అమిత్ షా కొడుకంటే అలానే ఉంటాది మరి
గడిచిన కొంతకాలంగా బీసీసీఐను శాసిస్తున్న వ్యక్తిగా జై షా మారారు. ఇప్పుడు ఆయన.. అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) ఛైర్మన్ పదవి రేసులోకి వచ్చేశారు.
By: Tupaki Desk | 21 Aug 2024 4:30 AM GMTఅత్యున్నత స్థానాల్లో ఉన్న వారి పుత్రరత్నాలు అంతే పవర్ ఫుల్ పదవుల కోసం తపించటం కొత్తేం కాదు. కానీ.. నిత్యం నీతులు చెప్పే బీజేపీ అగ్రనేతలకు సంబంధించి ఇలాంటివి చోటు చేసుకోవటం మాత్రం కాస్తంత ఆసక్తికర అంశమే. ఇప్పటికే భారత క్రికెట్ లో చక్రం తిప్పుతున్న అమిత్ షా కుమారుడు జై షా.. బీసీసీఐ కార్యదర్శిగా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా ఆయన మరో పవర్ ఫుల్ పోస్టు మీద కన్నేసిన వైనం ఆసక్తికరంగా మారింది.
గడిచిన కొంతకాలంగా బీసీసీఐను శాసిస్తున్న వ్యక్తిగా జై షా మారారు. ఇప్పుడు ఆయన.. అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) ఛైర్మన్ పదవి రేసులోకి వచ్చేశారు. మామూలు వ్యక్తులకు ఇది సాధ్యమయ్యేది కాదు. అమిత్ షా లాంటి అత్యంత పవర్ ఫుల్ నేత కుమారుడికి ఉండే అవకాశాలు వేరన్న విషయం తెలిసిందే. ప్రస్తుతం ఐసీసీ ఛైర్మన్ గా వ్యవహరిస్తున్న గ్రెగ్ బార్ క్లే రెండో దఫా పదవీకాలం ఈ నవంబరు 30తో ముగియనుంది. న్యూజిలాండ్ కు చెందిన ఈ పెద్ద మనిషి ఈసారి పోటీ నుంచి దూరంగా ఉండాలని భావిస్తున్నారు.
ఐసీసీ నిబంధనల ప్రకారం చూస్తే.. ఒక వ్యక్తి అంతర్జాతీయ క్రికెట్ మండలి ఛైర్మన్ పదవిలో గరిష్ఠంగా మూడుసార్లు కొనసాగే వీలుంది. ప్రతిసారి రెండేళ్లు ఆ పదవిలో ఉండే వీలుంది. అంటే.. ఆరేళ్లు కొనసాగే వీలుంది.
అయితే.. గ్రెగ్ మాత్రం మూడోసారి ఆ పదవిలో కంటిన్యూ అయ్యేందుకు ఆసక్తిని చూపటం లేదు. దీంతో.. కొత్త ఛైర్మన్ ఎన్నిక అనివార్యంగా మారింది. ఈ నేపథ్యంలో అమిత్ షా కుమారుడు జై షా పేరు ఛైర్మన్ రేసులో వినిపిస్తోంది. ఈ నెల 27లోపు ఐసీసీ ఛైర్మన్ పదవి కోసం నామినేషన్ దాఖలు చేయాల్సి ఉంటుంది. జై షా అధికారికంగా రంగంలోకి రావటమే మిగిలి ఉందన్న మాట వినిపిస్తోంది. మరేం జరుగుతుందో చూడాలి.