జనసేనలో ‘ఆరణి’ జ్వాలలు!
ఆంధ్రప్రదేశ్ లో వచ్చే ఎన్నికలలో టీడీపీ, జనసేన, బీజేపీ కలిసి పోటీ చేస్తున్న సంగతి తెలిసిందే.
By: Tupaki Desk | 14 March 2024 10:52 AM GMTఆంధ్రప్రదేశ్ లో వచ్చే ఎన్నికలలో టీడీపీ, జనసేన, బీజేపీ కలిసి పోటీ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో జనసేన పార్టీ 21 అసెంబ్లీ, రెండు పార్లమెంటు స్థానాల్లో పోటీ చేస్తోంది. కాగా ఇప్పటికే 15 స్థానాలకు పవన్ కళ్యాణ్ విడతల వారీగా అభ్యర్థులను ప్రకటించారు. కొందరి పేర్లను బహిరంగంగా మీడియాకు వెల్లడించగా మరికొందరిని తాజాగా మంగళగిరిలోని పార్టీ కార్యాలయానికి పిలిపించి సీట్లు కేటాయిస్తున్నట్టు చెప్పారు. జాగ్రత్తగా పనిచేసుకోవాలని గెలిచి రావాలని ఉద్భోదించారు.
కాగా తిరుపతి సీటును చిత్తూరు వైసీపీ ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులకు కేటాయించినట్టు ప్రచారం జరుగుతోంది. ఆయన కొద్ది రోజుల క్రితమే జనసేన పార్టీలో చేరారు. ఈ నేపథ్యంలో మొదటి నుంచి తిరుపతిలో జనసేన పార్టీ తరఫున కార్యక్రమాలు నిర్వహించిన కిరణ్ రాయల్, పవన్ కళ్యాణ్ రాజకీయ కార్యదర్శి, ఉమ్మడి చిత్తూరు జిల్లా జనసేన పార్టీ అధ్యక్షుడు పసుపులేటి హరిబాబు తీవ్ర నిరుత్సాహానికి గురయ్యారని అంటున్నారు.
అలాగే ఇప్పటికే జనసేన పార్టీలో చేరిన మాజీ ఎంపీ డీకే ఆదికేశవులునాయుడు మనుమరాలు డీకే చైతన్య కూడా చిత్తూరు లేదా తిరుపతి సీటును ఆశించారు. అయితే చిత్తూరు సీటులో ఇప్పటికే టీడీపీ అభ్యర్థిని ప్రకటించింది. దీంతో చైతన్య తిరుపతి సీటును ఆశించారు. అయితే కిరణ్ రాయల్, హరిబాబు, డీకే చైతన్యల్లో ఎవరికీ కేటాయించకుండా ఆరణి శ్రీనివాసులకు సీటు ఇవ్వడం ఆ నేతల్లో అసంతృప్తి జ్వాలలు రేపిందని టాక్ నడుస్తోంది.
స్థానికుడు కాని వ్యక్తికి సీటు ఎలా ఇస్తారని అసంతృప్త నేతలు ప్రశ్నిస్తున్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే తిరుపతి టీడీపీ నేతలు.. ఊకా విజయకుమార్, పెద్బబ్బ, పులిగోరు మురళీధర్ రెడ్డి తదితరులతోపాటు జనసేన అసంతృప్త నేతలు కిరణ్ రాయల్ తదితరులు ఒక హోటల్ లో తాజాగా సమావేశం కావడం ప్రాధాన్యం సంతరించుకుంది.
మరోవైపు తిరుపతి టీడీపీ మాజీ ఎమ్మెల్యే సుగుణమ్మ సైతం సీటును ఆశించారు. టీడీపీకి ఈ సీటు రాకుంటే జనసేనలోకి వచ్చయినా ఆ పార్టీ తరఫున పోటీ చేస్తానని ఇప్పటికే ప్రకటించారు. ఈ మేరకు గతంలోనే ఆమె పవన్ కళ్యాణ్ ను కలిశారు. తమ కుటుంబం పవన్ అభిమానులమని చెప్పారు కూడా. అయితే ఆమెకు కూడా నిరాశే ఎదురైంది.
కాగా తిరుపతి జనసేన సీటును దక్కించుకున్న ఆరణి శ్రీనివాసులు 2019లో వైసీపీ తరఫున చిత్తూరు నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. 2009లో ప్రజారాజ్యం పార్టీ తరఫున తొలిసారి చిత్తూరు నుంచి పోటీ చేసి ఓడిపోయారు. ఆ ఎన్నికల్లో రెండో స్థానంలో నిలిచారు. 2014లో వైసీపీ తరఫున పోటీ చేసి ఓటమి పాలయ్యారు. 2019లో మరోసారి పోటీ చేసి విజయం సాధించారు. అప్పట్లో ప్రజారాజ్యం పార్టీకి, గతంలో వైసీపీకి జిల్లా అధ్యక్షుడిగా వ్యవహరించారు. 2009లో ఓడిపోయాక టీడీపీలో చేరిన ఆరణి ఆ పార్టీకి చిత్తూరు జిల్లా అధ్యక్షుడిగా కూడా పనిచేశారు.
ఇలా ఇప్పటివరకు ఆరణి శ్రీనివాసులు ప్రజారాజ్యం, టీడీపీ, వైసీపీ పార్టీలు మారారు. ఇప్పుడు నాలుగో పార్టీ జనసేనలో చేరి సీటు దక్కించుకున్నారు. దీంతో వైసీపీ అధినేత జగన్ ఆయనను పార్టీ నుంచి సస్పెండ్ చేశారు.