మురళీమోహన్ సంస్థకు వ్యతిరేకంగా ఆందోళన.. తెరపైకి 90 సమస్యలు!
అవును... తాడేపల్లి మండలం కుంచనపల్లి దగ్గర మురళీమోహన్ సంస్థ నిర్మించిన జయభేరి ది క్యాపిటల్ వార్తల్లో నిలిచింది.
By: Tupaki Desk | 18 Sep 2024 2:21 PMప్రముఖ నటుడు, నిర్మాత, జయభేరి సంస్థల అధినేత మురళీమోహన్ వ్యాపార సంస్థకు వ్యతిరేకంగా అపార్ట్మెంట్ వాసులు రోడ్డెక్కారు. తమకు ఇచ్చిన హామీలు నెరవేర్చలేదని.. మురళీమోహన్ కు మార్కెట్ లో మంచి పేరు ఉండటంతో నమ్మి ఫ్లాట్స్ కొనుక్కుంటే చాలా సమస్యలు ఫేస్ చేస్తున్నామని అపార్ట్మెంట్ వాసులు ధర్నాకు దిగారు. ఈ సందర్భంగా వారంతా కీలక వ్యాఖ్యలు చేశారు.
అవును... తాడేపల్లి మండలం కుంచనపల్లి దగ్గర మురళీమోహన్ సంస్థ నిర్మించిన జయభేరి ది క్యాపిటల్ వార్తల్లో నిలిచింది. ఈ అపార్ట్మెంట్స్ లోని ఫ్లాట్స్ యజమానులు ధర్నాకు దిగారు. ఇందులో భాగంగా అపార్ట్మెంట్ మూందు ఆందోళనలు చేపట్టారు. ఈ సమయంలో బయటనుంచి ఎవరూ లోపలికి రాకుండా ఎంట్రన్స్ దగ్గర కార్లు పార్క్ చేసి ఉంచారు. ఎంతో కాలంగా తమ సమస్యలపై ఫిర్యాదులు చేస్తున్నా పట్టించుకొవడం లేదని ఆరోపిస్తున్నారు.
జయభేరి ది క్యాపిటల్ ఉన్న ఫ్లాట్స్ మురళీమోహన్ కి చెందినవి కావడంతో ఆయనపై నమ్మకంతోనే తాము కొనుగోలు చేశామని.. అయితే ఫ్లాట్స్ కొనుగోలు సమయంలో చేసుకున్న అగ్రిమెంట్ లో పేర్కొన్న వసతులు కల్పించడం లేదని ఆరోపిస్తున్నారు. ఈ సందర్హంగా ఫ్లాట్ యజమానులు సుమారు 90 మేర సమస్యలు ఫిర్యాదుల్లో పేర్కొన్నట్లు తెలిపారు. వాటిలో ప్రధానంగా సీసీ కెమెరాలు ఫిక్స్ చేయకపోవడాన్ని ఎత్తి చూపించారు.
ఇదే సమయంలో కార్ పార్కింగ్ దగ్గర లైట్లు లేవని, సోలార్ ఫెన్సింగ్ ఏర్పాటు చేస్తామని చెప్పి మద్యలోనే ఆపేశారని, ఫైర్ సేఫ్టీ లేదని, చుట్టు పక్కల నుంచి పాములు వంటివి రాకుండా జాగ్రత్తలు తీసుకుంటామని చెప్పినా అవి లేవని.. ప్రతీ లాబీల్లో ఒక రిసెప్షనిస్టును ఏర్పాటు చేస్తామని అన్నారని.. ఆ హామీని పక్కన పెట్టేశారని.. ఏదైనా అగ్నిప్రమాదం జరిగితే ప్రాణాలతో బయటపడతామనే నమ్మకం తమకు లేదని యజమానులు చెబుతున్నారు.
ఇక.. కొనుగోలు చేసినవారికి ఫ్లాట్స్ హ్యాండోవర్ చేయడానికి 15 రోజుల నుంచి నెల రోజుల సమయం తీసుకున్నారని.. ఎమినిటీస్, కార్పస్ ఫండ్ తో పాటు అగ్రిమెంట్ లో పేర్కొన్న ప్రతీ ఒక్కదానికీ మొత్తం డబ్బులు చెల్లించిన తర్వాత కూడా రిజిస్ట్రేషన్ కు ఎందుకు సమయం తీసుకుంటున్నారో అర్ధం కావడం లేదని వాపోతున్నారు. రెండు లక్షలు ఖర్చు చేసి కార్ పార్కింగ్ ని కొనుగోలు చేసినప్పటికీ... కార్లకు రక్షణ లేకుండా పోతోందని చెబుతున్నారు.
మరి ఈ వ్యవహారంపై జయభేరి సంస్థ యాజమాన్యం ఎలా స్పందిస్తుందనేది వేచి చూడాలి! కాగా.. గతంలో కూడా ల్యాండ్ కన్వర్షన్ కాకుండానే అగ్రికల్చర్ ల్యాండ్ లో కనస్ట్రక్షన్ మొదలుపెట్టారంటూ ఆరోపణలు రావడం.. దానికి ఈ సంస్థ ఫైన్ కట్టినట్లు చెప్పడం తెలిసిందే