పుర్రెకో బుద్ది... ఇళ్లల్లో దూరడమే ఇతడి స్ట్రెస్ బస్టర్!
ఈ మధ్య కాలంలో ప్రతీ ఒక్కరూ వారి వారి పరిధిలో ఒత్తిడికి గురవుతున్నారనే కామెంట్లు వినిపిస్తున్న సంగతి తెలిసిందే.
By: Tupaki Desk | 27 Nov 2024 8:30 PM GMTఈ మధ్య కాలంలో ప్రతీ ఒక్కరూ వారి వారి పరిధిలో ఒత్తిడికి గురవుతున్నారనే కామెంట్లు వినిపిస్తున్న సంగతి తెలిసిందే. ఈ మధ్య కాలంలో చాలా మంది ఎదుర్కొంటున్న అతిపెద్ద సమస్యల్లో అదొకటని అంటారు. ఈ సమయంలో ఒత్తిడిని తగ్గించుకునేందుకు ఇష్టమైన వ్యాపకాలపై దృష్టిపెడుతుంటారు. వాటిని స్ట్రెస్ బస్టర్స్ గా ఉపయోగించుకుంటారు.
ఫలితంగా చాలామేరకు ఒత్తిడిని తగ్గించుకుని రిలాక్స్ అవుతుంటారని అంటారు. అలాకానిపక్షంలో ఆఫీసులో పని ఒత్తిడి ఇంట్లోనూ, ఇంట్లో ఎదురైన ఒత్తిడిని ఆఫీసులోనూ చూపించే ప్రమాదం పుష్కలంగా ఉందని చెబుతుంటారు. ఆ సంగతి అలా ఉంటే... తాజాగా జపాన్ లో ఓ వ్యక్తి మాత్రం ఇళ్లల్లో దూరడాన్ని స్ట్రెస్ బస్టర్ గా ఎంచుకున్నాడు!
అవును... జపాన్ కు చెందిన ఓ వ్యక్తి స్ట్రెస్ బస్టర్ విషయంలో రొటీన్ కి భిన్నంగా ఆలోచించాడట. ఇందులో భాగంగా... రహస్యంగా ఇళ్లల్లో దూరడం ద్వారా తనకున్న స్ట్రెస్ నుంచి రిలీఫ్ పొందుతున్నాడట. తాజాగా పోలీసులకు దొరికిన ఈ వ్యక్తి చెప్పిన విషయాలకు పోలీసులు షాకయ్యారని అంటున్నారు.
వివరాళ్లోకి వెళ్తే... దక్షిణ జపాన్ లోని దజైపు ప్రాంతంలో ఓ వ్యక్తి (37) ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అతడు ఓ ఇంట్లోకి దూరాడనే స్థానికుల సమాచరంతో రంగంలోకి దిగిన పోలీసులు.. అక్కడకు చేరి, అతడిని అదుపులోకి తీసుకున్నారు. ఈ సమయంలో విచారణ చేయగా.. అతడు చెప్పిన సమాధానానికి పోలీసులు షాకయ్యారని అంటున్నారు.
ఇందులో భాగంగా.. ఒత్తిడి నుంచి ఉపశమనం పొందటం కోసం ఇళ్లల్లో దూరడం అలవాటు చేసుకున్నట్లు తెలిపాడంట. ఇది తన హాబీగా మారిపోయిందని వెల్లడించాడంట. ఇలా ఇతరుల ఇళ్లల్లోకి వెళ్లిన సమయంలో.. తనను ఎవరైనా గుర్తిస్తారేమో అనే ఆలోచనతో తన అరచేతులు చెమటలు పట్టేంత ఆందోళనకు గురవుతానని.. అప్పుడు తనలోని ఒత్తిడి తగ్గుతుందని వివరించాడట.
ఈ క్రమంలోనే ఇప్పటి వరకూ సుమారు 1000 ఇళ్లల్లో దూరినట్లు చెప్పడంతో పోలీసులు షాకింగ్ ఎక్స్ ప్రెషన్ పెట్టినట్లు చెబుతున్నారు. ఈ విషయాన్ని జపాన్ డైలీ వార్తాపత్రిక వెల్లడించగా.. ఇప్పుడు నెట్టింట ఈ విషయం హల్ చల్ చేస్తోంది.