జేసీ బ్రదర్స్ ది తెలంగాణనా? ఆ కతేంటి?
తన వంశ చరిత్ర మీద రీసెర్చ్ చేయటం ద్వారా జేసీ బ్రదర్స్ లో ఒకరైన ప్రభాకర్ రెడ్డి గుర్తించారు.
By: Tupaki Desk | 31 July 2023 4:30 PM GMTతెలుగు రాష్ట్రాల్లో సుపరిచితమైన పొలిటికల్ ఫ్యామిలీల్లో ఒకటి జేసీ బ్రదర్స్. వారి పేరు విన్నంతనే ఉమ్మడి అనంతపురం జిల్లాకు చెందిన నాయకులుగా గుర్తుకు వస్తారు. ప్రత్యేక తెలంగాణ ఉద్యమ వేళ రాయల్ తెలంగాణ ప్రపోజల్ ను తీసుకొచ్చిన వారిలో జేసీ బ్రదర్స్ లో పెద్దవాడైన జేసీ దివాకర్ రెడ్డి ఒకరు. అయితే.. ఈ ప్రతిపాదనకు పెద్దగా ఆదరణ లభించకపోవటం తెలిసిందే. అయితే.. జేసీ బ్రదర్స్ పూర్వీకులు సీమ వాసులు కాదని.. తెలంగాణ ప్రాంతానికి చెందిన వారన్న కొత్త విషయాన్ని ఆ మధ్యన గుర్తించారు.
తన వంశ చరిత్ర మీద రీసెర్చ్ చేయటం ద్వారా జేసీ బ్రదర్స్ లో ఒకరైన ప్రభాకర్ రెడ్డి గుర్తించారు. ఇదే విషయాన్ని తాజాగా ఇచ్చిన ఒక ప్రత్యేక ఇంటర్వ్యూలో ఆయన చెప్పుకొచ్చారు. "మా పూర్వీకులది తెలంగాణనే. అది 370 ఏళ్ల నాటి సంగతి. మా పూర్వీకులది గద్వాల ప్రాంతం లోని జూటూరు అన్నది మా ఊరు. ఇప్పుడే చరిత్ర మొత్తం బయటకు తీశాము. మేం తినటానికి తిండి లేక ఫ్యాక్షన్ చేశాం. ఊరి పేరే మా ఇంటి పేరు. మా ప్రాంతంలో ఐదేళ్లకు ఒకసారి వర్షం పడేది. దాంతో మా గుంపును నడపాలి. అందుకే.. ఫ్యాక్షన్ చేశాం" అని చెప్పుకొచ్చారు.
కేతిరెడ్డి పెద్దారెడ్డికి.. జేసీ కుటుంబానికి మధ్యనున్న వైరం గురించి చెప్పుకొచ్చిన జేసీ ప్రభాకర్ రెడ్డి.. "దీనికి అసలు కారణం రాజారెడ్డినే. ఆయనది మా పక్కనున్న నియోజకవర్గం. రాజారెడ్డిని లెక్క చేసే వాళ్లం కాదు. ఆయన ఏది అనుకుంటే అది జరగాలనుకుంటారు. ఆయన అలా లేకుంటే దారుణంగా హత్య చేసే వారు కాదు కదా? ఫ్యాక్షనిస్టు ఎప్పటికైనా పోస్టుమార్టం అవుతాడన్నది ఎప్పటికైనా నిజం. మా అన్నకు రెండు స్టంట్లు వేశారు. అందుకే కొంత సైలెంట్ గా ఉన్నాడు. నా బలం.. ధైర్యం నా భార్యే. బాంబుల బకెట్లు తెచ్చి ఇవ్వమన్నా ఇస్తుందని.. ఆమే నన్ను ఇలా ధైర్యంగా మార్చింది" అని చెప్పారు. తన అన్న జేసీ దివాకర్ రెడ్డి కొడుకు పవన్ కు ముఖ్యమంత్రి జగన్ మంచి స్నేహితుడే అయినా తమ మధ్య రాజీ కుదర్చటానికి తాను ఒప్పుకోనని స్పష్టం చేయటం గమనార్హం.