Begin typing your search above and press return to search.

ఆ పని చేశాడని.. తమ ఎంపీకి బీజేపీ షాక్‌!

లోక్‌ సభకు ప్రస్తుతం ఎన్నికలు జరుగుతున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఐదు దశల పోలింగ్‌ పూర్తయింది. మరో రెండు దశల పోలింగ్‌ మిగిలి ఉంది

By:  Tupaki Desk   |   21 May 2024 11:30 AM GMT
ఆ పని చేశాడని.. తమ ఎంపీకి బీజేపీ షాక్‌!
X

లోక్‌ సభకు ప్రస్తుతం ఎన్నికలు జరుగుతున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఐదు దశల పోలింగ్‌ పూర్తయింది. మరో రెండు దశల పోలింగ్‌ మిగిలి ఉంది. జూన్‌ 1తో మొత్తం ఏడు దశల పోలింగ్‌ పూర్తవుతుంది.

కాగా ఈసారి 400 ఎంపీ స్థానాలు సాధించాలని లక్ష్యంగా పెట్టుకున్న బీజేపీ పలువురు సిట్టింగ్‌ ఎంపీలకు సీటు నిరాకరించింది. వీరిలో వరుసగా పలు పర్యాయాలు ఎంపీలుగా గెలిచినవారు కూడా ఉండటం గమనార్హం. ఈ కోవలో కేంద్ర మాజీ మంత్రి యశ్వంత్‌ సిన్హా కుమారుడు జయంత్‌ సిన్హా కూడా ఉన్నారు.

జార్ఖండ్‌ లోని హజారీబాగ్‌ ఎంపీగా జయంత్‌ సిన్హా ఉన్నారు. 2014, 2019 ఎన్నికల్లో ఆయన ఇక్కడ బీజేపీ తరఫున విజయం సాధించారు. ఈసారి బీజేపీ ఆయనకు సీటు ఇవ్వలేదు. జయంత్‌ సిన్హా తండ్రి యశ్వంత్‌ సిన్హా గతంలో దేశ రాజకీయాల్లో కీలక పాత్ర పోషించారు. అటల్‌ బిహారి వాజపేయి ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు యశ్వంత్‌ సిన్హా కీలకమైన ఆర్థిక శాఖ మంత్రిగా వ్యవహరించారు. హజారీబాగ్‌ నుంచి ఆయన నాలుగుసార్లు ఎంపీగా విజయం సాధించారు.

ఆ తర్వాత ప్రధాని మోదీతో వచ్చిన పొరపొచ్చాలతో యశ్వంత్‌ సిన్హా బీజేపీ నుంచి వైదొలగి తృణమూల్‌ కాంగ్రెస్‌ పార్టీలో చేరారు. అయితే ఆయన కుమారుడు జయంత్‌ సిన్హా మాత్రం బీజేపీలోనే కొనసాగారు.

కాగా ఈ ఎన్నికల్లో జయంత్‌ సిన్హా ప్రాతినిధ్యం వహిస్తున్న హజారీబాగ్‌ సీటును బీజేపీ అధిష్టానం మనీశ్‌ జైశ్వాల్‌ కు ఇచ్చింది. అప్పటి నుంచి జయంత్‌ సిన్హా ప్రచారంలో పాలుపంచుకోవడం లేదని అంటున్నారు. అలాగే తన స్థానంలో వచ్చిన మనీశ్‌ కు ఎలాంటి మద్దతు ఇవ్వడం లేదని చెబుతున్నారు.

అంతేకాకుండా తాజాగా జరిగిన పోలింగ్‌ లోనూ జయంత్‌ సిన్హా తన ఓటు హక్కును కూడా వినియోగించుకోలేదని సమాచారం. దీంతో బీజేపీ అధిష్టానం అగ్గిమీద గుగ్గిలమైంది. ఎంపీగా ఉంటూ ఓటు హక్కు వినియోగించుకోకపోవడంతోపాటు పార్టీ నిర్ణయించిన అభ్యర్థికి మద్దతు ఇవ్వకపోవడం, ప్రచారంలో పాలుపంచుకోకపోవడంపై కన్నెర్ర జేసింది.

బీజేపీ ఎంపీ కనీసం ఓటు కూడా వేయలేదని ప్రతిపక్షాలు విమర్శలు చేసే అవకాశం ఉండటంతో జయంత్‌ సిన్హాకు బీజేపీ అధిష్టానం నోటీసులు జారీ చేసింది. హజారీబాగ్‌ లోక్‌ సభ స్థానం అభ్యర్థి గా మనీశ్‌ జైస్వాల్‌ ను ప్రకటించినప్పటి నుంచి ఎన్నికల ప్రచారంలో పాల్గొనలేదని ఆక్షేపించింది. అలాగే కనీసం ఓటు కూడా వేయకపోవడం సరికాదని పేర్కొంది. మీ ప్రవర్తన వల్ల పార్టీ ప్రతిష్ట దెబ్బతిందని షోకాజు నోటీసుల్లో పేర్కొంది. ఈ నేపథ్యంలో రెండు రోజుల్లోగా ఈ షోకాజు నోటీసులకు ఇవ్వాలని ఆదేశాలు జారీ చేసింది.

కాగా ఈ నోటీసులపై జయంత్‌ సిన్హా ఇంకా స్పందించలేదు. ఆయన కూడా బీజేపీకి రాజీనామా చేస్తారని ఆర్జేడీలో లేదా కాంగ్రెస్‌ పార్టీలో చేరే అవకాశం ఉందని టాక్‌ నడుస్తోంది.