Begin typing your search above and press return to search.

జార్ఖండ్ సీఎం రాజీనామా...కొత్త సీఎం చంపై సోరెన్...!

జార్ఖండ్‌ సీఎం హేమంత్‌ సోరెన్‌ రాజీనామాతో ఏర్పడిన రాజకీయ సంక్షోభాన్ని జార్ఖండ్ ముక్తీ మోర్చా అధిగమించేందుకు కొత్త సీఎంగా చంపై సోరెన్‌ను జేఎంఎం ఎమ్మెల్యేలు ఎన్నుకున్నారు.

By:  Tupaki Desk   |   31 Jan 2024 6:28 PM GMT
జార్ఖండ్ సీఎం రాజీనామా...కొత్త సీఎం చంపై సోరెన్...!
X

జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్ ఉన్నట్లుండి మాజీ అయ్యారు. ఆయనంతట ఆయన తన పదవికి రాజీనామా చేశారు. దీంతో గత రెండు రోజులుగా సాగుతున్న జార్ఖండ్ రాజకీయ పరిణామాలు నాటకీయంగా మరో కొత్త మలుపు తీసుకున్నాయి. రెండు రోజుల క్రితం జార్ఖండ్ సీఎం కనిపించడంలేదు అన్న వార్తలు వైరల్ అయ్యాయి. ఆ తరువాత ఆయన అరెస్ట్ అంటూ మరిన్ని వార్తలు వచ్చాయి.

ఇదంతా తన ప్రభుత్వాన్ని తన రాజకీయాన్ని అస్థిర పరచడానికే అని హేమంత్ సోరెన్ విమర్శించారు. ఇదే రకమైన రాజకీయాలు దేశంలో సాగుతున్నాయని ఆవేదన వెళ్ళగక్కారు. అసెంబ్లీకి బడ్జెట్ సమర్పించడంతో పాటు కీలక సమావేశాలు జరుగుతున్న వేళ తనను అరెస్ట్ చేయాలని చూడడం ఏంటి అని ఆయన గళమెత్తారు.

అయితే అనూహ్యంగా ఆయన ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయడం విశేషం. సోరెన్ మనీ ల్యాండరింగ్ కేసులలో అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఇక ఆయన్ని బుధవారం రోజంతా ఈడీ అదుపులోకి తీసుకుని విచారిస్తోంది. ఏ క్షణమైనా ఆయన అరెస్ట్ తధ్యమని అంటున్నారు.

ఇదిలా ఉంటే హేమంత్ ప్లేస్ లోకి కొత్తగా మరో నేతను సీఎం గా ఎంపిక చేశారు. ఆయన పేరు చంపై సోరెన్‌. జార్ఖండ్‌ సీఎం హేమంత్‌ సోరెన్‌ రాజీనామాతో ఏర్పడిన రాజకీయ సంక్షోభాన్ని జార్ఖండ్ ముక్తీ మోర్చా అధిగమించేందుకు కొత్త సీఎంగా చంపై సోరెన్‌ను జేఎంఎం ఎమ్మెల్యేలు ఎన్నుకున్నారు. అనంతరం చంపై సోరెన్‌ నేతృత్వంలో గవర్నర్‌ను కలిసిన జేఎంఎం ఎమ్మెల్యేలు కొత్త ప్రభుత్వ ఏర్పాటుకు అవకాశం కోరరు.

ఇంతకీ ఈ చంపై సోరెన్ ఎవరు అన్నది కూడా ఆసక్తికరంగా ఉంది. ఆయన సీనియర్ శాసన సభ్యుడు. అంతే కాదు హేమంత్ సోరెన్ కి నమ్మకమైన వారు. ఇదిలా ఉంటే తన అరెస్ట్ తరువాత తన సతీమణి కల్పనా సోరెన్‌ను సీఎం చేయాలని హేమంత్ సోరెన్ భావించారు. అయితే ఆమె ఎమ్మెల్యే కూడా కాదు, అంతకంటే ఆమెకు రాజకీయ అనుభవం కూడా ఏమీ లేదు. దాంతో ఆ చాన్స్ చంపై సోరెన్ కి దక్కింది. ఆ విధంగా ఆయన సీఎం అవుతున్నారు.