ఏపీ నేతలు... ప్రజాసేవలో నేతల 'కొత్త' దారులు... !
తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్‌రెడ్డి ప్రజలకు సేవ చేసేందుకు మద్యం దుకాణాల నుంచి కమీషన్ తీసుకుంటానని బహిరంగంగానే చెప్పారు.
By: Tupaki Desk | 18 Oct 2024 4:30 PM GMTప్రజలకు సేవ చేసేందుకు అనేక మార్గాలు ఉన్నాయి. కొందరు కాయకష్టంతో ప్రజలకు సేవ చేస్తారు. మరికొందరు ఉన్న ఆస్తులను తెగనమ్మి సేవలు చేస్తారు. ఇంకొందరు ప్రభుత్వ సాయంతో ప్రజలకు సేవలందిస్తారు. మరికొందరు స్నేహితులను, తెలిసిన వారిని కూడగట్టి సేవ చేస్తారు. ఇలా.. సేవలు చేసేందుకు అనేక మార్గాలు ఉన్నాయి. సాధారణంగా ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులుగా ఉన్నవారు.. ప్రజలకు సేవ చేసేందుకు రాజకీయాల్లోకి వచ్చామని చెబుతారు.
ఎవరు ఎన్ని సేవలు చేసినా.. ఎమ్మెల్యేలు, మంత్రులు, ఎంపీలు చేసే సేవ కీలకం. ఎందుకంటే.. అధిక మొత్తంగా సొమ్ములు ఉంటాయి.. అధికారం కూడా ఉంటుంది కాబట్టి.. ఈనేతలు చేసే సేవలకు విస్తార మైన పరిధి, ప్రభావం.. ఫలితం కూడా ఉంటుంది. కట్ చేస్తే.. ప్రస్తుత కూటమి పార్టీల నాయకులు.. ఇవన్నీ వదిలేసి మరో కొత్తదారి వెతుక్కున్నారు. ఆ విషయాన్ని వారేమీ దాచుకోవడం లేదు. బహిరంగంగానే చెబుతున్నారు. ఇప్పుడు ఈ వ్యవహారమే ఆసక్తిగా మారింది.
తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్‌రెడ్డి ప్రజలకు సేవ చేసేందుకు మద్యం దుకాణాల నుంచి కమీషన్ తీసుకుంటానని బహిరంగంగానే చెప్పారు. ఒక్కొక్క దుకాణ యజమానీ 20 శాతం సొమ్మును సేవలకు ఇవ్వాలని ఆయన హుకుం జారీ చేశారు. ఇక, దీనికి తాను 15 శాతం కలిపి తాడిపత్రి నియోజకవర్గాన్ని అద్భుతంగా తీర్చిదిద్దుతానని.. ఇది తప్పనేవాడు అసలు మనిషే కాదని కూడా చెప్పేశారు. కట్‌చేస్తే.. మరి ప్రభుత్వం ఉన్నదెందుకు? నియోజకవర్గం నిధులు ఏం చేస్తారు? మునిసిపల్ చైర్మన్‌గా ఆయన ఏం చేస్తారు? అన్నదానికి ఆయన సమాధానం చెప్పాలి.
ఇక, ప్రభుత్వంలో కీలక మంత్రిగా ఉన్న ఒకరు.. తన నియోజకవర్గంలో యువతకు ఉపాధి చూపించేందు కు నడుం బిగించారు. అయితే.. ఆ ఉపాధి ఎలా? అన్న విషయంపై ఆయన ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ``మద్యం దుకాణాలు పెట్టడం ద్వారా వారిని ప్రోత్సహించి.. ఉపాధి కల్పించాలని లక్ష్యం పెట్టుకున్నా. అందుకే మా నియోజకవర్గంలో యువతతో 100 దరఖాస్తులు చేయించా. ఇది తప్పెలా అవుతుంది. విమర్శలు చేసేవాళ్లకు మైండ్ దొబ్బింది`` అనేశారు.
మంత్రి గారి ఐడియా అద్భుతం అనాలి. ఎందుకంటే.. ప్రతి ఎమ్మెల్యే, ప్రతి మంత్రి కూడా తమ తమ నియోజకవర్గాల్లో యువతకు ఉపాధి, ఉద్యోగాలు కల్పించేందుకు వారితో షాపులకు దరఖాస్తులు చేయిస్తే బాగుండేది. అప్పుడు రాష్ట్రం మద్యం దుకాణాలతోనూ.. మద్యం షాపుల్లో పనిచేసేవారితోనూ కళకళలాడేది. కానీ, ఈ ఐడియా ఆయనకు మాత్రమే వచ్చింది. తప్పు పట్టిన వారు తలపగిలి ఛస్తారేమో!!