భారీగా గంజాయి పట్టివేత... తెరపైకి టీడీపీ నేతల హస్తం వ్యాఖ్యలు!!
కాగా.. విశాఖ పోర్ట్ లో దొరికినట్లు చెబుతున్న 25వేల కిలోల డ్రగ్స్ వ్యవహారం తీవ్ర చర్చనీయాంశం అయిన సంగతి తెలిసిందే.
By: Tupaki Desk | 30 March 2024 5:30 AM GMTవిశాఖపట్నం పోర్ట్ లోని ఒక కంటైనర్ లో 25 వేల కిలోల మాదకద్రవ్యాలు పట్టుబడిన వ్యవహారానికి సంబంధించి జరుగుతున్న రాజకీయ రచ్చ అంతా ఇంతా కాదనేది తెలిసిన విషయమే. ఈ ఘటన ఇంకా ఓ కొలిక్కి రాకముందే... విశాఖలో గంజాయి పట్టుబడిన సంఘటన చోటు చేసుకుంది. విశాఖ నుంచి ఢిల్లీకి గంజాయిని తరలిస్తున్నారని చెబుతున్నారు. ఆ సమయంలోనే ఈ గుట్టు రట్టయినట్లు తెలుస్తుంది.
వివరాళ్లోకి వెళ్తే... జన్మభూమి ఎక్స్ ప్రెస్ లో రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ (ఆర్.పీ.ఎఫ్.) ఒక వ్యక్తిని పట్టుకుని, అతడి వద్ద నుంచి 16 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు! ఈ సందర్భంగా ఈ వ్యవహారానికి సంబంధించి తెలుస్తున్న సమాచారం ఈ విధంగా ఉంది!
అందుతున్న సమాచారం ప్రకారం.. విశాఖ - అనకాపల్లి మార్గ మధ్యలో ఒక ప్రయాణికుడికి సంబంధించిన సమాచారం అందడంతో... అధికారులు రైల్వే పోలీసులకు సమాచారం అందించారంట. దీంతో తనిఖీలు చేయగా... అతడివద్ద ఉన్న బ్యాగులో సుమారు 16 కిలోల గంజాయి లభించిందని.. దీన్ని విశాఖపట్నం నుంచి విజయవాడ మీదుగా ఢిల్లీకి తరలిస్తున్నట్లు గుర్తించామని పోలీసులు చెబుతున్నారని తెలుస్తుంది.
మరోపక్క సుమారు వారం రోజుల క్రితం మార్చి 21న కొయూరులోని డౌనూరు పంచాయతీలో 17 బస్తాల్లో నింపిన 532 కిలోల గంజాయిని ఏపీ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు! దీని విలువ సుమారు ఇరవై ఆరున్నర లక్షల రూపాయలు ఉండొచ్చని అంచనా తెలుస్తుంది. ఈ వ్యవహారానికి సంబంధించి ముగ్గురు వ్యక్తులను అరెస్ట్ చేయగా.. మరో నిందితుడు పరారీలో ఉన్నాడని సమాచారం. ఈ నేపథ్యంలో... దీని వెనుకా ప్రతిపక్ష టీడీపీకి చెందిన నాయకులు ఉన్నారని అంటున్నారు. దీంతో... ఈ వ్యవహారం మరింత చర్చనీయాంశం అవుతోంది!
కాగా.. విశాఖ పోర్ట్ లో దొరికినట్లు చెబుతున్న 25వేల కిలోల డ్రగ్స్ వ్యవహారం తీవ్ర చర్చనీయాంశం అయిన సంగతి తెలిసిందే. ఈ వ్యవహారంపై ప్రధానంగా ఏపీ ప్రతిపక్ష టీడీపీపై విమర్శలు బలంగా వినిపించాయి! ఆ పార్టీకి సంబంధించిన వ్యక్తుల అధ్వర్యంలో నడుస్తున్న కంపెనీ అడ్రస్ తోనే ఆ కంటైనర్ బ్రెజిల్ నుంచి వచ్చిందంటూ రక రకాల వెర్షన్స్ లో విమర్శలు తెరపైకి వచ్చాయి.
ఈ ఘటనపై అటు వైసీపీ నుంచి టీడీపీపై తీవ్ర విమర్శలు.. ఎన్నికల కమిషన్, సీబీఐ అధికారులకు ఫిర్యాదులు కూడా అందాయని తెలుస్తుంది! వీలైనంత త్వరగా ఈ డ్రగ్స్ వ్యవహారంలోని నిందితులు, తెరవెనుక ఉన్నట్లు చెబుతున్న ఆ అదృశ్య శక్తుల వివరలను బట్టబయలు చేయాలని.. ఈ విషయాలపై ప్రజలకు క్లారిటీ ఇవ్వాలని వారు కోరుతున్నారు!!