Begin typing your search above and press return to search.

చంద్రబాబుకి టీడీపీ సీనియర్‌ నేత ఝలక్‌!

ఆంధ్రప్రదేశ్‌ లో ఉచిత ఇసుక విధానం తెచ్చామని, ఇక ఎలాంటి ఇసుక అక్రమ తవ్వకాలు ఉండబోవని ముఖ్యమంత్రి చంద్రబాబు

By:  Tupaki Desk   |   27 Aug 2024 7:15 AM GMT
చంద్రబాబుకి టీడీపీ సీనియర్‌ నేత ఝలక్‌!
X

ఆంధ్రప్రదేశ్‌ లో ఉచిత ఇసుక విధానం తెచ్చామని, ఇక ఎలాంటి ఇసుక అక్రమ తవ్వకాలు ఉండబోవని ముఖ్యమంత్రి చంద్రబాబు, ఇతర టీడీపీ నేతలు చెబుతున్న సంగతి తెలిసిందే. కూటమి పార్టీ నేతలు ఎవరూ ఇసుక అక్రమ రవాణాలో లేరని ఆ పార్టీల నేతలు చెబుతున్నారు. రాష్ట్రంలో ఎక్కడా కూడా ఇసుక అక్రమ రవాణా జరగటం లేదని చెబుతున్న చంద్రబాబుకు సొంత పార్టీ నేతే తాజాగా షాక్‌ ఇచ్చారు.

ఈ క్రమంలో టీడీపీ అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబుకు ఆ పార్టీ సీనియర్‌ నేత, అనంతపురం జిల్లా తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్‌ రెడ్డి ఝలక్‌ ఇచ్చారు. తన నియోజకవర్గంలో ఇసుక ఆక్రమ రవాణా జరుగుతున్న మాట వాస్తవమేనని ఆయన కుండబద్దలు కొట్టారు. ఏకంగా తన వర్గానికి చెందిన వాళ్లే ఈ పని చేస్తున్నారని చెబుతూ జేసీ ప్రభాకర్‌ రెడ్డి తాజాగా ఒక వీడియో విడుదల చేశారు. ఈ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ గా మారింది.

తన వర్గానికి చెందిన సుమారు 25 మంది టీడీపీ నేతలే ఇసుక తరలిస్తున్నారని జేసీ ప్రభాకర్‌ రెడ్డి ఆ వీడియోలో వెల్లడించారు. వెంటనే ఇసుక అక్రమ రవాణా ఆపాలని ఆయన హెచ్చరించారు. లేకపోతే తానే చర్యలు తీసుకుంటానని తన అనుచరులకు వార్నింగ్‌ ఇచ్చారు.

నియోజకవర్గంలో 2.50 లక్షల మంది ఓటర్లు ఉన్నారని.. మీకు మాత్రమే డబ్బులా అని జేసీ ప్రశ్నించారు. మీరంతా తన ఆప్తులని.. ఐదేళ్లు తన కోసం కష్టపడ్డారని చెప్పారు. దయచేసి ఇలాంటి పనులు (ఇసుక అక్రమ రవాణా) చేసి తనకు దూరం కావద్దని కోరారు. గత ప్రభుత్వంలో ఇసుక అక్రమ రవాణాపై పోరాటం చేశానని.. ఇప్పుడు మీరు (జేసీ అనుచరులు) కూడా అదే పనిచేయొద్దని తన అనుచరులకు హితవు పలికారు. వెంటనే ఇసుక అక్రమ రవాణాను ఆపేయాలని కోరారు. టిప్పర్లు దొరికితే అవి రోడ్డుపై తిరగవని వార్నింగ్‌ ఇచ్చారు.

ఆంధ్రప్రదేశ్‌ లో ఇసుక చుట్టూ రాజకీయాలు తిరుగుతున్నాయి. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో ఆ పార్టీ నేతలు ఇసుక అక్రమ తవ్వకాలు, తరలింపు ద్వారా వేల కోట్ల రూపాయలు దోచుకున్నారని టీడీపీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు తీవ్ర ఆరోపణలు చేసింది. వైసీపీ అధినేత వైఎస్‌ జగన్‌ సమీప బంధువు ఇసుక రీచ్‌ ల్లో అక్రమ తవ్వకాల్లో చక్రం తిప్పుతున్నారని.. ఆయన ద్వారా వైఎస్‌ జగన్‌ కు కూడా ముడుపులు అందుతున్నాయని టీడీపీ నేతలు తీవ్ర విమర్శలు చేశారు.

ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో ఉచిత ఇసుక విధానాన్ని అందుబాటులోకి తెచ్చింది. అయితే ఇది మధ్యంతర విధానమే. పూర్తి స్థాయి ఇసుక విధానాన్ని ప్రభుత్వం ప్రకటించాల్సి ఉంది. ప్రస్తుతం నిర్దేశిత తవ్వకపు చార్జీలు, రవాణా చార్జీలు చెల్లించి ఇసుకను ఎవరైనా ఉచితంగా పొందొచ్చు. అలాగే పట్టా భూముల్లోనూ ఇసుక తవ్వకాలకు అనుమతులు ఇవ్వాలని ప్రభుత్వం భావిస్తోంది. ఇలా చేస్తే ఇసుక కొరతను అరికట్టవచ్చని భావిస్తోంది.

అయితే వైసీపీ నేతలు.. కూటమి నేతలపై తీవ్ర ఆరోపణలు చేస్తున్నారు. తాము అధికారంలోకి వచ్చేనాటికి రాష్ట్రంలో 48 లక్షల టన్నుల ఇసుక స్టాక్‌ యార్డుల్లో ఉందని చెబుతున్నారు. ఈ క్రమంలో ఎన్నికల ఫలితాలు వచ్చాక.. ప్రభుత్వ ఏర్పాటుకు మధ్యలోనే 48 లక్షల టన్నుల ఇసుకలో 23 లక్షల టన్నుల ఇసుకను కూటమి పార్టీల నేతలు అక్రమంగా తరలించేసి అమ్ముకున్నారని వైసీపీ నేతలు విమర్శిస్తున్నారు.

ఈ నేపథ్యంలో తాడిపత్రి మున్సిపల్‌ చైర్మన్, టీడీపీ మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్‌ రెడ్డి విడుదల చేసిన వీడియో ఆ పార్టీలో ప్రకంపనలు రేపుతోంది. టీడీపీ నేతలే ఇసుక అక్రమ రవాణా చేస్తున్నారని జేసీ ఆరోపించడం కలకలం సృష్టిస్తోంది.