డిప్యూటీ స్పీకర్ పదవిపై సస్పెన్స్!
ఆంధ్రప్రదేశ్ శాసనసభ డిప్యూటీ స్పీకర్ పదవిపై సస్పెన్స్ కొనసాగుతోంది.
By: Tupaki Desk | 22 Jun 2024 7:49 AM GMTఆంధ్రప్రదేశ్ శాసనసభ డిప్యూటీ స్పీకర్ పదవిపై సస్పెన్స్ కొనసాగుతోంది. రాష్ట్రంలో కొత్తగా కూటమి ప్రభుత్వం కొలువుతీరింది. కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలందరూ అసెంబ్లీలో ప్రమాణ స్వీకారం చేశారు. స్పీకర్‌గా చింతకాయల అయ్యన్నపాత్రుడిని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఆయన బాధ్యతలు కూడా స్వీకరించారు. కానీ డిప్యూటీ స్పీకర్ ఎవరనేది దానిపై మాత్రం ఇంకా స్పష్టత రాలేదు. రాబోయే అసెంబ్లీ సమావేశాల్లోనే అది ఎవరు అనేది తెలుస్తుందనే టాక్ వినిపిస్తోంది.
ఈ ఎన్నికల్లో కూటమి విజయం సాధించడంలో జనసేన అధినేత పవన్ కల్యాణ్ కీలక పాత్ర పోషించారు. వైసీపీ వ్యతిరేక ఓటు చీల్చకూడదనే లక్ష్యంతో టీడీపీ, బీజేపీ, జనసేన జట్టు కట్టడంలో పవన్ కీలకంగా వ్యవహరించారు. ఎన్నికల ప్రచారంలోనూ దూకుడు ప్రదర్శించారు. జనసేన పోటీ చేసిన 21 స్థానాల్లోనూ పార్టీ అభ్యర్థులను గెలిపించుకున్నారు. దీంతో పవన్‌కు టీడీపీ అధినేత, సీఎం చంద్రబాబు నాయుడు అధిక ప్రాధాన్యతనిస్తున్నారు. డిప్యూటీ సీఎం పదవితో పాటు కీలకమైన శాఖలు పవన్‌కు కట్టబెట్టారు. అంతే కాకుండా డిప్యూటీ స్పీకర్ పదవి కూడా జనసేన ఎమ్మెల్యేలకే ఇవ్వాలని బాబు నిర్ణయించినట్లు తెలిసింది.
ఇప్పటికే ఈ మేరకు జనసేన అగ్రనాయకత్వానికి బాబు సమాచారం అందించారని కూడా ప్రచారం జరుగుతోంది. ఈ డిప్యూటీ స్పీకర్ పదవి కోసం కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ, నెల్లిమర్ల ఎమ్మెల్యే లోకం మాధవి పేర్లను పవన్ సూచించినట్లు ఊహాగానాలు వ్యక్తమవుతున్నాయి. కానీ ఈ పదవిపై ఇంకా క్లారిటీ రాలేదని టాక్. బాబు, పవన్ దీనిపై ఓ నిర్ణయం తీసుకోలేకపోతున్నారని తెలిసింది. కూటమి అభ్యర్థుల్లో ఎవరికి ఈ పదవి అప్పగించాలన్న దానిపై తేల్చుకోలేకపోతున్నారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.