Begin typing your search above and press return to search.

బీజేపీలోకి జయసుధ... రాములమ్మకు కిరణ్ మార్క్ చెక్?

అవును... సీనియర్ నటి, మాజీ ఎమ్మెల్యే జయసుధ తెలంగాణ బీజేపీలోకి ఎంట్రీ ఇచ్చారు.

By:  Tupaki Desk   |   2 Aug 2023 2:08 PM GMT
బీజేపీలోకి జయసుధ... రాములమ్మకు కిరణ్ మార్క్ చెక్?
X

తెలంగాణలో ఎన్నికలు సమీపిస్తోన్న వేళ రాజకీయాల్లో చేరికల పర్వాల సందడి నెలకొన్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ విషయంలో కాంగ్రెస్ పార్టీ దూకుడు మీదుండగా.. తాజాగా బీజేపీ కూడా ఫాం లోకి వచ్చిందని అంటున్నారు. ఈ సమయంలో సీనియర్ నటి, మాజీ ఎమ్మెల్యే జయసుధ బీజేపీలో చేరారు.

అవును... సీనియర్ నటి, మాజీ ఎమ్మెల్యే జయసుధ తెలంగాణ బీజేపీలోకి ఎంట్రీ ఇచ్చారు. ఈ మేరకు బుదవారం ఆమె బీజేపీలో చేరారు. పార్టీ తెలంగాణ ఇన్‌ ఛార్జ్ తరుణ్ ఛుగ్ సమక్షంలో కాషాయ కండువా కప్పుకొన్నారు జయసుధ. ఆ సమయంలో జయసుధ వెంట కేంద్రమంత్రి, టిబీజేపీ చీఫ్ కిషన్ రెడ్డి, రాష్ట్ర శాఖ ప్రధాన కార్యదర్శి డీకే అరుణ ఉన్నారు.

అయితే జయసుధ బీజేపీలో చేరే విషయంలో ఎప్పటినుంచో చర్చలు జరుగుతున్నాయంటూ కథనాలొచ్చిన సంగతి తెలిసిందే. ఈ మేరకు ఆమె కొన్ని కండిషన్స్ పెట్టారని అంటున్నారు. అయితే అప్పట్లో ఈ కండిషన్స్ పై నిర్ణయం తీసుకునే విషయంలో బీజేపీ పెద్దలు లైట్ తీసుకున్నారని అంటున్నారు. అయితే తాజాగా కిరణ్ కుమార్ రెడ్డి సౌజన్యంతో జయసుధ బీజేపీలో చేరిక సుఖాంతం అయ్యిందని చెబుతున్నారు.

అయితే డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి హఠాన్మరణం అనంతరం ముఖ్యమంత్రి అయిన నల్లారి కిరణ్ కుమార్ రెడ్డితో జయసుధకు సత్సంబంధాలు ఉన్నాయని అంటున్నారు. దీంతో ఆయన ప్రోద్బలంతోనే జయసుధ బీజేపీలో చేరినట్లు చెబుతున్నారు. దీంతో... ఆమె రాక విజయశాంతికి ఇబ్బందికరంగా మారొచ్చనే అభిప్రాయాలు వ్యక్తమౌతోన్నాయి. కిరణ్ ప్లాన్ కూడా ఇదే అనే కామెంట్లు కూడా వినిపిస్తుండటం గమనార్హం.

కాగా... పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా కేంద్రమంత్రి కిషన్ రెడ్డి బాధ్యతలను స్వీకరించే సమయంలో.. సభనుంచి విజయశాంతి అర్ధాంతరంగా వెళ్లిపోయిన విషయం తెలిసిందే. ఆ కార్యక్రమంలో కిరణ్ కుమార్ రెడ్డి కూడా పాల్గొన్నారు. “తెలంగాణను అత్యంత తీవ్రంగా వ్యతిరేకించి.. ఉద్యమాన్ని ఉక్కుపాదంతో అణిచివేయాలని ప్రయత్నించిన వారు ఉండటం వల్ల తాను మధ్యలోనే వెళ్లానంటూ” విజయశాంతి ట్విట్టర్ లో పేర్కొన్నారు.

దీంతో విజయశాంతి అలా మధ్యలో లేచి వెళ్లిపోవడానికి, అనంతరం ట్విట్టర్ లో స్పందించడానికీ కిరణ్ కుమార్ రెడ్డే కారణం అంటూ కథనాలొచ్చాయి. దీంతో... రాములమ్మ కు చెక్ పెట్టడం కోసమే సీనియర్ నటి జయసుధను తెరపైకి తెచ్చారని.. ఇందులో కిరణ్ పాత్ర కీలకం అనే కామెంట్లు వినిపిస్తున్నాయి.

ఆ సంగతి అలా ఉంటే... ఉమ్మడి రాష్ట్రంలో జయసుధ కాంగ్రెస్‌ లో సుదీర్ఘకాలం పాటు కొనసాగిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా వైఎస్ నేతృత్వంలో 2009 నాటి సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా సికింద్రాబాద్ అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేశారు. ఈ ఎన్నికల్లో అప్పటి టీడీపీ అభ్యర్థి తలసాని శ్రీనివాస యాదవ్‌ పై ఘన విజయం సాధించారు.

అనంతరం రాష్ట్ర విభజన తరువాత జయసుధ రాజకీయాల్లో క్రియాశీలకంగా కనిపించలేదు. అయితే వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో జయసుధ మళ్లీ సికింద్రాబాద్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచే పోటీకి దిగొచ్చని అంటున్నారు. ఆ హామీతోనే ఆమె బీజేపీలో చేరారనే కామెంట్లు వినిపిస్తున్నాయి.