కొత్త సంవత్సరం రోజు విషాదం.. ఆ దేశంలో సునామీ!
జపాన్ స్థానిక కాలమానం ప్రకారం సోమవారం సాయంత్రం 4 గంటల సమయంలో రిక్టర్ స్కేల్ పై 4.0 తీవ్రత కంటే అధికంగా భూకంప తీవ్రత నమోదైంది.
By: Tupaki Desk | 1 Jan 2024 12:33 PM GMTఅగ్ని పర్వతాలతో నిండిన ద్వీప దేశం.. జపాన్ కొత్త సంవత్సరం రోజు చిగురుటాకులా వణికిపోయింది. వరుసగా 21 భూకంపాలు సంభవించడంతో ప్రజలు బెంబేలెత్తిపోయారు. అదే సమయంలో సునామీ అలలు కూడా రావచ్చని అధికారులు హెచ్చరికలు జారీ చేయడంతో గతంలో సంభవించిన రాకాసి సునామీని తలుచుకుని వణికిపోయారు.
జపాన్ స్థానిక కాలమానం ప్రకారం సోమవారం సాయంత్రం 4 గంటల సమయంలో రిక్టర్ స్కేల్ పై 4.0 తీవ్రత కంటే అధికంగా భూకంప తీవ్రత నమోదైంది. 21 భూకంపాలు నమోదయ్యాయి. జపాన్ లోని ఇషికావా ద్వీపకల్పంలో ఉన్న వాజిమా పోర్టులో దాదాపు 1.2 మీటర్ల ఎత్తులో సునామీ అలలు చెలరేగాయి. భూకంపంతో వాజిమాలో చాలాచోట్ల వీధులు, భవనాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. కొన్నిచోట్ల రహదారులపై భారీగా పగుళ్లు సంభవించాయి. మరికొన్ని చోట్ల సునామీ అలలు అత్యధికంగా ఐదు మీటర్ల ఎత్తు వరకు రావచ్చని అధికారులు హెచ్చరికలు జారీ చేయడంతో ప్రజలు తీవ్ర ఆందోళన చెందారు. భూకంపంతో వేలాది ఇళ్లకు విద్యుత్ సరఫరా నిలిచిపోయింది.
వరుస భూకంపాలతో హోక్కాయిడో నుంచి నాగసాకి వరకు సునామీ ముప్పు ఉందని అధికారులు వివరించారు. దీంతో భూకంప కేంద్రానికి సమీపంలోని ప్రధాన జాతీయ రహదారులను మూసివేస్తున్నట్టు తెలిపారు. మరోవైపు భూకంప కేంద్రంగా ఉన్న ఇషికావాలో అణు విద్యుత్ కేంద్రం ఉండటం అందరిలో ఆందోళన పెంచింది. అయితే ఇది సురక్షితంగా ఉందని అధికారులు ప్రకటించారు.
కాగా గతేడాది మే నెలలో జపాన్ లో రిక్టర్ స్కేల్‌పై 6.5 తీవ్రతతో భూకంపం సంభవించిన సంగతి తెలిసిందే. దీనివల్ల నాడు 13 మంది గాయపడగా.. ఒకరు మరణించారు. అప్పుడు కూడా భూకంప కేంద్రం ఇషికావా ప్రాంతంలోనే ఉండటం గమనార్హం.
కాగా తాజాగా జపాన్ లో సంభవించిన భూకంపం 1983లో వచ్చిన సీ ఆఫ్ జపాన్ భూకంపంతో పోలిఉందని శాస్త్రవేత్తలు అంటున్నారు. అప్పట్లో ఈ భూకంపంలో 104 మంది మృత్యువాత పడగా 324 మంది తీవ్రంగా గాయపడ్డారు.
కాగా జపాన్ అగ్ని పర్వతాలకు ఆలవాలం. ఇక్కడ 450 అగ్నిపర్వతాలు ఉన్నాయి. అవి నిరంతరం క్రియాశీలకంగా ఉంటాయని చెబుతున్నారు. జపాన్ లో ఏటా సగటున 5 వేల వరకు భూకంపాలు వస్తుంటాయి. వీటిలో కొన్ని చిన్నవి కాగా మరికొన్ని పెద్దవి.
జపాన్ లో భూకంప తీవ్రత కారణంగా సునామీ హెచ్చరికలు జారీ చేయడంతో ఆ దేశ రాజధాని టోక్యోలోని భారత రాయబార కార్యాలయం అప్రమత్తమైంది. ఎమర్జెన్సీ కాంటాక్ట్ రూమ్ ను ఏర్పాటు చేసింది. అక్కడ ఉన్న భారతీయుల కోసం భారత రాయబార కార్యాలయ సిబ్బంది ఫోన్ నంబర్లు, మెయిల్ ఐడీలతో ఒక జాబితాను విడుదల చేసింది. ఎవరైనా సంప్రదించవచ్చని సూచించింది.