జయప్రదను వెంటనే అరెస్టు చేయమన్న కోర్టు.. ఎందుకంటే?
ప్రముఖ సినీనటి.. రాజకీయంగా కూడా ఒక వెలుగు వెలిగిన ప్రముఖురాలు జయప్రదకు షాకింగ్ పరిణామం ఎదురైంది
By: Tupaki Desk | 14 Feb 2024 6:30 AM GMTప్రముఖ సినీనటి.. రాజకీయంగా కూడా ఒక వెలుగు వెలిగిన ప్రముఖురాలు జయప్రదకు షాకింగ్ పరిణామం ఎదురైంది. ఆమెను తక్షణమే అరెస్టు చేయాలంటూ ప్రజాప్రతినిధుల కోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఉత్తరప్రదేశ్ లోని రాంపుర్ లోని న్యాయస్థానం ఈ షాకింగ్ ఉత్తర్వులు జారీ చేసింది. 2019లో ఎన్నికల నియమావళిని ఉల్లంఘించారంటూ ఆమెపై రెండు కేసులు నమోదయ్యాయి.
అయితే.. వీటి విచారణకు ఆమె హాజరుకాలేదు. దీంతో.. ఆమెను తక్షణం అరెస్టు చేసి కోర్టు ఎదుట హాజరు పర్చాలంటూ రాంపూర్ ప్రజాప్రతినిధుల న్యాయస్థానం అరెస్టు వారెంట్ ఇష్యూ చేసింది. ఇందుకు ఈ నెల 27ను తుది గడువుగా పేర్కొంది. ఇంతకూ జయప్రద చేసిన తప్పేంటి? ఆమె మీద ఉన్న కేసు ఏమిటి? అన్న విషయంలోకి వెళితే ఆమె ఏం తప్పు చేశారో తెలుస్తుంది.
2019లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో రాంపూర్ తరఫు బీజేపీ అభ్యర్థిగా పోటీ చేశారు జయప్రద. ఈ క్రమంలో ఎన్నికల నిబంధనల్ని ఉల్లంఘించినట్లుగా పేర్కొంటూ కౌమరి.. స్వార్ పోలీస్ స్టేషన్ లలో ఆమెపై రెండు కేసులు నమోదయ్యాయి. ప్రస్తుతం ఈ రెండు కేసులు ప్రజాప్రతినిధుల కోర్టు విచారణలో ఉన్నాయి. విచారణలో భాగంగా అనేకసార్లు ఆమెకు నోటీసులు జారీ చేశారు.
అయినప్పటికి ఆమె స్పందించలేదు. ఇప్పటివరకు ఏడుసార్లు అరెస్టు వారెంట్లుజారీ అయినా ఆమెను పోలీసులు అరెస్టు చేయలేదంటూ ప్రభుత్వ న్యాయవాది కోర్టుకు తెలియజేశారు. దీంతో స్పందించిన న్యాయస్థానం ఆమెకు నాన్ బెయిలబుల్ వారెంట్ ఇష్యూ చేయటమే కాదు.. సదరు కేసు విచారణను ఈ నెల 27కు వాయిదా వేస్తూ ఆదేశాలు జారీ చేసింది. గోటితో పోయేదానిని గొడ్డలి వరకు తెచ్చుకోవటం అంటే ఇదేనేమో?