పెన్షన్ల పంపిణీ మీద ప్రభుత్వం కీలక నిర్ణయం
ఏపీలో మే 1వ తేదీ వస్తోంది. సామాజిక పెన్షన్ల పంపిణీకి గడువు దగ్గర పడింది.
By: Tupaki Desk | 28 April 2024 2:37 PM GMTఏపీలో మే 1వ తేదీ వస్తోంది. సామాజిక పెన్షన్ల పంపిణీకి గడువు దగ్గర పడింది. ప్రతీ నెలా ఒకటవ తేదీ నాటికి పెన్షన్లు లబ్దిదారుల ఖాతాలో అందాల్సి ఉంది. అయితే ఏప్రిల్ నెలలో వాలంటీర్లను తప్పించడంతో పెద్ద రచ్చ జరిగింది. దాంతో అందరినీ సచివాలయాలకు రప్పించుకుని పెన్షన్లు పంపిణీ చేశారు. ఇదంతా వారం రోజులకు పైగా ప్రక్రియగా సాగింది.
ఇపుడు చూస్తే మళ్లీ అలాంటి విధానమే అమలు చేస్తే కనుక తీవ్రమైన వడగాలుల దెబ్బలకు చాలా మంది ప్రాణాలు పోగొట్టుకునే అవకాశాలు ఉంటాయి. దాంతో టీడీపీ సహా ఇతర ప్రతిపక్షాలు ఈసీని ఆశ్రయించాయి. ఈసీ కూడా పెన్షన్లకు ఇంటి వద్దకే అందచేసేలా చర్యలు చేపట్టమని ఏపీ ప్రభుత్వానికి సూచించింది.
ఈ విషయంలో ఈసీ పేర్కొన్న మార్గదర్శకాలను అనుసరించాలని కూడా స్పష్టం చేసింది. దీంతో రాష్ట్ర ప్రభుత్వం ఈ విషయంలో కీలక నిర్ణయం తీసుకుంది. సామాజిక పెన్షన్లకు ఇళ్ళ వద్దకే అందచేసే విధంగా చర్యలు చేపడుతోంది. పెన్షన్ లబ్దిదారులకు బ్యాక్ ఖాతాలు ఉంటే నేరుగా వారి ఖాతాలలోనే ఆ మొత్తాలని వేసే విధంగా చర్యలు తీసుకుంటున్నారు.
ఆ విధంగా బ్యాంక్ ఖాతాలు లేని వారిని ఇళ్ళకు వెళ్ళి పెన్షన్లు అందచేసేందుకు నిర్ణయం తీసుకున్నారు. ఈ విధంగా చేయడం వల్ల మే నెల ఎండల బారి నుంచి పెన్షనర్లను తప్పించినట్లు అవుతుంది. ఈసీ కూడా ఈ విధమైన నిర్ణయం తీసుకోవాలనే కోరుతూ వచ్చింది. పైగా మే 1వ తేదీకే పెన్షన్లు అందరి ఖాతాలో పడిపోయేలా ప్రభుత్వం చర్యలు చేపడుతోంది.
ఈ మేరకు కేంద్ర ఎన్నికల కమిషన్ ఆదేశాలతో చీఫ్ సెక్రటరీ జవహర్ రెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు. ఇక చూసుకుంటే ఏపీలో 65 లక్షల 49 వేల 864 మందికి పైగా పింఛన్ దారులు ఉన్నారు. వీరందరికీ కచ్చితంగా ఒకటవ తేదీలోగా పంపిణీ చేయాల్సి ఉంది.
అయితే తాజా ఉత్తర్వుల మరకు ఇందులో 48 లక్షల 92 వేల మందికి బ్యాంకులో జమ చేస్తారు.ఇక మిగిలిన పదిహేను లక్షల మందిని సచివాలయ సిబ్బందితో ఇంటి వద్దనే పెన్షన్లు అందించే ఏర్పాట్లు చేస్తారు. ఈ మేరకు చీఫ్ సెక్రటరీ ఉత్తర్వులు జారీ చేశారు. ఏది ఏమైనా సజావుగా ఈ పెన్షన్ల పంపిణీ ప్రక్రియ సాగాలని అంతా కోరుకుంటున్నారు. రాజకీయాలకు ఆస్కారం లేకుండా రచ్చ సాగకుండా చేస్తేనే ఉపయోగం అన్నది కూడా ఒక మాటగా ఉంది.
ఈ విషయంలో ఎవరికి క్రెడిట్ వచ్చేది లేదు. అలాగే ఎవరికీ నష్టం అన్నది చూసుకోవాల్సింది లేదు. ఎవరు ఎవరికి ఓటు వేయాలో చూసుకుని వేస్తారు. అంతే తప్ప కేవలం ఈ అంశం మీదనే రాజకీయం నడపాలనుకుంటే కనుక ఏపీలో ఎండ దెబ్బకు పండుటాకులు రాలిపోయే ప్రమాదం ఉంది అని అంటున్నారు