ఇచ్చింది. జంగా కృష్ణమూర్తికి ఎమ్మెల్సీగా అవకాశమిచ్చింది.

అంతేకాకుండా తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) చైర్మన్‌ ను చేస్తామని జంగాకు వైసీపీ అధిష్టానం హామీ ఇచ్చింది. అయితే ఆ పదవిని ఆయనకు ఇవ్వకుండా జగన్‌ తన బాబాయ్‌ వైవీ సుబ్బారెడ్డికి ఇవ్వడంతో జంగా కృష్ణమూర్తి అసంతృప్తి చెందారు. రెండో విడతలో అయినా వస్తుందని ఆశలు పెట్టుకోగా రెండోసారి తిరుపతి ఎమ్మెల్యే కరుణాకర్‌ రెడ్డికి టీటీడీ చైర్మన్‌ పదవిని ఇచ్చారు. దీంతో జంగా తీవ్ర అసంతృప్తితో ఉన్నారని తెలుస్తోంది.

వచ్చే ఎన్నికల్లో తనకు గురజాల అసెంబ్లీ సీటును ఇవ్వాలని జగన్‌ ను కోరారు. ఇవ్వనిపక్షంలో తన దారి తాను చూసుకుంటానని తేల్చిచెప్పినట్టు తెలుస్తోంది. ఇప్పటికే ఈ విషయాన్ని జంగా కృష్ణమూర్తి బహిరంగంగా ప్రకటించారు. సీటు ఇవ్వకపోతే తన కార్యాచరణ ప్రకటిస్తానని స్పష్టం చేశారు.

అయితే ప్రస్తుతం గురజాల ఎమ్మెల్యేగా ఉన్న కాసు మహేశ్‌ రెడ్డిని తప్పించే ఉద్దేశంలో వైసీపీ అధినేత వైఎస్‌ జగన్‌ లేరని తెలుస్తోంది. వచ్చే ఎన్నికల్లోనూ కాసుకే సీటు అని స్పష్టం చేసినట్టు సమాచారం. ఈ నేపథ్యంలో యాదవ సామాజికవర్గంలో కీలక నేతగా ఉన్న జంగా కృష్ణమూర్తి ఏ రూటు తీసుకుంటారనేది ఆసక్తికరంగా మారింది. ఈ నేపథ్యంలోనే తన సామాజికవర్గానికే చెందిన, తనకులానే సీటు లభించని పెనమలూరు ఎమ్మెల్యే కొలుసు పార్థసారధితో మంతనాలు జరపడం ఆసక్తి రేపుతోంది.