నో ప్రేమ.. నో సెక్స్.. ఓన్లీ భార్యభర్తలు.. జపాన్ లో కొత్త ట్రెండ్!
వినేందుకు విచిత్రంగా ఉండటమే కాదు.. ఒక పట్టాన అర్థం కానట్లుగా ఉన్న సరికొత్త రిలేషన్ ట్రెండ్ ఇప్పుడు జపాన్ లో నడుస్తోంది
By: Tupaki Desk | 11 May 2024 4:33 AM GMTవినేందుకు విచిత్రంగా ఉండటమే కాదు.. ఒక పట్టాన అర్థం కానట్లుగా ఉన్న సరికొత్త రిలేషన్ ట్రెండ్ ఇప్పుడు జపాన్ లో నడుస్తోంది. పెళ్లి.. భార్యభర్తలు అన్నంతనే ఉండేవేమీ ఈ రిలేషన్ లో ఉండవు. కానీ.. వీరు భార్యభర్తలుగా ఉండటమే కాదు.. పిల్లలు కూడా ఉంటారు. ఓవైపు పెళ్లి అంటారా? మరోవైపు లవ్ ఉండదంటారు. ఇంకోవైపు సెక్స్ లేదంటారు. కానీ పిల్లలని చెబుతూ.. భార్యభర్తలంటారు? ఏమిటీ కన్ఫ్యూజన్? అసలేం రిలేషన్ ఇది? అంటూ సందేహాల మీద సందేహాలు కలగటం ఖాయం.
ఇంతకీ ఈ కొత్త ట్రెండ్ పేరేంటి? అంటారా? ‘‘ఫ్రెండ్ షిప్ మ్యారేజ్’’. ఈ రిలేషన్ విన్నంతనే అర్థమైనట్లుగా అనిపిస్తుంది. కానీ.. అంతలోనే అర్థం కాలేదన్న భావన కలుగుతుంది. సింఫుల్ గా చెప్పాలంటే.. పెళ్లి అనే ముచ్చట తీర్చుకోవటం మాత్రమే ఈ రిలేషన్ ఉంటుంది. పెళ్లానికి మొగుడు ఉంటాడు. మొగుడికి పెళ్లాం ఉంటుంది. అంతే.. అంతకు మించి ఇంకేం ఉండదు. ఎవరి గొడవ వారిది. ఎవరి ఇష్టాలు వారివి. ఎవరేం చేసినా.. ఎదుటోళ్లు ప్రశ్నించకుండా ఉండటం.. వారి స్వేచ్ఛను గౌరవించటం ఉంటుంది.
అన్ని బాగుండి.. ఈ దాంపత్య జీవితంలో తమకంటూ పిల్లలు ఉండాలని కోరుకుంటే.. క్రత్రిమ పద్దతుల్లో పిల్లల్ని కంటారే తప్పించి.. శారీరకంగా దగ్గర కావటం ఉండదు. మొత్తంగా చెప్పాలంటే మన ఇంట్లో టీవీ.. ఫ్రిజ్.. ఏసీ.. కారు లాంటివి ఉంటాయి. వాటితో మనకు భావోద్వేగ అనుబంధం ఉంటుంది. వాటికి మన మీద ఎలాంటి బంధం ఉండదు. దాదాపుగా అలాంటిదే ఈ రిలేషన్ కూడా.
ప్రేమ.. సెక్సువల్ రిలేషన్ కు తావు లేకుండా ఒకేలాంటి మైండ్ సెట్ ఉన్న ఇద్దరు స్నేహంగా జీవించటమే ఈ విధానం. చట్టపరంగా వీరిద్దరు దంపతులే అయినప్పటికీ.. వ్యక్తిగతంగా వీరిద్దరు తమ మధ్య ఉండే బంధం గురించి ఓపెన్ గా మాట్లాడుకొని.. పరస్పర అంగీకారంతో పెళ్లి చేసుకుంటారు. ఈ విధానంలో కొందరు కలిసి ఉంటే.. మరికొందరు వేర్వేరుగా ఉంటారు. ఇద్దరి మధ్య టర్మ్స్ బాగా ఉన్నంతవరకు కలిసే ఉంటారు. కాస్త తేడా వచ్చినా విడాకులే.
సంప్రదాయ పెళ్లిళ్ల మీద.. వివాహ బంధం మీదా ఆసక్తి లేని వారు ఈ తరహా కొత్త రిలేషన్ కు ప్రాధాన్యత ఇస్తున్నట్లు చెబుతున్నారు. ఈ కొత్త ట్రెండ్ గురించి జపాన్ కు చెందిన కొలొరస్ అనే సంస్థ వెల్లడించింది. దీని అంచనా ప్రకారం తమ వద్దే 500 మంది ఇలాంటి పెళ్లిళ్లు చేసుకున్నట్లు వెల్లడించింది. జపాన్ మొత్తం జనాభా 12 కోట్లు కాగా.. అందులో దాదాపు ఒక శాతం అంటే 12 లక్షల మంది ఈ తరహా రిలేషన్ తో బతుకుతున్నట్లుగా చెప్పింది. ఈ తరం యూత్ ఫ్రెండ్ షిప్ మ్యారేజ్ ట్రెండ్ వైపు అడుగులు వేస్తున్నట్లు చెబుతున్నారు. జపాన్ వారి సంగతేమో కానీ.. మన వరకు మనకు మాత్రం ఈ తరహా రిలేషన్ ను అర్థం చేసుకోవటం మాత్రం చాలా కష్టమని చెప్పక తప్పదు.