దర్శనం టికెట్లు అమ్ముకుని బెంజి కారు : జేసీ ప్రభాకర్ రెడ్డి ఫైర్
తిరుపతి తొక్కిసలాట ఘటనపై అధికార, విపక్ష పార్టీల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది.
By: Tupaki Desk | 12 Jan 2025 1:41 PM GMTతిరుపతి తొక్కిసలాట ఘటనపై అధికార, విపక్ష పార్టీల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. ముఖ్యంగా ఈ సంఘటనపై తీవ్ర విమర్శలు గుప్పిస్తున్న మాజీ మంత్రి రోజాపై కూటమి నేతలు మండిపడుతున్నారు. శ్రీవారి దర్శనం టికెట్లు అమ్ముకుని రోజా బెంజి కారు కొనుగోలు చేశారంటూ మాజీ ఎమ్మెల్యే, టీడీపీ సీనియర్ నేత జేసీ ప్రభాకర్ రెడ్డి ధ్వజమెత్తారు.
తిరుపతి ఘటనపై ప్రభుత్వాన్ని కార్నర్ చేసేందుకు వైసీపీ తీవ్రంగా ప్రయత్నిస్తోంది. సంఘటన జరిగిన వెంటనే మాజీ సీఎం జగన్ తిరుపతి ఆస్పత్రిలో బాధితులను పరామర్శించారు. ఇక ఆ పార్టీ తరఫున అధికార ప్రతినిధి ఆర్కే రోజా నిత్యం ప్రభుత్వంపై విమర్శలు గుప్పిస్తున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు బాధ్యత వహించాలంటూ డిమాండ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆమెపై జేసీ ప్రభాకర్ రెడ్డి ఓ రేంజులో ఫైర్ అయ్యారు.
ఆదివారం తాడిపత్రిలో మీడియాతో మాట్లాడిన జేసీ ప్రభాకర్ రెడ్డి మాజీ మంత్రి రోజాను టార్గెట్ చేశారు. రోజా మంత్రిగా ఉండగా తిరుమల దర్శనాలకు వందల మందిని వెంట తీసుకుని వెళ్లి వారి నుంచి వేలాది రూపాయలు దండుకునేవారని ఆరోపించారు. అంతేకాకుండా శ్రీవారి దర్శనం టికెట్లు అమ్ముకుని ఆ డబ్బుతో బెంజి కారు కొనుగోలు చేసిందని విమర్శలు గుప్పించారు.
అనంతపురంలో రోజాపై చెక్ బౌన్స్ కేసులు కూడా ఉన్నాయని గుర్తు చేశారు. తిరుపతి తొక్కిసలాట ఘటనపై మాట్లాడే ముందు రోజా వాస్తవాలు గమనించాలని కోరారు. మాజా మంత్రి రోజా తన నోటిని అదుపులో పెట్టుకోవాలని ఘాటు వ్యాఖ్యలు చేశారు. మరోవైపు చంద్రబాబు హయాంలో జరిగిన ప్రమాదాలపై వైసీపీ విమర్శలు గుప్పించడాన్ని తప్పుబట్టిన జేసీ.. వైసీపీ అధికారంలో ఉండగా, జరిగిన ప్రమాదాలపై ఓ ప్లెక్సీ ప్రింట్ చేసి ప్రదర్శించారు. ఆ ప్లెక్సీలో వైసీపీ హయాంలో జరిగిన ప్రమాదాలు, చోటుచేసుకున్న నష్టం వివరించారు.