Begin typing your search above and press return to search.

మనుషులనూ ఉతికి ఆరేస్తుంది.. అలాంటి వాషింగ్ మెషీన్ వచ్చేసింది

ఉతికి ఆరేయడం.. క్రికెట్ లో ప్రత్యర్థి బౌలర్లను బ్యాట్స్ మెన్ ఉతికి ఆరేస్తుంటారు.

By:  Tupaki Desk   |   3 Dec 2024 4:30 PM GMT
మనుషులనూ ఉతికి ఆరేస్తుంది.. అలాంటి వాషింగ్ మెషీన్ వచ్చేసింది
X

ఉతికి ఆరేయడం.. మనం సహజంగా దుస్తులను ఉతికి ఆరేస్తుంటాం..

ఉతికి ఆరేయడం.. రాజకీయాల్లో ప్రత్యర్థులను నాయకులు ఉతికి ఆరేస్తుంటారు..

ఉతికి ఆరేయడం.. క్రికెట్ లో ప్రత్యర్థి బౌలర్లను బ్యాట్స్ మెన్ ఉతికి ఆరేస్తుంటారు.

..కానీ, ఏకంగా మనుషులనే ఉతికి ఆరేసే యంత్రాలు వచ్చాయట. ఎవరినైనా అవి ఉతికి ఆరేస్తాయట. ఇవి ఎవరికోసం అంటే..? రోజూ స్నానం చేయడం అంటే బద్ధకించేవారి కోసం అంట.

ఏదైనా జపాన్ వాళ్ల తర్వాతే..

ఇప్పుడంటే కాస్త వెనుకబడింది కానీ.. జపాన్ ఒకప్పుడు అనేక ఆవిష్కరణలకు పుట్టిల్లు. ఇలాంటి జపాన్‌ లోని ఓ కంపెనీ శుభవార్త చెబుతోంది. మనుషులనూ ఉతికే (హ్యూమన్‌ వాషింగ్‌) మెషిన్లను సిద్ధం చేసిందట.

ఒసాకా హెడ్ క్వార్టర్స్ లోని ‘సైన్స్‌ కో’ సంస్థ హ్యూమన్‌ వాషింగ్‌ మెషిన్‌ తయారు చేసిందట. ఒక మనిషిని శుభ్రం చేయడానికి పావుగంట మాత్రమే పడుతుందట. మరి.. ఈ వాషింగ్ మెషీన్ ఎలా ఉంటుంది?? ఫైటర్‌ జెట్‌ కాక్‌ పిట్‌ లాగా ఉంటుందట

పనిచేసేది ఇలా..

హ్యూమన్ వాషింగ్ మెషీన్ ను ఒసాకా కన్సాయి ఎక్స్‌ పోలో ప్రదర్శించనున్నారు. వెయ్యిమంది అతిథులు ప్రయోగాత్మకంగా దీనిని వాడుకునేలా ఏర్పాట్లు జరుగుతున్నాయి. దీని తర్వాత పెద్దఎత్తున వాడుకునే (మాస్‌ ప్రొడక్షన్‌ వెర్షన్‌) మెషీన్ ను విడుదల చేస్తారట. ఇక హ్యూమన్ వాషింగ్ మెషీన్ లో.. పారదర్శకంగా ఉండే ప్లాస్టిక్‌ పాడ్‌ లోకి మనిషి ఒకసారి ప్రవేశించాక.. క్యాప్సుల్‌ లో సగం పైగా గోరువెచ్చని నీరుతో నిండుతుంది. తర్వాత అందులోని హెస్పీడ్‌ జెట్స్‌ నుంచి నీటిని వేగంగా విరజిమ్ముతుంది. ఇందులో మూడు మైక్రో మీటర్ల పరిమాణంలోని అతి సూక్ష్మ బుడగలు మనిషి శరీరంపై ఉన్న మురికిపై ఒత్తిడి సృష్టించి తొలగిస్తాయి.

స్నానం చేసే వ్యక్తిని మానసికంగా, ఉత్సాహంగా ఉంచేందుకు కూడా ఇందులో ఏర్పాట్లు ఉన్నాయట. అంతేకాదు.. ఇవి మనిషి శరీరానికి సంబంధించిన కీలక సమాచారం సేకరిస్తాయట. ఆర్టిఫీషియల్ ఇంటిలిజెన్స్ ద్వారా వ్యక్తి మౌనంగా ఉన్నాడా.. ఉత్సాహంగా ఉన్నాడా అనేది అంచనా వేసి.. తగిన వీడియోను ఆ పాడ్‌లో ప్రసారం చేస్తాయి.

50 ఏళ్ల కిందటే..

ఈ హ్యూమన్ వాషింగ్ మెషీన్ ను 50 ఏళ్ల క్రితం నాటి డిజైన్‌ ఆధారంగా తయారు చేశారట. అంటే.. ఆలోచన ఎప్పటిదో తెలుస్తోంది. కాగా, 1970లో జపాన్‌ వరల్డ్‌ ఎక్స్‌ పో శానియో ఎలక్ట్రిక్‌ కో (ప్రస్తుత పానసోనిక్‌) దీనిని తొలిసారి తయారుచేసింది. ఆ వెర్షన్‌ తో పోలిస్తే కొత్తదానిలో అత్యధిక మసాజ్‌ బాల్స్‌ ఉన్నాయట.