పవన్ కు అలా షాకిచ్చిన జేపీ... కీలక వ్యాఖ్యలు!
మాజీ ఐఏఎస్ అధికారి జయప్రకాశ్ నారాయణ కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు.
By: Tupaki Desk | 5 Nov 2023 5:40 AM GMTతెలంగాణలో ఎన్నికలు సమీపిస్తూ రాజకీయంగా రసవత్తరంగా మారుతుంటే... మరోపక్క ఏపీలో అంతకుమించి అన్నట్లుగా పరిణామాలు మారిపోతున్నాయి. ఏపీలో రాబోయే ఎన్నికల్లో అధికార వైసీపీ ఒంటరిగా వెళ్తుండగా.. టీడీపీ-జనసేన కలిసి పోటీచేయబోతున్నాయి. త్వరలో ఉమ్మడి మేనిఫెస్టోనూ విడుదల చేయబోతున్నాయి. ఇందులో భాగంగా జీపీఎస్ స్థానంలో ఓపీఎస్ ను తెరపైకి తెచ్చాయి. ఈ సమయమంలో లోక్ సత్తా జయప్రకాశ్ నారాయణ ఎంటరయ్యారు. ఈ సందర్భంగా కీలక వ్యాఖ్యలు చేశారు.
అవును... త్వరలో టీడీపీ - జనసేన ఉమ్మడి మేనిఫెస్టో విడుదలకాబోతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే నవంబర్ 1 న ఉమ్మడి మేనిఫెస్టో విడుదల అని ప్రకటించినప్పటికీ... ఆ రోజు జరగలేదు. దీంతో మేనిఫెస్టో అమలులోనూ నిర్లక్ష్యమే, ప్రకటనలోనూ నిర్లక్ష్యమే అని వైసీపీ నేతలు విమర్శలు గుప్పించారు. ఆ సంగతులు అలా ఉంటే... ఈ హామీల్లో ప్రధానంగా ఉద్యోగులకు జీపీఎస్ స్థానంలో ఓపీఎస్ అమలు అంశం చేర్చారు.
ఈ నేపథ్యంలో తాజాగా ఇదే అంశంపై మాజీ ఐఏఎస్ అధికారి జయప్రకాశ్ నారాయణ కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. దీంతో ప్రస్తుతం ఆ వ్యాఖ్యలు రాజకీయంగా వైరల్ అవుతున్నాయి. ఏపీలో టీడీపీ - జనసేన ఉమ్మడి మేనిఫెస్టోలో భాగంగా జనసేన నుంచి ఆరు కీలక అంశాలను ప్రతిపాదించిన సంగతి తెలిసిందే! ఇందులో భాగంగా.. వారాహి యాత్రలో ఇచ్చిన హామీలను మేనిఫెస్టోలో చేర్చాలని జనసేన కోరిందని అంటున్నారు.
ఆ ఆరు అంశాలు... అమరావతి రాజధానిగా కొనసాగింపు.. పారిశ్రామిక అభివృద్ధి కోసం సంపన్న ఆంధ్రప్రదేశ్.. విశాఖ, విజయవాడ, తిరుపతిలను క్లస్టర్ల వారీగా మహానగరాలుగా అభివృద్ధి.. బీపీఎల్ కుటుంబాలకు ఉచితంగా ఇసుక.. భవన నిర్మాణ కార్మికులను ఆదుకునేందుకు ప్రత్యేక కార్యక్రమం.. జీపీఎస్ స్థానంలో ఓపీఎస్ అమలు.. ఏటా లక్ష మంది యువ పారిశ్రామికవేత్తలకు 10 లక్షల చొప్పున ఆర్థిక సాయం.. వంటివి ప్రధాన అంశాలుగా ప్రతిపాదించింది జనసేన. వీటికి టీడీపీ నుంచి సానుకూలత కూడా వచ్చేసిందట.
మిగిలిన హామీల సంగతి కాసేపు పక్కనపెడితే... ఈ ఆరింటిలో ప్రధానంగా ఉద్యోగులను ఆకట్టుకొనేందుకు జనసేన ప్రతిపాదించిన జీపీఎస్ స్థానంలో ఓపీఎస్ అమలు అంశం రాజకీయంగా తీవ్ర చర్చకు దారితీసింది. ఈ క్రమంలో ఈ అంశంపైన మాజీ ఐఏఎస్ అధికారి జయప్రకాశ్ నారాయణ కీలక వ్యాఖ్యలు చేశారు. ఇందులో భాగంగా రాజకీయ పార్టీలు ఎన్నికల గండం గట్టెక్కటానికి ఉద్యోగ సంఘాలు, సంఘటిత వర్గాలకు భయపడిపోతూ దేశ ప్రయోజనాలను విస్మరిస్తున్నాయని జేపీ వ్యాఖ్యానించారు.
ఇదే సమయంలో... ప్రపంచంలో ఎక్కడాలేని విధంగా ఉద్యోగులకు పెన్షన్ చెల్లించటానికి బడ్జెట్ లో డబ్బులు కేటాయించకుండా భవిష్యత్ తరాలు పన్నుల రూపంలో చెల్లించేలా ఆలోచనలు చేస్తున్నాయని జయప్రకాశ్ నారాయణ పేర్కొన్నారు. ఇదే జరిగితే రాబోయే రోజుల్లో ప్రభుత్వాలు దివాళా తీయటం ఖాయమని జేపీ స్పష్టం చేసారు. ఇదే క్రమంలో 19 ఏళ్ల క్రితం కొత్త పెన్షన్ స్కీం ఒప్పుకొని.. ఇప్పుడు తిరిగి ఎన్నికల కోసమంటూ ఓపీఎస్ వైపు వెళ్తున్నాయని ఆయన వ్యాఖ్యానించారు. దీంతో ఈ వ్యాఖ్యలు ఇప్పుడు జనసేన-టీడీపీ కూటమిని చిక్కుల్లో పడేశాయని అంటున్నారు పరిశీలకులు.
కాగా... 2019 ఎన్నికల సమయంలో జగన్ నాడు సీపీఎస్ రద్దు పైన హామీ ఇచ్చిన సంగతి తెలిసిందే. అయితే... అందులో ఉన్న సమస్యలను ఉద్యోగ సంఘాలకు వివరించి గ్యారంటీ పెన్షన్ స్కీం కు ఆమోదం తెలిపారు. ఆ సమయంలో ఉద్యోగ సంఘాలు హర్షం వ్యక్తం చేశాయి. అయితే ఇప్పుడు జనసేన తమ మేనిఫెస్టో అంశాల్లో భాగంగా తాజాగా జీపీఎస్ స్థానంలో ఓపీఎస్ అమలు ప్రతిపాదించింది. దీంతో ఈ అంశంలో జేపీ ఈ కీలక వ్యాఖ్యలు చేశారు.