ఆస్తి కోసం 4 రోజులుగా కొడుకు ఇంటి ముందే శవం
ఆస్తి కోసం ఎంతకైనా తెగించే వారసులు అప్పుడప్పుడు కనిపిస్తుంటారు. ఈ కోవలోకే చెందుతుంది తాజా ఉదంతం.
By: Tupaki Desk | 15 Feb 2025 4:30 AM GMTఆస్తి కోసం ఎంతకైనా తెగించే వారసులు అప్పుడప్పుడు కనిపిస్తుంటారు. ఈ కోవలోకే చెందుతుంది తాజా ఉదంతం. విన్నంతనే.. ఓర్నీ.. అన్నట్లుగా ఉండే ఈ ఉదంతం తెలంగాణలోని జనగామ జిల్లాలో చోటు చేసుకుంది. ఆస్తి పంపకాల్లో తనకు అన్యాయం జరిగిందన్న కారణంగా తండ్రి శవానికి అంత్యక్రియలు జరగకుండా చూడటమే కాదు.. దాన్ని కదిలిచ్చే ప్రసక్తే లేదన్న కొడుకు నిర్వాకం హాట్ టాపిక్ గా మారింది. చివరకు పోలీసులు.. రెవెన్యూ అధికారులు.. గ్రామ పెద్దల పంచాయితీతో ఒక కొలిక్కి తీసుకొచ్చారు. తండ్రి శవానికి అంత్యక్రియలు చేసేందుకు తనకు ఆస్తిలో వాటా కావాలని గొడవ పడి మరీ పంతం నెగ్గించుకున్న వైనం చూసినప్పుడు బంధాల కంటే కూడా డబ్బులకు మాత్రమే ప్రాధాన్యతను ఇవ్వటమా? అని అనుకోకుండా ఉండలేం. అసలేం జరిగిందంటే..
జనగామ జిల్లాలోని కొడకండ్ల మండలం ఏడునూతల గ్రామానికి చెందిన యాదగిరికి ఇద్దరు భార్యలు. మొదటి భార్య రేణుకకు రమేశ్.. రెండో భార్య పద్మకు ఉపేందర్.. శోభలు సంతానం. యాదగిరికి 15 ఎకరాల భూమి ఉంది. దీన్ని ఐదు ఎకరాల చొప్పున ఇద్దరు కొడుకులు రమేశ్.. ఉపేందర్ పేరుతో రిజిస్ట్రేషన్ చేశారు. మిగిలిన ఐదు ఎకరాల్ని కుమార్తె శోభకు 3 ఎకరాలు ఇచ్చి పెళ్లి చేశారు. అందరికి పంచగా మిగిలిన 2 ఎకరాల్ని రెండో భార్య పద్మ పేరుతో పట్టా చేశారు.
గడిచిన కొద్ది రోజులుగా అనారోగ్యంతో బాధ పడుతున్న యాదగిరి ఫిబ్రవరి 10న కన్నుమూశారు. హైదరాబాద్ లో చనిపోయిన యాదగిరి మ్రతదేహాన్ని అంత్యక్రియల కోసం ఊరికి తీసుకొచ్చారు. రెండో భార్య పద్మ.. కూతురు శోభతో కలిసి మొదటి భార్య కొడుకైన రమేశ్ ఇంటికి తీసుకొచ్చారు. ఇక్కడే కొత్త పంచాయితీ మొదలైంది. యాదగిరి చనిపోయిన నాటి నుంచి ఆస్తి మొత్తం తన పేరు మీదే రాయాలంటూ మొదటి భర్త కొడుకు బలవంతం చేయటం మొదలు పెట్టాడు.
అందుకు కాదన్నందుకు యాదగిరి శవానికి అంత్యక్రియలు జరగకుండా అ్డుకున్నారు. తన పేరు మీద ఉన్న రెండు ఎకరాల భూమిని ఇచ్చేస్తే.. తాను బతికేది ఎలా? అన్నది రెండో భార్య ఆవేదన. తన పేరు మీద ఉన్న భూమిని రిజిస్ట్రేషన్ చేయాలంటూ బలవంతంగా ఎమ్మార్వో ఆఫీసుకు తీసుకొచ్చినట్లుగా యాదగిరి రెండో భార్య పద్మ పేర్కొన్నారు. మరోవైపు పద్మ పేరు మీద ఉన్న రెండు ఎకరాల భూమిని ఇస్తే తప్పించి.. అంత్యక్రియలు చేసేది లేదని రమేశ్ పట్టుబట్టారు. వీరిపంచాయితీ తేలకపోవటంతో ఇంటి ముందే డెడ్ బాడీని ఉంచేశారు.
దీంతో పోలీసులు.. రెవెన్యూ అధికారులు రంగంలోకి దిగారు. రెండు కుటుంబాల వారితో దఫదఫాలుగా మాట్లాడిన వారు చివరకు పద్మ పేరుతో ఉన్న 2 ఎకరాల భూమిలో ఎకరం 10 గుంటల భూమిని రమేశ్ కు బదలాయించేందుకు ఒప్పుకోవటంతో పాటు.. దీనికి సంబంధించిన పాస్ పుస్తకం ఎమ్మార్వో ఆఫీసులో అప్పజెప్పిన తర్వాతే.. తండ్రి అంత్యక్రియలకు కొడుకు ఓకే అనటం గమనార్హం. ఈ వ్యవహారం స్థానికంగానే కాదు.. చుట్టుపక్కల ఊళ్లలోనూ హాట్ టాపిక్ గా మారింది.