Begin typing your search above and press return to search.

'గ్రీన్ కార్డు' మీద జేడీ వాన్స్ వ్యాఖ్యల్లో అంత వివాదాస్పదం ఉందా?

దేశం ఏదైనా.. అందులో నివిసించే వారు తప్పుడు పనులకు పాల్పడినా.. రాజ్యానికి వ్యతిరేకంగా వ్యవహరించినా.. వారి విషయంలో కటువుగా వ్యవహరించటం తప్పేంకాదు.

By:  Tupaki Desk   |   15 March 2025 9:48 AM IST
గ్రీన్ కార్డు మీద జేడీ వాన్స్ వ్యాఖ్యల్లో అంత వివాదాస్పదం ఉందా?
X

కొన్నిసార్లు అంతే.. తీసుకునే ప్రతి నిర్ణయాన్ని భూతద్దంలో వేసుకొని చూడటం.. వ్యాఖ్యలు.. వ్యాఖ్యానాలతో విపరీత అర్థాలు తీయటం అలవాటుగా ఉంటుంది. అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ తాజాగా చేసిన వ్యాఖ్యలకు చెప్పే అర్థాల్ని చూస్తే ఈ విషయం అర్థమవుతుంది. దేశం ఏదైనా.. అందులో నివిసించే వారు తప్పుడు పనులకు పాల్పడినా.. రాజ్యానికి వ్యతిరేకంగా వ్యవహరించినా.. వారి విషయంలో కటువుగా వ్యవహరించటం తప్పేంకాదు. అలానే విదేశీయులు ఒక దేశంలో స్థిరపడి.. అక్కడి పౌరసత్వాన్ని సొంతం చేసుకున్న తర్వాత.. ఆ దేశ సమైక్యతను.. సమగ్రతను దెబ్బ తీసేలా వ్యవహరిస్తే.. అతడిపై చర్యలు తీసుకుంటామని చెప్పటంలో తప్పేంటి? అన్నది ప్రశ్న.

తాజాగా అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ చేసిన సంచల ప్రకటన సారాంశం.. దాని వెనుకున్న కారణాల్ని చూస్తే.. మీడియా.. సోషల్ మీడియాల అతి స్పందన తప్పించి.. అందులో అర్థమేమీ లేదన్న భావన వ్యక్తమవుతుంది. అమెరికాలో గ్రీన్ కార్డుదారులు శాశ్వత నివాసులుగా ఉండలేరని చెప్పటం తెలిసిందే. ఒక చానల్ తో మాట్లాడిన సందర్భంలో ఆయన.. ‘గ్రీన్ కార్డు పొందినంత మాత్రాన వారికి అమెరికాలో ఎల్లకాలం ఉండిపోయే హక్కు లేదు. ఇది వాక్ స్వేచ్ఛకు సంబంధించిన అంశం కాదు. జాతీయ భద్రతకు సంబంధించిన అంశం. అమెరికా పౌరులుగా ఎవరిని మాలో విలీనం చేసుకోవాలో మేం నిర్ణయిస్తాం. విదేశీ వ్యవహారాల మంత్రి కానీ.. అధ్యక్షుడు కానీ ఎవరైనా ఒక వ్యక్తిని అమెరికాలో ఉండరాదని నిర్ణయిస్తే.. అటువంటి వారికి ఇక్కడ నివసించేందుకు ఎలాంటి చట్టబద్ధమైన హక్కు ఉండదు’ అని తేల్చి చెప్పారు.

ఈ వ్యాఖ్యలు ఎవరిని ఉద్దేశించి చెప్పారన్నది ముఖ్యం. అమెరికా గ్రీన్ కార్డు (అధికారిక శాశ్వత నివాస హోదా) ఉన్న మహ్మద్ ఖలీల్ అనే కొలంబియా వర్సిటీ విద్యార్థి ఇటీవల స్థానిక విశ్వవిద్యాలయాల్లో పాలస్తీనా అనుకూల.. ఇజ్రాయెల్ వ్యతిరేకంగా నిర్వహించే ఆందోళనల్లో నాయకత్వం వహించాడు. అతడ్ని గత శనివారం అరెస్టు చేశారు. అంతేకాదు.. అతడికి జారీ చేసిన గ్రీన్ కార్డును రద్దు చేసి అతడి స్వదేశమైన సిరియాకు తిరిగి పంపే ప్రయత్నాల్ని షురూ చేసింది ట్రంప్ సర్కారు. ఈ నేపథ్యంలో వాన్స్ వ్యాఖ్యలు ఉన్నాయి.

వాస్తవం ఇలా ఉన్నప్పుడు.. గ్రీన్ కార్డు పొందిన వారి నెత్తిన ఏదో బాంబు వేసినట్లుగా వాన్స్ వ్యాఖ్యలకు విపరీతార్థాలు తీయటంలో అర్థం లేదనే చెప్పాలి. చాలా అరుదైన సందర్భాల్లో ఈ తరహా నిర్ణయాలు ఉంటాయన్నది మర్చిపోకూడదు. తాజాగా ట్రంప్ సర్కారు తీసుకున్న నిర్ణయంలో అప్రజాస్వామ్య నిర్ణయం ఉంటే ఖండించటంలో తప్పు లేదు. నిజానికి అమెరికా ఆమోదించిన ఇమ్మిగ్రేషన్.. జాతీయతా చట్టం 1952ను చూసినప్పుడు కూడా.. దేశ విదేశాంగ విధానానికి వ్యతిరేకంగా వ్యవహరించే వలసదారులు ఎవరైనా సరే.. వారిని వెనక్కి పంపించే వీలుంది. అదే సమయంలో నేరాలకు పాల్పడినా.. సుదీర్ఘ కాలం దేశంలో నివసించకపోయినా.. వలస నిబంధనల్ని పాటించటంలో ఫెయిల్ అయినా ఈ తరమా చర్యల్ని తీసుకోవచ్చు.

అయితే.. ఈ చట్టాన్ని చాలా అరుదైన సందర్భాల్లోనే ప్రయోగిస్తారని న్యాయవర్గాలు వ్యాఖ్యానిస్తున్నారు. నిజానికి ప్రతి దేశానికి తనకంటూ ఒక విదేశాంగ విదానం ఉంటుంది. దేశ ప్రయోజనాలు ఇందులో ఉంటాయి. అలాంటి వేళ.. దేశ ప్రయోజనాలకు ఇబ్బంది కలిగించేలా వ్యవహరించటంలో అర్థం లేదు. అలాంటి వేళలో చర్యల కత్తిని ఝుళింపించటం తప్పేం కాదు. అలా అని.. రాజ్యం తన రాజకీయ అవసరాల కోసం తప్పుడు నిర్ణయాల్ని తీసుకుంటే వేలెత్తి చూపటానికి వెనుకాడాల్సిన అవసరం లేదు. అందుకు భిన్నంగా వ్యవహరించే వారి విషయంలో కఠిన చర్యలు మిగిలిన వారికి హెచ్చరికగా మారుతుందని చెప్పాలి.

ఇదిలా ఉండగా.. పాలస్తీనియన్లకు అనుకూలంగా ఆందోళన చేస్తూ క్యాంపస్ భవనాన్ని తమ స్వాధీనంలోకి తీసుకున్న కొందరు విద్యార్థులను తమ వర్సిటీ నుంచి బహిష్కరించినట్లుగా కొలంబియా విశ్వవిద్యాలయం ప్రకటన చేయటం తెలిసిందే. పట్టభద్రులైన కొందరి డిగ్రీలను కూడా రద్దు చేసినట్లుగా పేర్కొంది. గాజాలో యుద్ధాన్నినిరసిస్తూ గతంలో హమిల్టన్ హాల్ ను అక్రమించిన వారిపై వర్సిటీ లీగల్ డిపార్టుమెంట్ భారీగా ఆంక్షలు విధించిన వైనాన్ని వర్సిటీ తన అధికారిక ప్రకటనలో వెల్లడించింది. మొత్తంగా దేశ సమగ్రతను సందేహాల్లో పడేసే చర్యల్ని ఏ దేశం ఊపేక్షించటంలో అర్థం లేదనే చెప్పాలి.