Begin typing your search above and press return to search.

పిఠాపురంలో జనసేన జెండా ఎగురుతుందా ?

పిఠాపురంలో 2.29 లక్షల మంది ఓటర్లు ఉన్నారు. వీరిలో 115,717 మంది పురుషులు, 113,869 మంది మహిళలు ఉన్నారు.

By:  Tupaki Desk   |   11 May 2024 10:59 AM GMT
పిఠాపురంలో జనసేన జెండా ఎగురుతుందా ?
X

ఏపీ ఎన్నికల్లో ఇప్పుడు పిఠాపురం శాసనసభ స్థానం హాట్ సీట్. 2019 ఎన్నికల్లో గాజువాక, భీమవరం స్థానాల నుండి పోటీ చేసిన పవన్ కళ్యాణ్ రెండు చోట్లా ఓటమి పాలయ్యాడు. ఈ ఎన్నికల్లో టీడీపీ, జనసేన, బీజేపీ పొత్తులో భాగంగా పవన్ పిఠాపురం నుండి పోటీ చేస్తున్నాడు. ఈ ఎన్నికల్లో గెలుపు పవన్ రాజకీయ భవిష్యత్తుకు జీవన్మరణ సమస్య. అందుకే ఏపీలో అందరి దృష్టి పిఠాపురం మీదనే ఉంది.

పిఠాపురంలో 2.29 లక్షల మంది ఓటర్లు ఉన్నారు. వీరిలో 115,717 మంది పురుషులు, 113,869 మంది మహిళలు ఉన్నారు. ఇక్కడ కాపు ఓటర్లు సుమారు 75 వేల మంది, ఎస్సీలు 28 వేల మంది ఉన్నారు. ఎస్సీలలో మాలలు 20 వేలు, మాదిగలు 8 వేల వరకు ఉన్నారు. 23 వేల మంది శెట్టి బలిజ, మత్స్యకారులు 17 వేలు, పద్మశాలి, 16 వేలు, రెడ్లు 10 వేల మంది, కొప్పుల వెలమ 9 వేలు, తూర్పు కాపు 7 వేలు, క్షత్రియ 6 వేల మంది ఉన్నారు.

ఈ నేపథ్యంలో పవన్ గెలుపులో కాపులది కీలకపాత్ర. అయితే అధికార వైసీపీ తరపున కాపు సామాజిక వర్గానికే చెందిన కాకినాడ ఎంపీ వంగా గీతను బరిలోకి దించారు. 2009లో ప్రజారాజ్యం తరపున ఎమ్మెల్యేగా గెలిచిన వంగా గీత, 2019లో కాకినాడ నుండి వైసీపీ ఎంపీగా గెలిచింది.

పవన్ కళ్యాణ్ గెలుపుకోసం టాలీవుడ్ చిన్న, పెద్ద నటులు, జబర్దస్త్ నటులు ప్రచారానికి దిగారు. పవన్ సోదరుడు నాగబాబు అక్కడే ఉండి ఎన్నికల వ్యవహారాలు పర్యవేక్షిస్తున్నాడు. ఎన్నికల ప్రచారం ఆఖరిరోజు మెగాస్టార్ చిరంజీవి రావాల్సి ఉండగా ఆఖరు నిమిషంలో క్యాన్సల్ అయింది. ఈ నేపథ్యంలో మరో మెగా హీరో రాంచరణ్ ప్రచారం చేస్తున్నాడు.

ఇక ఆఖరిరోజు ప్రయాణానికి వైసీపీ అధినేత, రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పిఠాపురం అభ్యర్థి వంగా గీత తరపున ప్రచారం చేశారు. పవన్ కళ్యాణ్ ఎన్నికల తర్వాత అందుబాటులో ఉండడు. వంగా గీత అందుబాటులో ఉంటుంది. అందుకే అందుబాటులో ఉన్న వారికే ఓటువేయాలి అన్న చర్చ పిఠాపురంలో నడుస్తుంది.

పవన్ కళ్యాణ్ బలం ఎంత ? ఆయన తరపున ప్రచారం చేస్తున్న వారంతా స్థానికేతరులే .. ఆయనతో ఉన్న వారిలో ఓటర్లు ఎంత మంది ? అన్న ప్రశ్నలు పిఠాపురం ఓటర్లను వేధిస్తున్నాయి. ఈ నేపథ్యంలో జనసేన జెండా పిఠాపురంలో ఎగురుతుందా ? పవన్ ప్రయత్నాలు ఫలిస్తాయా ? అన్న చర్చ అక్కడ జరుగుతుండడం గమనార్హం.