Begin typing your search above and press return to search.

జపాన్ సీఈవో మనసును దోచిన భారత్

తాజాగా సోషల్ నెట్ వర్కింగ్ లింక్డిన్ గా తన అనుభవాల్ని సుదీర్ఘ పోస్టులో వెల్లడించారు. ఈ పోస్టుకు పెద్ద ఎత్తున వైరల్ గా మారింది.

By:  Tupaki Desk   |   12 May 2024 4:30 PM GMT
జపాన్ సీఈవో మనసును దోచిన భారత్
X

భారతీయుల్లో అత్యధికులు నిద్ర లేచింది మొదలు పడుకునే వరకు జపాన్ అన్నా.. జపనీస్ ఉత్పత్తులకు ఇచ్చే ప్రాధాన్యత అంతా ఇంతా కాదు. ఇప్పుడు కాస్త తగ్గింది కానీ నలభై ఏళ్ల క్రితం ఏదైనా ఎలక్ట్రికల్ వస్తువు కొనాలంటే జపాన్ ఉత్పత్తి అయితే.. మరో ఆలోచన లేకుండా కొనేసే పరిస్థితి. జపాన్ మీద.. జపనీస్ ఉత్పత్తుల మీద ఉన్న మమకారం.. నమ్మకం ఎంతో. జపనీస్ కంపెనీల మీద ఉన్న అవగాహన.. జపనీయుల మీద భారతీయులకు పెద్దగా లేదనే చెప్పాలి. ఆ మాటకు వస్తే.. ఆ దేశంతో అంత గొప్ప సంబంధాలు ఉండని పరిస్థితి.

వాస్తవ కోణంలో చూస్తే.. గడిచిన రెండు దశాబ్దాలుగా జపనీయులు భారతదేశాన్ని కాస్తంత గుర్తిస్తున్నారు. అంతకు ముందు అయితే భారత దేశం మీద వారికి ఎలాంటి సానుకూలత ఉండేది కాదు. ఇప్పుడిప్పుడే భారతదేశ గొప్పతనాన్ని.. ఇక్కడి విలక్షణతను గుర్తిస్తున్నారు. తాజాగా జపాన్ కు చెందిన ''టెక్ జపాన్'' వ్యవస్థాపకుడు.. సీఈవో నౌటకా నిషియామా భారతదేశానికి వచ్చారు.

ఈ దేశంలో కొంతకాలం ఉండాలని ఆయన భావించారు. భారతదేశం గురించి పలు అంశాల్ని నేర్చుకోవాలని భావించారు. ఇక్కడి కల్చర్ గురించి అవగాహన కోసం ఆయన బెంగళూరులో ఉండిపోయారు. దాదాపు నెల రోజులుగా అక్కడ ఉన్న అతను.. బెంగళూరులోని వివిధ ప్రాంతాలను పర్యటించటం.. అక్కడి ప్రజలతో మాట్లాడటం లాంటి పనులు చేశారు. తాజాగా సోషల్ నెట్ వర్కింగ్ లింక్డిన్ గా తన అనుభవాల్ని సుదీర్ఘ పోస్టులో వెల్లడించారు. ఈ పోస్టుకు పెద్ద ఎత్తున వైరల్ గా మారింది.

దీనికి కారణం.. భారత్ మీద సదరు సీఈవో ప్రశంసల వర్షం కురిపించటమే. ప్రపంచానికి భారతీయ నాయకత్వం అవసరమన్న ఆయన.. భారతీయ వైవిధ్యం.. విలువల్ని చూసి తాను ఆశ్చర్యపోయినట్లుగా పేర్కొన్నారు. నెల క్రితం తాను భారత్ కు వచ్చానని.. వివిధ మతాలు.. జాతులు ఉన్నప్పటికి భారత్ ఒకే దేశంగా ఉండటం నిజంగా అద్భుతమన్న ఆయన.. ప్రస్తుత ఎన్నికల మీదా స్పందించారు.

నాయకత్వం గురించి ఆలోచించటానికి ఇదే సరైన అవకాశంగా పేర్కొన్న నౌటకా నిషియామా.. టెక్ ప్రపంచంలో రెండు దిగ్గజ సంస్థలకు సీఈవోలుగా భారతీయులు ఉండటాన్ని ప్రస్తావించారు. మైక్రోసాఫ్ట్ సీఈవో సత్య నాదెళ్ల.. గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్ లను ప్రస్తావిస్తూ.. ప్రపంచ అగ్రగామి సంస్థల్లో నాయకత్వం వహించే సామర్థ్యం భారతీయులకు ఉందన్న ఆయన.. ''ఈ ఇద్దరు టెక్ దిగ్గజాలు భారత్ లోనే పుట్టారు. ఇక్కడే చదువుకున్నారు. ఉన్నత విద్య కోసం అమెరికాకు వెళ్లారు'' అని చెప్పుకొచ్చారు. భారత్ లో తాను నేర్చుకున్న పలు అంశాల్ని తన కంపెనీ నిర్వహణలో అమలు చేస్తానని చెప్పుకొచ్చారు. భారత్ గురించి అతి తక్కువ పదాల్లో అత్యంత ప్రభావవంతంగా చేసిన పోస్టు ఇప్పుడు వైరల్ గా మారి.. సదరు సీఈవో మీద ప్రశంసల వర్షం కురుస్తోంది.