Begin typing your search above and press return to search.

150 వాహనాలతో జేసీ ప్రభాకర్ రెడ్డి.. పోలీసులపై సంచలన వ్యాఖ్యలు!

వాస్తవానికి ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికలకు ముందు, పోలింగ్ రోజున తాడిపత్రిలో రాళ్ల దాడులు జరిగాయి.

By:  Tupaki Desk   |   24 July 2024 10:02 AM GMT
150 వాహనాలతో జేసీ ప్రభాకర్  రెడ్డి.. పోలీసులపై సంచలన వ్యాఖ్యలు!
X

తనపై వైసీపీ ప్రభుత్వ హయాంలోతో పాటు ఎన్నికల సమయంలోనూ పలు తప్పుడు కేసులు పెట్టారంటూ గత కొన్ని రోజులుగా మాజీ ఎమ్మెల్యే, తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి ఆరోపణలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఇక ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 50 రోజులు దాటడంతోనో ఏమో కానీ నేరుగా ఆయన రంగంలోకి దిగారు. ఈ మేరకు 150 వాహనాల కాన్వాయ్ ను ఏర్పాటు చేసుకుని బయలుదేరారు!

అవును... తన మీద, టీడీపీ కార్యకర్తలమీదా తప్పుడు కేసులు పెట్టారని, అవి నిజమైన కేసులే అయితే సాక్ష్యాలు చూపించాలని నాటి నుంచీ పోలీసులను డిమాండ్ చేస్తున్న జేసీ ప్రభాకర్ రెడ్డి... కొడుకు ఎమ్మెల్యేగా గెలిచారనో, కూటమి కూడా అధికారంలోకి వచ్చేసిందనో ఏమో కానీ.. బుధవారం తన అనుచరులతో సుమారు 150 వాహనాల్లో తాడిపత్రి నుంచి అనంతపురం వన్ టౌన్ పోలీస్ స్టే షన్ కు బయలుదేరి వెళ్లారు.

వాస్తవానికి ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికలకు ముందు, పోలింగ్ రోజున తాడిపత్రిలో రాళ్ల దాడులు జరిగాయి. ఆ సమయంలో పోలీసులు వైసీపీ నాయకులకు అనుకూలంగా వ్యవహరించారని.. తమపై తప్పుడు కేసులు పెట్టారని.. చాలా మంది టీడీపీ కార్యకర్తలను జైలుకు పంపించారని జేసీ ప్రభాకర్ రెడ్డి ఆరోపిస్తూనే ఉన్నారు. ఆ రోజు వైసీపీ నేతలు చెప్పినట్లుగా పోలీసులు నడుచుకున్నారని అన్నారు!

ఈ నేపథ్యంలో తాజాగా అనంతపురం పోలీస్ స్టేషన్ ముందు నిరసన వ్యక్తం చేసిన జేసీ ప్రభాకర్ రెడ్డి... పోలింగ్ రోజు తాడిపత్రిలో జరిగిన రాళ్ల దాడికి తనతో పాటు టీడీపీ కార్యకర్తలకూ ఏమి సంబంధమని కేసులు పెట్టారో చెప్పాలని పోలీసులను డిమాండ్ చేశారు! అసలు తాము రాళ్ల దాడి చేసినట్లు చెప్పడానికి పోలీసుల వద్ద ఉన్న సాక్ష్యాలు ఏమిటని నిలదీశారు.

దీంతో... జేసీపీకి నచ్చ చెప్పడానికి పోలీసుల తల ప్రాణం తోకకు వచ్చిందని అంటున్నారు! ఈ సమయంలోనే... తమపై వైసీపీ ప్రభుత్వంలో పెట్టిన తప్పుడు కేసులను ఉపసంహరించుకొవాలని డిమాండ్ చేస్తూ అనంతపురం ఎస్పీని కలవడానికి బయలుదేరి వెళ్లారు ప్రభాకర్ రెడ్డి.

కాగా... అసెంబ్లీ ఎన్నికల సమయంలో వైఎస్ జగన్ అండదండలతో తనను, టీడీపీ కార్యకర్తలను హింసించి, తమ మీద తప్పుడు కేసులు పెట్టారని గత కొన్ని రోజులుగా జేసీ ప్రభాకర్ అరోపణలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా.. అప్పటి ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి ఒత్తిడి మేరకు తమపై తప్పుడు కేసులు పెట్టారని, వాటిని ఎత్తేయాలని, అలాకాని పక్షంలో తమ సత్తా చూపిస్తామని జేసీ ప్రభాకర్ రెడ్డి చెబుతున్నారు!