Begin typing your search above and press return to search.

జేసీ సంచలనం...అన్నీ నేనే పెట్టుకుంటానంటూ !

అనంతపురం జిల్లాలో జేసీ బ్రదర్స్ రాజకీయం వారి పలుకుబడి హవా గురించి అందరికీ తెలిసిందే.

By:  Tupaki Desk   |   13 Oct 2024 7:11 AM GMT
జేసీ సంచలనం...అన్నీ నేనే పెట్టుకుంటానంటూ !
X

అనంతపురం జిల్లాలో జేసీ బ్రదర్స్ రాజకీయం వారి పలుకుబడి హవా గురించి అందరికీ తెలిసిందే. జేసీ దివాకర్ రెడ్డి బిగ్ బ్రదర్ గా అర్ధ శతాబ్దం పాటు జిల్లాలో తన చక్రం తిప్పారు. ఇపుడు వయోభారం వల్ల ఆయన హైదరాబాద్ లోని తన ఇంటికే పరిమితం అయ్యారని అంటున్నారు.

ఆయన సోదరుడు జేసీ ప్రభాకర్ రెడ్డి ఒకసారి ఎమ్మెల్యే అయ్యారు. అన్న తరఫున రాజకీయాలను జిల్లాలో చక్కబెడుతూ ఆయన రాజకీయంగా రాటు దేలారు. 2019లో టీడీపీ ఓటమి పాలు అయ్యాక వచ్చిన లోకల్ బాడీ ఎన్నికల్లో తాడిపత్రి మున్సిపాలిటీ గెలుచుకుని చైర్మన్ గా జేసీ ప్రభాకర్ రెడ్డి గెలిచి సంచలనం రేపారు. ఎమ్మెల్యేగా పనిచేసి స్టేట్ వైడ్ లో పేరు తెచ్చుకున్న నాయకులు మళ్ళీ లోకల్ బాడీస్ వైపు చూడరు.

కానీ జేసీ ఆ విధంగా చేయడం వెనక ఆయన రాజకీయ వ్యూహాలు ఉన్నాయి. తాడిపత్రిని గెలుచుకునేందుకు గుండెకాయ లాంటి మున్సిపల్ చైర్మన్ పదవి ఎంతో ముఖ్యమని భావించే ఆయన అలా చేశారు. ఇక చైర్మన్ గానూ ఆయన గత వైసీపీ ప్రభుత్వంలో పోరాడి చేయాల్సిన కార్యక్రమాలను చేస్తూ వెళ్లారు

ఇపుడు ఆయన కుమారుడు జేసీ అస్మిత్ రెడ్డిని తాడిపత్రి నుంచి ఎమ్మెల్యేగా గెలిపించుకున్నారు. ఈ నేపథ్యంలో తన అనుభవాన్ని మరోసారి ముందు పెట్టి తాడిపత్రిలో జేసీ పలుకుబడి శాశ్వతం అయ్యేలా ప్రణాళికలు రచిస్తున్నారు.

లేటెస్ట్ గా జేసీ ప్రభాకర్ రెడ్డి ఇచ్చిన స్టేట్మెంట్ చూస్తే ఆయన పాలిటిక్స్ ఏంటో అర్ధమవుతుంది. తానే సొంతంగా నిధులు ఇచ్చి తాడిపత్రి నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తాను అని జేసీ ప్రభాకర్ రెడ్డి ప్రకటించడం నిజంగా సంచలనమే అని అంటున్నారు.

తాడిపత్రి అభివృద్ధి కోసం మరో మూడు నెలల కాలంలో తాను మూడు కోట్ల రూపాయలను బ్యాంకులో డిపాజిట్ చేస్తాను అని కీలకమైన ప్రకటన చేశారు. ఇక వచ్చే ఏడాది తాను పది కోట్ల రూపాయలు డిపాజిట్ చేస్తాను అని ప్రకటించారు. ఈ మొత్తాలతో తాడిపత్రిని అభివృద్ధి చేసి చూపిస్తామని అన్నారు

ప్రభుత్వ నిధుల కోసం చూడకుండా తన సొంత నిధులనే తాను ఖర్చు పెడతాను అని జేసీ ప్రభాకరరెడ్డి చెప్పడం ఏదైతే ఉందో అది సంచలనమే కాదు స్పూర్తిదాయకమైన ప్రకటన అని అంటున్నారు. ఈ రోజున ఎమ్మెల్యేలుగా నెగ్గిన వారు అంతా అభివృద్ధి చేయడంలేదనే మళ్ళీ జనంలో విమర్శలు ఎదుర్కొంటున్నారు.

ఎన్నికల్లో గెలిచేందుకు కోట్లు ఖర్చు పెడుతున్న వారు గెలిచిన తరువాత ఏ పేరుని ఇమేజ్ ని కాపాడుకునేందుకు సొంత నిధులు ఎంతో కొంత వెచ్చిస్తే వారికే బాగుంటుంది అన్నది తెలిసిందే. కానీ అప్పటికే అలసిపోయిన చాలా మంది సొంత నిధులు తీయడానికి వెనకాడతారు. గెలుపే పరమావధి కాబట్టి ఆ మీదట రూపాయి తీసినా వేస్టు అనుకున్న వారూ ఉన్నారు.

కానీ జేసీ ప్రభాకరరెడ్డి అలా కాకుండా తాడిపత్రిలో తన కుటుంబమే పది కాలాల పాటు రాజకీయం చేయాలన్న కోరికతోనే ఈ విధంగా చేస్తున్నారు అని అంటున్నారు. అంతే కాదు ఆయన తాడిపత్రి ప్రశాంత నిలయమని వ్యపారులు తమకు నచ్చిన బిజినెస్ చేసుకోవచ్చు అని కూడా ఒక బిగ్ ఆఫర్ ని ఇచ్చేశారు.

తాను వారికి అండగా ఉంటాను అని వారు చేసే వ్యాపారంలో ఇరవై శాతం వాటా కూడా తాను భరించి ఆ వ్యాపారానికి సహకరిస్తాను అని జేసీ ప్రభాకరరెడ్డి ప్రకటించడం ద్వారా తాను ప్రజల మనిషిని అనిపించుకుంటున్నారు. ఫ్రాక్షన్ ఏరియాగా పేరుపడిన తాడిపత్రిని అభివృద్ధి చేయడం ప్రత్యర్ధులు మళ్ళీ గెలవకుండా చిత్తు చేయడమే అజెండాగా చేసుకుని జేసీ ప్రభాకర్ రెడ్డి ఈ ప్రకటనలు చేశారని అంటున్నారు. మొత్తానికి జేసీ బ్రదర్సా మజాకానా అనిపించేశారు అంటున్నారు.