Begin typing your search above and press return to search.

పెద్దారెడ్డి ఎఫెక్ట్‌: జేసీల యాత్రలు షురూ!

తాడిప‌త్రి నియోజ‌క‌వ‌ర్గంలో సుమారు 12 రోజుల పాటు ఈ యాత్ర సాగనుంద‌ని జేసీ ప్ర‌భాక‌ర్‌రెడ్డి చెప్పా రు

By:  Tupaki Desk   |   17 Jan 2024 9:24 AM GMT
పెద్దారెడ్డి ఎఫెక్ట్‌:  జేసీల యాత్రలు షురూ!
X

''లేదు లేదు.. పెద్దారెడ్డి పాత్రేలేదు. అంతా మాదే. అంతా మేమే. వ‌చ్చే ఎన్నిక‌ల్లో మాదే గెలుపు!''- అని పైకి చెబుతున్నంత ఈజీగా అయితే.. అనంతపురం జిల్లా తాడిప‌త్రి రాజ‌కీయాలు క‌నిపించ‌డం లేదు. పెద్దారెడ్డి హ‌వా.. ఒక్క‌సారికే ఉఫ్‌! అనుకున్న మాజీ ఎమ్మెల్యే జేసీ ప్ర‌భాక‌ర్‌రెడ్డికి ఈ విష‌యం ఎప్పుడో తెలిసింది. అందుకే త‌ర‌చుగా ఆయ‌న ఉద్య‌మాలు.. నిర‌స‌న‌లు అంటూ రోడ్డెక్కుతున్నారు. ఇక‌, ఎన్నిక‌ల స‌మ‌యం వ‌చ్చే స‌రికి.. తాడిప‌త్రి ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి వ్యూహాల‌ను అడ్డుకునేందుకు ఇప్పుడు రెడీ అయ్యారు.

ఈ క్ర‌మంలో జేసీ ప్ర‌భాక‌ర్ రెడ్డి తాజాగా బ‌స్సు యాత్ర‌ను ప్రారంభించారు. గ‌త ఎన్నిక‌ల్లో ఆయ‌న త‌న కుమారుడు అస్మిత్ రెడ్డిని ఇక్క‌డ నిల‌బెట్టారు. అయితే.. ఆయ‌న ఓడిపోయారు. వ‌చ్చే ఎన్నిక‌ల్లోనూ త‌న కుమారుడిని నిల‌బెట్టాల‌ని చంద్ర‌బాబు చెవిలో పోరుపెడుతున్నారు. దీనిపై అధినేత ఇంకా నిర్ణ‌యం తీసుకోలేదు. కానీ, ఇంత‌లోనే.. జేసీ ప్ర‌భాక‌ర్‌.. బ‌స్సు యాత్ర‌కు శ్రీకారం చుట్టారు. 'యువ చైత‌న్య ర‌థం' పేరుతో ఆయ‌న ముందుకు సాగుతున్నారు.

తాడిప‌త్రి నియోజ‌క‌వ‌ర్గంలో సుమారు 12 రోజుల పాటు ఈ యాత్ర సాగనుంద‌ని జేసీ ప్ర‌భాక‌ర్‌రెడ్డి చెప్పా రు. పెద్దవడుగూరు మండలం నుంచి ప్రారంభం కానున్న ఈ యాత్ర.. రోజుకు 4 గ్రామాల్లో న‌డుస్తుంద‌ని ఆయ‌న వివ‌రించారు. యువ చైతన్య రథం బస్సు యాత్రకు జేసీ కుటుంబ సభ్యులు ప్రత్యేక పూజలు చేసి, జేసీ నివాసం నుంచి బ‌య‌లు దేశారు. ఈ యాత్ర సంద‌ర్భంగా ప్ర‌తి గ్రామంలోనూ స‌భ‌లు పెట్టేలా ప్లాన్ చేశారు. యువ‌త‌ను ఆక‌ర్షించేలా .. సొంత అజెండాను ప్ర‌క‌టించే అవ‌కాశం కూడా ఉంద‌ని తెలుస్తోంది.

మొత్తంగా.. జేసీ ప్ర‌భాక‌ర్‌.. బ‌స్సు యాత్ర విష‌యం రాజ‌కీయ ప్రాధాన్యం సంత‌రించుకుంది. 45 ఏళ్ల రాజ‌కీయ చ‌రిత్ర‌లో జేసీలు ఏనాడూ.. పాద‌యాత్రలు, బ‌స్సు యాత్ర‌లు చేసిన సంద‌ర్భాలు కానీ.. చూసిన సంద‌ర్భాలు కానీ లేవంటే ఆశ్చ‌ర్యం వేస్తుంది. మేమే రాజులం.. అన్న‌ట్టుగా వ్య‌వ‌హ‌రించిన జేసీల కుటుంబం నేడు పెద్దారెడ్డి ఎఫెక్ట్‌తో నేల‌పైకి దిగివ‌చ్చార‌నేది నిర్వివాదాంశం. అధినేత‌ను సైతం ధిక్క‌రించేలా రాజ‌కీయాలు చేసిన జేసీల కుటుంబం.. యాత్ర‌లు చేప‌ట్టడం.. రాజ‌కీయ వ‌ర్గాల్లో చ‌ర్చ‌నీయాంశం అయింది.