చెప్పినట్లే రాజీనామాకు రెఢీ..జేసీ ప్రభాకర్ రెడ్డి
మాట ఇవ్వటం ఎవరైనా ఇస్తారు. కానీ.. చేతల్లో చేసి చూపటం అంత తేలికైన విషయం కాదు
By: Tupaki Desk | 6 Jun 2024 12:57 PM GMTమాట ఇవ్వటం ఎవరైనా ఇస్తారు. కానీ.. చేతల్లో చేసి చూపటం అంత తేలికైన విషయం కాదు. అందునా.. చేతిలోని అధికారాన్ని.. పదవిని త్యాగం చేయటం.. అది కూడా ఇచ్చిన మాటలకు తగ్గట్లే అంటే సామాన్యమైన విషయం కాదు. తాజాగా అలాంటి చర్యకు సిద్ధమయ్యారు తాడిపత్రి మున్సిపల్ ఛైర్మన్ కం టీడీపీ సీనియర్ నేత జేసీ ప్రభాకర్ రెడ్డి. గడిచిన ఐదేళ్లలో వైసీపీ ప్రభుత్వంతో హోరాహోరీగా పోరాడిన ఆయన.. ఇప్పుడు తన పదవిని తన వర్గంలోని ఒకరికి ఇచ్చేయనున్నట్లుగా వెల్లడించారు.
మరో నెల వ్యవధిలో తన మున్సిపల్ ఛైర్మన్ పదవికి రాజీనామా చేస్తానని చెప్పిన జేసీ ప్రభాకర్.. తాజాగా ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్ లో మాట్లాడారు. ‘‘మున్సిపల్ ఛైర్మన్ పదవికి నెల రోజుల్లోరాజీనామా చేస్తున్నా. ఆ పదవిని పార్టీ నేతల్లో ఒకరికి అప్పగిస్తా’’ అని వెల్లడించారు. తన ఫ్యూచర్ ప్లాన్ గురించి వివరంగా చెప్పనప్పటికీ.. నియోజకవర్గం మీద పట్టు పెంచుకోవటానికి వీలుగా తాజా నిర్ణయం తీసుకున్నట్లు చెబుతున్నారు.
తన కొడుకు జేసీ ఆస్మిత్ రెడ్డిని తాడిపత్రి ఎమ్మెల్యేగా గెలిపించుకున్న ఆయన.. టీడీపీ ప్రభుత్వంలో కీలకంగా వ్యవహరించనున్నారు. గడిచిన ఐదేళ్లలో స్థానిక వైసీపీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డితో పోరాటం చేసిన ఆయన.. పోటాపోటీ రాజకీయాలు చేశారు. ఎమ్మెల్యేతో ఏ మాత్రం తగ్గని ఆయనకు పలు ఇబ్బందులు ఎదురయ్యాయి. అయినప్పటికీ వాటిని ఓర్చుకొని ఎన్నికల్లో తన కొడుకును గెలిపించుకోవటం ద్వారా పూర్వ వైభవాన్ని పొందాలని ఆయన శాయిశక్తులా క్రషి చేశారు.
తాజాగా ఆయన అనుకున్నట్లే కొడుకు ఎన్నికల్లో విజయం సాధించటమే కాదు.. పార్టీ సైతం సంచలన రీతిలోగెలిచి.. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనుండటంతో.. ఆయన తన వ్యూహాలకు పదును పెడుతున్నట్లుగా చెప్పాలి. ఆయనకు టీడీపీ ప్రభుత్వంలో కీలక పదవి దక్కుతుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. 2025లో స్థానిక సంస్థల ఎన్నికలు జరిగే వీలున్న నేపథ్యంలో.. ఆయన తీరు ఏ రీతిలో ఉంటుందన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.