తగ్గేదేలే అన్న జేసీ తగ్గారా ?
ఆమె మీద అనరాని మాటలు అని అనుచిత భాషను ఉపయోగించిన జేసీ రెండు రోజుల తరువాత అయినా తాను అన్నది తప్పు అని గుర్తించారు అంటున్నారు.
By: Tupaki Desk | 6 Jan 2025 4:23 AM GMTఅనంతపురం జిల్లా తాడిపత్రి మునిసిపల్ చైర్మన్, సీనియర్ పొలిటీషియన్ అయిన జేసీ ప్రభాకర రెడ్డి తన టోటల్ రాజకీయ జీవితంలో తగ్గేదేలే అన్నట్లుగానే దూకుడుగా ముందుకు సాగుతారు. అటువంటి పెద్దాయన ఫస్ట్ టైం తగ్గారు. అది కూడా బీజేపీ మహిళా నాయకురాలు సినీ నటి మాధవీలత ఇష్యూలో.
ఆమె మీద అనరాని మాటలు అని అనుచిత భాషను ఉపయోగించిన జేసీ రెండు రోజుల తరువాత అయినా తాను అన్నది తప్పు అని గుర్తించారు అంటున్నారు. అందుకే ఆయన తాను ఆవేశంలో అలా మాట్లాడాను అని ఉద్దేశ్యపూర్వకంగా ఏమీ అనలేదని అన్నారు. తన వయసు డెబ్బై రెండేళ్ళు అంటూ ఆయన చెబుతూ ఈ వయసులో ఆవేశంతో ఏవేవో అన్నాను అని చెప్పుకున్నారు. ఇక ఎవరి జీవితాలు వారివి ఎవరి బతుకు తెరువు వారిది అంటూ జేసీ వ్యాఖ్యానించడం విశేషం.
మధవీలత సినిమా నటి కావడంతో ఆమె వృత్తిని సైతం ఆయన కించపరచేలా మాట్లాడిన సంగతి విధితమే ఇపుడు ఆయన ఈ మాటలు అనడం ద్వారా వివాదానికి ముగింపు పలికారు. ఇదిలా ఉంటే గత కొంతకాలంగా బీజేపీ మీద దూకుడు చేస్తూ చాలా దూరం వెళ్ళిన జేసీ కూటమిలో మిత్రపక్షంగా ఉన్న కాషాయం పార్టీని టార్గెట్ చేశారు
ఆయనకు కడపకు చెందిన బీజేపీ ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డికి మధ్య మొదలైన వివాదం కాస్తా పీక్స్ కి చేరుకుని బీజేపీ అంటేనే జేసీ మండిపడే స్థాయికి చేరుకుంది. అయితే ఆ వివాదంలో జేసీ చాలా పరుషమైన పదజాలన్నే వాడేశారు.
ఆయన బస్సు ఒకటి దగ్దం కావడంతో తట్టుకోలేకపోయారు. అలాగే తాడిపత్రి జేసీ పార్కులో న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ మీద మాధవీలత చేసిన వ్యాఖ్యలు కూడా దానికి తోడు కావడంతో ఆయన అగ్గిమీద గుగ్గిలం అయి ఆమె మీద విచక్షణ మరచి తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు
దానికి మాధవీలత కూడా ధీటుగా ఘాటుగా బదులిచ్చింది. తాను ఏ తప్పూ చేయలేదని కానీ పెద్దాయన తన మీద అనవసరంగా కామెంట్స్ చేశారని అందువల్ల తాను కర్మకే వదిలేస్తున్నాను అంటూనే ఆమె తాను తగ్గేది లేద్ని మహిళా సమస్యల మీద పోరాడుతాను అని బదులిచ్చింది. మరి ఈ రెండు రోజుల వ్యవధిలో ఏమైందో ఏమో తన వైఖరికి భిన్నంగా జేసీ ప్రభాకర్ రెడ్డి స్పందించారు. మనస్పూర్తిగా మాధవీలతకు క్షమాపణలు చెప్పారు.
మరి బీజేపీ మీద దూకుడుగా ఉన్న జేసీ తీరుతో కూటమి పెద్దలు కూడా అసహనం వ్యక్తం చేస్తున్నారు. అంతే కాదు అదే అనంతపురం జిల్లాకు చెందిన మంత్రి సత్యకుమార్ కూడా జేసీ మీద మండిపడ్డారు. ఆయన బీజేపీ కేంద్ర నాయకత్వానికి అత్యంత సన్నిహితులు అన్న సంగతి తెలిసిందే. మరి ఈ విధంగా వ్యవహారం చేతులు దాటిపోవడం జరుగుతోందని గ్రహించిన మీదటనే జేసీ తగ్గారు అని అంటున్నారు. ఏది ఏమైనా జేసీ క్షమాపణలతో ఇక ఎండ్ కార్డు పడినట్లేనా లేక మళ్ళీ కొత్త వివాదం రాజుకుంటుందా అన్నది చూడాల్సి ఉంది అంటున్నారు.