జనసేనకు సింబల్ ట్రబుల్...వారికి కూడా అదే గుర్తు...!?
జనసేన ఆశలు ఈ ఎన్నికల్లో అయినా తీరుతాయి అంటే అవి అలాగే ఉండిపోతాయా అన్న కలవరం అయితే క్యాడర్ లో కనిపిస్తోంది.
By: Tupaki Desk | 3 April 2024 9:36 AM GMTజనసేన ఆశలు ఈ ఎన్నికల్లో అయినా తీరుతాయి అంటే అవి అలాగే ఉండిపోతాయా అన్న కలవరం అయితే క్యాడర్ లో కనిపిస్తోంది. జనసేనకు శాశ్వతంగా ఎన్నికల గుర్తు దక్కడం లేదు పార్టీ పెట్టి పదేళ్లు అయినా ఇలాంటి విచిత్రమైన పరిస్థితిలో వైసీపీ ఉండిపోతోంది. దానికి కారణం ఎవరూ అంటే అధినాయకత్వాన్ని ఎత్తి చూపాలి.
ఆ పార్టీ 2019 ఎన్నికల్లో మొదటిసారి పోటీ చేసింది. ఓట్ల శాతం ఆరు దాటినా సీట్లు కనీసం రెండు కూడా గెలిపించుకోలేక పోయింది. ఫలితంగా కేంద్ర ఎన్నికల సంఘం నిబంధనలకు అనుగుణంగా జనసేనకు కామన్ సింబల్ ఇవ్వడం కుదరదు అంటోంది. పైగా దాన్ని ఫ్రీ సింబల్ జాబితాలో పెట్టేసింది.
దీంతో ఎక్కడ లేని టెన్షన్ అయితే జనసేనలో కలుగుతోంది. ఇపుడు ఎన్నికల సంఘం నిబంధనల ప్రకారం చూస్తే గాజు గ్లాస్ గుర్తు జనసేనకు లేదు. అదే సమయంలో ఆ గుర్తు ఎన్నికల్లో పోటీ చేసే ఇండిపెండెంట్ తో పాటు రిజిస్టర్ చేసుకున్న పార్టీలు ఏవైనా అడిగే అవకాశం ఉంది. అలా ఎవరికైనా ఆ గుర్తు ఈసీ ఇచ్చేయవచ్చు.
ఇదే ఇపుడు జనసేనలో అలజడి రేపుతోంది. ఈసీని కలసి వినతి చేస్తామని కామన్ సింబల్ గా తెచ్చుకుంటామని జనసేన వర్గాలు చెబుతున్నాయి. కానీ నిబంధలను చూస్తే జనసేన టెన్షన్ అలా కంటిన్యూ అయ్యే అవకాశమే ఉంది అని అంటున్నారు.
దానికి కారణం జనసేన కేవలం రెండు ఎంపీ సీట్లతో పాటు 21 ఎమ్మెల్యే సీట్లలోనే పోటీ చేస్తోంది. కేంద్ర ఎన్నికల సంఘం వద్ద రిప్రజెంటేషన్ ఇచ్చి తమ పార్టీ తరఫున పోటీ చేసున్న అభ్యర్ధులు అందరికీ కామన్ సింబల్ ఇవ్వాలని కోరవచ్చు.
దానికి ఈసీ అంగీకరించి జనసేన పోటీ చేస్తున్న వారందరికీ ఒకే గుర్తు ఇవ్వవచ్చు. అలా జనసేన అభ్యర్థుల వరకూ కామన్ గుర్తు ఇచ్చి కొంత ఊరట కలిగించినా జనసేన పోటీ చేయని సీట్లలో మాత్రం అది పక్కాగా ఫ్రీ సింబల్ అవుతుంది అని అంటున్నారు.
అంటే మిగిలిన 23 ఎంపీ సీట్లలో అలాగే 154 అసెంబ్లీ సీట్లలో ఫ్రీ సింబల్ గా గాజు గ్లాస్ ఉండబోతోంది. అక్కడ ఇండిపెండెంట్లు ఎవరైనా తమకు గాజు గ్లాస్ గుర్తు కావాలని కోరితే వారికి ఈసీ ఇచ్చే అధికారాన్ని కలిగి ఉంటుంది. అది ఈసీ విచక్షణాధికారం. దానిని ఎవరూ అడ్డుకోలేరు.
అంటే ఇక్కడ జనసేనకు ఈసీ ఏమైనా మేలు చేయగలిగితే ఆ పార్టీ తరఫున పోటీలో ఉన్న అభ్యర్థులందరికీ ఒకే గుర్తు ఇవ్వడమే ఆ మేలు అని అంటున్నారు. అంతకు మించి ఏపీలో మొత్తం అన్ని చోట్లా గాజు గ్లాస్ గుర్తుని తీసేయండి అని కోరినా ఈసీ దాన్ని ఆమోదిస్తుందన్న నమ్మకం మాత్రం లేదు అంటున్నారు.
ఎందుకంటే ఈసీ స్వతంత్ర సంస్థ. ఈసీ నిర్ణయాన్ని ఎవరూ ప్రభావితం చేయలేరు. అదే సమయంలో ఈసీ ఎన్నికల్లో పోటీ చేస్తున్న అందరి అభ్యర్థుల పట్ల ఒకేలా నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. జనసేనకు కామన్ సింబల్ ఇవ్వడం వల్ల ఆ పార్టీ పోటీ చేస్తున్న చోట మాత్రమే గాజు గ్లాస్ ని ఇండిపెండెంట్లకు ఇవ్వరు. అంతే తప్ప మిగిలిన చోట్ల ఈసీ డెసిషన్ మేరకు గాజు గ్లాస్ అందరి గుర్తు అవుతుంది.
అపుడు జనసేనకు ఇబ్బంది లేకపోయినా కూటమికి దాని వల్ల దెబ్బ పడుతుందని అంటున్నారు. ఎందుకంటే కూటమికి జనసేన ఓట్లు టర్న్ కావాలి. జనసేన పోటీ చేయని చోట కూటమి తరఫున బీజేపీ కానీ టీడీపీ కానీ ఉంటే వారికే ఓట్లు పడాలి. కానీ గాజుగ్లాస్ కనుక అక్కడ సింబల్ గా ఉంటే ఇండిపెండెంట్లకు ఎక్కువ ఓట్లు వచ్చినా లేక సాధారణ ప్రజలు జనసేన పోటీ అనుకుని ఓటేసినా కూటమికి భారీ నష్టం తప్పదని అంటున్నారు.
మరి ఈ విషయంలో ఈసీ నిర్ణయమే ఫైనల్ కాబట్టి జనసేనలో సింబల్ టెన్షన్ అంతకంతకు పెరిగిపోతోంది అని అంటున్నారు. చూడాలి మరి ఏమి జరుగుతుందో. ఇటీవల తెలంగాణా ఎన్నికల్లో పోటీ చేసినపుడు కూడా గుర్తు సమస్యతో జనసేన ఇబ్బందుల్లో పడింది. అక్కడ కూడా ఆరు శాతం ఓట్లు రాలేదు. చట్ట సభలలో ప్రాతినిధ్యం లేదు. కాబట్టి జనసేనకు కామన్ సింబల్ పర్మనెంట్ గా ఇవ్వలేదు అని గుర్తు చేస్తునారు.