ప్రపంచ వ్యాప్తంగా పలుదేశాల్లో ఇదే ట్రండ్... టెన్షన్ పీక్స్ కి చేరుతోందా?
ఇది చినికి చినికి గాలివానగా మారుతుండగా.. ప్రధానంగా జపాన్ లో మాత్రం పీక్స్ కి చేరుతోందని అంటున్నారు.
By: Tupaki Desk | 27 Feb 2025 10:30 PM GMTప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా పలు దేశాల్లో ఓ సరికొత్త సమస్య తెరపైకి వచ్చింది. ఇది చినికి చినికి గాలివానగా మారుతుండగా.. ప్రధానంగా జపాన్ లో మాత్రం పీక్స్ కి చేరుతోందని అంటున్నారు. అదే... పెరుగుతున్న వృద్ధుల సంఖ్య.. తగ్గుతున్న జననాల రేటు. ప్రస్తుతం ఈ సమస్య జపాన్ లో విపరీతంగా ఉండటంతో.. దేశ ఆర్థిక వ్యవస్థపై పెను ప్రభావం చూపుతోందని అంటున్నారు.
అవును... జపాన్ లో నానాటికీ జనాభా సంఖ్య పడిపోయి సంక్షోభం దిశగా వెళ్తోంది. ఈ నేపథ్యంలో 2024 జననాల రేటు అంతకు ముందు ఏడాదితో పోలిస్తే మరొ 5 శాతం పతనమై 7,20,988 నమోదైంది. దీంతో.. ఈ విషయం ఆ దేశాన్ని టెన్షన్ పెడుతోంది. కారణం.. 1899 తర్వాత ఇంత తక్కువగా జననాలు నమోదుకావడం ఇదే తొలిసారని చెబుతున్నారు.
ఇలా జననాల రేటు ఓ పక్క విపరీతంగా తగ్గిపోతుండగా.. మరోవైపు వృద్ధుల సంఖ్య పెరిగిపోతుందని అంటున్నారు. దీంతో రెండు రకాల సమస్యలు పెరుగుతున్నాయని అంటున్నారు. ఇందులో భాగంగా.. దేశంలో పనిచేసే వారి సంఖ్య గణనీయంగా తగ్గిపోతుండగా.. దీనివల్ల ప్రభుత్వానికి వచ్చే ఆదాయం పడిపోతోదని చెబుతున్నారు.
దీంతో.. జననాల రేటు పెంచేందుకు ప్రభుత్వం రకరకాల ప్రయత్నాలు చేస్తోందని అంటున్నారు. అయినప్పటికీ ప్రజలు పిల్లలను కనేందుకు అంత ఆసక్తి చూపించడం లేదని చెబుతున్నారు. ఈ సమయంలో.. చిల్డ్రన్ కేర్ పాలసీ కోసం ఆ దేశ ప్రధాని ఏకంగా 3.6 ట్రిలియన్ యెన్ లను కేటాయించారు. అయినప్పటికీ ప్రయోజనం కనిపించడం లేదంట.
వాస్తవానికి ఈ 3.6 ట్రిలియన్ యెన్ లను.. పిల్లల్ని కనేందుకు ఆసక్తిగా ఉన్న పెద్దవారికి.. చిల్డ్రన్ కేర్ వర్కర్స్ పని వాతావరణం మెరుగుపరిచేందుకు వినియోగిస్తున్నారు. అయితే... ప్రధానంగా జపాన్ లో యువత వివాహం, పిల్లల్ని కనడం వంటి వాటిపై సుముఖంగా లేరని.. కొంతమంది వివాహం అయినా పిల్లల్ని కనడానికి మాత్రం ఆసక్తి చూపించడం లేదని తెలిస్తోంది.
ఈ నేపథ్యంలో.. ఇప్పుడున్నట్లుగానే యువత ఆలోచించి, ఇదే ట్రెండ్ కొనసాగితే 2060 నాటికి జపాన్ లో జనాభా సంఖ్య సుమారు 8.67 కోట్లకు పడిపోతుందని అంచనా వేస్తున్నారు. ఈ మేరకు ఆందోళన వ్యక్తం చేస్తూ ఆ దేశ ఆరోగ్యశాఖ ఓ ప్రకటన విడుదల చేసింది.
వాస్తవానికి జపాన్ లో 1995లో అత్యధికంగా పనిచేసే ప్రజలు ఉన్నారు. అయితే.. ప్రస్తుతం నిరుద్యోగ రేటు 2.4 శాతంగా ఉందని.. 2040 నాటికి 3 శాతంగా కొనసాగుతుందని అంచనాలున్నాయని అంటున్నారు. ఈ నేపథ్యంలోనే కార్మికుల కొరత కారణంగా 2024లో జపాన్ లో 342 కంపెనీలు దివాలా తీశాయని చెబుతున్నారు.
అయితే.. ఈ సమస్య ఒక్క జపాన్ కు మాత్రమే పరిమితం కాలేదని అంటున్నారు. ఫ్రాన్స్ లో 2023 నుంచి జననాల రేటు గణనీయంగా పడిపోవడం మొదలైందని.. గత 50 ఏళ్లలో ఏనాడూ ఈ స్థాయిలో తగ్గుదల లేదని.. ఇక చైనాలోనూ వరుసగా మూడేళ్లుగా జననాల రేటులో తగ్గుదల నమోదైంది.