తెలంగాణలో జనసేన.. ఏపీలో ఉత్కంఠ.. రీజనేంటి..?
అయితే.. తెలంగాణలో పోటీలో ఉన్న జనసేన వ్యవహారం ఏపీలో చర్చకు దారితీసింది.
By: Tupaki Desk | 1 Dec 2023 6:46 AM GMTతెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో 8 స్థానాల్లో జనసేన పోటీలో ఉన్న విషయం తెలిసిందే. బీజేపీతో పొత్తు పెట్టుకున్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పొత్తులో భాగంగా కూకట్‌పల్లి వంటి కీలక నియోజకవర్గాల్లో అభ్యర్థులను నిలబెట్టారు. వారి తరఫున చివరి నాలుగు రోజులు ప్రచారం కూడా చేశారు. వీరిలో రెడ్లు, కమ్మలకు ప్రాధాన్యం ఇచ్చారు. ఒక కాపు నాయకుడికి కూడా టికెట్ ఇచ్చారు. గెలుపు గుర్రం ఎక్కడం ఖాయమని కూడా చెప్పుకొచ్చారు.
అయితే.. తెలంగాణలో పోటీలో ఉన్న జనసేన వ్యవహారం ఏపీలో చర్చకు దారితీసింది. ముఖ్యంగా ఉభయ గోదవరి జిల్లాల్లో జనసేనకు పట్టుండడంతో అక్కడ రాజకీయాలు..ఇక్కడ కూడా చర్చనీయాంశం అవుతున్నాయి. ఏపీలో గత ఎన్నికల్లో 148 నియోజకవర్గాల్లో జనసేన పోటీ చేసింది. అయితే.. కేవలం రాజోలు టికెట్ మాత్రమే విజయం దక్కించుకుంది. పవన్ పోటీ చేసిన రెండు స్థనాల్లోనూ ఓడిపోయారు. ఈ నేపథ్యంలో తెలంగాణలో ఆయన ఏమేరకు తన అభ్యర్థులను గెలిపించుకుంటారనేది ఆసక్తిగా మారింది.
ఇదే విషయంపై ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలోని కొందరు జనసేన నాయకులు మరింత ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. పవన్‌పై వైసీపీ విఫల నాయకుడిగా ముద్ర వేసిన నేపథ్యంలో తెలంగాణలో కనుక ఆయన తన అభ్యర్థులను గెలిపించుకుంటే ఆ అపవాదు పోతుందని..ఇక్కడ పార్టీ పుంజుకునేందుకు అవకాశం ఉంటుందని వారు అంచనా వేస్తున్నారు. అదేసమయంలో వచ్చే ఎన్నికలకు బూస్ట్‌గా మారుతుందని అంచనా వేస్తున్నారు.
మరోవైపు.. జనసేన తెలంగాణ దక్కించుకునే స్థానాలపై వైసీపీ నాయకులు కూడా ఆసక్తిగా చూస్తున్నారు. తెలంగాణలో కనుక జనసేన గెలిస్తే.. అక్కడి ఫలితం ఇక్కడ కూడా రిఫ్లెక్ట్ అవుతుందని నాయకులు అంచనా వేస్తున్నారు. దీంతో తెలంగాణలో జనసేన పోటీ చేస్తున్న స్థానాల్లో ఏం జరుగుతోంది. పోలింగ్ సరళి ఎలా ఉంది? అనే విషయాలను వారు ఆసక్తిగా పరిశీలిస్తున్నారు. మరి ఏం జరుగుతుందో చూడాలి.