Begin typing your search above and press return to search.

విప‌క్షాల‌కు షాక్.. 'పింఛ‌న్ ఇంటింటీకీ' కాదు!

ఏపీలో గ‌త రెండు రోజులుగా తీవ్ర రాజ‌కీయ అంశంగా మారిపోయిన సామాజిక ఫించ‌న్ల వ్య‌వ‌హారంపై తాజాగా ప్ర‌భుత్వ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి జ‌వ‌హ‌ర్‌రెడ్డి సంచ‌ల‌న ఆదేశాలు జారీ చేశారు.

By:  Tupaki Desk   |   2 April 2024 10:11 AM GMT
విప‌క్షాల‌కు షాక్.. పింఛ‌న్ ఇంటింటీకీ కాదు!
X

ఏపీలో గ‌త రెండు రోజులుగా తీవ్ర రాజ‌కీయ అంశంగా మారిపోయిన సామాజిక ఫించ‌న్ల వ్య‌వ‌హారంపై తాజాగా ప్ర‌భుత్వ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి జ‌వ‌హ‌ర్‌రెడ్డి సంచ‌ల‌న ఆదేశాలు జారీ చేశారు. `ఇంటింటికీ పింఛ‌న్ పంపిణీ చేయ‌లేం. గ్రామ‌, వార్డు స‌చివాల‌యాల్లో మాత్రమే పింఛ‌న్ల‌ను పంపిణీ చేస్తాం. ఈ మేర‌కు ఏర్పాటు చేయండి `` అని జిల్లాల క‌లెక్ట‌ర్ల‌ను ఆయ‌న ఆదేశించారు. దీంతో గ‌త 56 నెల‌లుగా ఇంటింటికీ అందుతున్న పింఛ‌న్ కు బ్రేక్ ప‌డిన‌ట్ట‌యింది. అయితే.. ఇది రాజ‌కీయంగా విప‌క్షాల‌పై ప్ర‌భావం ప‌డే అవ‌కాశం ఉంద‌ని అంటు న్నారు.

ఏం జ‌రిగింది?

వైసీపీ అధినేత జ‌గ‌న్ అధికారంలోకి వ‌చ్చాక‌.. సామాజిక పింఛ‌ను అందుకునే ల‌బ్ధి దారుల‌కు ఇంటి గ‌డ‌ప లోకే ఆయా పింఛ‌న్ల మొత్తాన్ని అందించారు. దీనికిగాను దేశంలో ఎక్క‌డాలేని విధంగా వ‌లంటీర్ల వ్య‌వ‌స్థ‌ను తీసుకువ‌చ్చారు. దీంతో కొండ‌లు, గుట్ట‌లు, తండాలు స‌హా సుదూర ప్రాంతాల్లో ఉన్న ల‌క్ష‌లాది మందికి మేలు జ‌రిగింది. పైగా వృద్ధులు, విక‌లాంగుల‌కు అయితే.. మ‌రింత మేలు జ‌రిగిన మాట వాస్త‌వం. దీనిని విప‌క్షాలు సైతం ఒప్పుకొంటున్నాయి. అయితే. వ‌లంటీర్లు హ‌ద్దులు మీరుతున్నార‌ని.. వైసీపీకి ప్ర‌చారం చేస్తున్నార‌ని భావించిన స్వ‌చ్ఛంద సంస్థ‌లు కేంద్ర ఎన్నిక‌ల సంఘానికి ఫిర్యాదు చేశాయి.

దీంతో వ‌లంటీర్ల‌ను ఎన్నిక‌లు ముగిసే వ‌ర‌కు దూరం పెట్టాల‌ని ఎన్నిక‌ల సంఘం ఆదేశించింది. అంతేకా దు.. త‌క్ష‌ణ‌మే ఈ ఆదేశాలు అమ‌లు చేసింది. దీంతో వ‌లంటీర్లు త‌మ సేవ‌ల‌కు దూర‌మ‌య్యారు. పెన్షన్ పంపిణీ నుంచి వలంటీర్లను తప్పించాలంటూ ఎన్నికల కమిషన్ ఆదేశించడంతో ఏపీలో పెన్షన్ పంపిణీ ఆలస్యం అవుతోందని ప్రభుత్వం తెలిపింది. ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషిస్తున్నట్లు పేర్కొంది.

మ‌రోవైపు, టీడీపీ, జనసేన, బీజేపీ నేతల వల్లే సకాలంలో పెన్షన్లు అందించలేకపోయామని వైసీపీ ఆరోపించింది. తాజాగా పెన్షన్ల పంపిణీకి మార్గదర్శకాలు సిద్ధం చేసినట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. ఈ విషయంపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్ రెడ్డి తాజాగా జిల్లాల కలెక్టర్లతో సమావేశం అయ్యారు. పెన్షన్ పంపిణీకి అనుసరించాల్సిన విధానాలపై వారితో చర్చించారు.

ఇంటింటికీ పింఛ‌న్లు పంపిణీ చేయ‌లేమ‌ని, గ్రామ, వార్డు సచివాలయాల్లో పెన్షన్ పంపిణీ చేపట్టాలని ఆయ‌న తెలిపారు. అయితే, ఎండల తీవ్రత నేపథ్యంలో అక్కడ టెంట్లు, తాగునీరు సదుపాయాలు కల్పించాలని ఆదేశించారు. దీంతో ఈ ప్ర‌భావం వృద్ధులు, దివ్యాంగులు, మ‌హిళ‌ల‌పై తీవ్రంగా ప‌డ‌నుంది. ఇది అంతిమంగా విప‌క్షాల‌పై వారు ఆగ్ర‌హం వ్య‌క్తం చేసేందుకు కూడా అవ‌కాశం క‌ల్పించిన‌ట్ట‌యింది.