జయప్రద అరెస్ట్ కు రంగం సిద్ధం.. అసలేం జరిగిందంటే..?
తెలుగులో ఒకప్పడు స్టార్ హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకున్న జయప్రద... టాప్ హీరోలందరితోనూ నటించారు
By: Tupaki Desk | 25 Dec 2023 10:51 AM GMTతెలుగులో ఒకప్పడు స్టార్ హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకున్న జయప్రద... టాప్ హీరోలందరితోనూ నటించారు. అనంతరం రాజకీయాల్లోకి ప్రవేశించారు. ఇందులో భాగంగా... సమాజ్ వాదీ పార్టీ తరపున రెండు సార్లు ఎంపీగా గెలిచారు. ప్రస్తుతం బీజేపీలో ఉన్న ఆమె అరెస్ట్ కి రంగం సిద్ధమైంది అంటూ వార్తలు హల్ చల్ చేస్తున్నాయి. దీంతో ఈ విషయం హాట్ టాపిక్ గా మారింది.
అవును... హీరోయిన్ కం పొలిటిషన్ జయప్రద అరెస్టుకు రంగం సిద్ధమైందని తెలుస్తుంది. ఆమెను అరెస్ట్ చేయడం కోసం ఉత్తర ప్రదేశ్ పోలీసులు ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేశారని అంటున్నారు. ప్రస్తుతం ఈ విషయం ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. దీంతో అసలు ఏమి జరిగింది.. ఆమె ఏమి నేరం చేశారు.. అంటూ నెట్టింట సెర్చింగ్ మొదలింది.
2019లో జరిగిన సార్వత్రిక ఎన్నికల సందర్భంగా.. నిబంధనలు ఉల్లంఘించినందుకు గాను జయప్రద మీద రెండు కేసులు నమోదయ్యాయి. ఈ క్రమంలో విచారణకు హాజరు కావాలంటూ కోర్టు ఆమెకు సమన్లు జారీ చేసింది. అయితే... జయప్రద మాత్రం న్యాయస్థానం ఎదుట హాజరు కాలేదు. దీంతో ఆగ్రహించిన న్యాయస్థానం ఆమె మీద నాన్ బెయిలబుల్ వారెంట్ జారీచేసింది.
అనంతరం... ఒక ప్రత్యేక టీం ను ఏర్పాటు చేసి, జయప్రదని అరెస్ట్ చేయాలని రాంపూర్ కోర్టు ఉత్తరప్రదేశ్ పోలీసులని ఆదేశించింది. దీంతో... మహిళా ఇన్ స్పెక్టర్ నేతృత్వంలో ముగ్గురు సభ్యులతో యూపీ పోలీసులు స్పెషల్ టీం ఏర్పాటు చేశారు. ఈ నేపథ్యంలో... జయప్రదను త్వరలోనే అరెస్ట్ చేస్తారంటూ వార్తలు వస్తున్నాయి. ఇప్పుడు ఈ విషయం అటు సినిమా ఇండస్ట్రీలోనూ, అటు పొలిటికల్ సర్కిల్స్ లోనూ చర్చనీయాంశం అయ్యింది.
ఈ విషయాలపై స్పందించిన రాంపూర్ పోలీసు సూపరింటెండెంట్ రాజేష్ ద్వివేది.. హీరోయిన్ కం పొలిటీషియన్ ను అరెస్టు చేయడానికి ముగ్గురు సభ్యుల బృందాన్ని పంపినట్లు తెలిపారు. కోర్టు ఆదేశాలను అనుసరించి, మహిళా ఇన్‌స్పెక్టర్ నేతృత్వంలో ప్రత్యేక పోలీసు బృందాన్ని ఏర్పాటు చేసినట్లు ప్రకటించారు.
కాగా... తెలుగు, తమిళ, హిందీ భాషల్లోని పలు చిత్రాల్లో హీరోయిన్ గా చేసిన జయప్రద.. అనంతరం రాజకీయాల్లోకి వచ్చారు. ఇందులో భాగంగా.. 1994లో తెలుగుదేశం పార్టీలో చేరింది. కొన్నాళ్ల అనంతరం ఈ పార్టీని వీడి, సమాజ్ వాదీ పార్టీలో చేరారు. ఈ క్రమంలో ఉత్తరప్రదేశ్ లోని రాంపూర్ నియోజకవర్గం నుంచి ఎంపీగా ఎన్నికయ్యారు.
ఈ క్రమంలో 2019 నుంచి బీజేపీలో కొనసాగుతోన్న ఆమె... ఆ ఏడాది జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో 1,09,997 ఓట్ల తేడాతో ఎస్పీ అభ్యర్థిపై ఓడిపోయారు. ఆ ఎన్నికల సందర్భంగా జయప్రద నిబంధనలు ఉల్లంఘించారంటూ కేసు నమోదైంది!